Andhra Pradesh: మిర్చి రైతులకు అమ్మకాల కష్టాలు

Sales Difficulties for Chilli Farmers | Telugu News
x

Andhra Pradesh: మిర్చి రైతులకు అమ్మకాల కష్టాలు

Highlights

Andhra Pradesh:రెండుర్రోజులుగా భారీగా పడిపోయిన మిర్చి ధరలు

Andhra Pradesh: పండించిన పంట అమ్ముకోవాలో నిల్వ ఉంచుకోవాలో తెలియని దుస్థితిలో మిర్చి రైతు విలవిలలాడుతున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఆరుగాలం శ్రమించిన రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. అనూహ్యంగా మిర్చి ధర పెరిగిందని ఆనందించేలోపలే ఒక్కసారికి ధరను దళారులు తగ్గించడంతో రేపేం జరుగుతుందోనన్న టెన్షన్లో రైతు ఆందోళన చెందుతున్నాడు. మిర్చిని అమ్మాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు. మొన్నటి వరకు మంచి ధర పలికిన మిర్చికి ఇప్పుడు అమాంతంగా రెండు, మూడు వేలు తగ్గడంతో రైతు బేజారవుతున్నాడు. ఓపక్క వరుస సెలవులు మరోవైపు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచాలంటే ఖర్చులు తడిసిమెపెడు కావడంతో తల్లడిల్లుతున్నాడు. ఈ ఏడాది మిర్చి రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇటు అమ్మాలా లేక మంచి రేటు కోసం ఎదురు చూడాలా? తెలియని అయోమయ పరిస్థితిలో రైతు కూరుకుపోయాడు.

మిర్చి రైతులకు అమ్మకాల కష్టాలొచ్చాయ్. మొన్నటి వరకు మంచి మద్దతు ధర లభించడంతోపాటు. తాలుకాయలు సైతం క్వింటా రూ.10వేలు పలకడం రైతు కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది. హైబ్రీడ్‌ రకాలు రూ.18,500 వరకు కొనడంతో ఈ ఏడాది కష్టాలు తీరతాయనుకున్నాడు. కానీ రెండుర్రోజులుగా మార్కెట్ మాయాజాలంతో ధరలు భారీగా పడిపోయాయ్. రకాన్ని బట్టి వెయ్యికి పైగా తగ్గించేస్తూ దళారులు రైతుల్ని వంచిస్తున్నారు. ఇప్పటి వరకు కర్ణాటక ప్రాంతం నుంచి సరుకు ఎక్కువ రాగా ప్రస్తుతం గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని మిరప రైతులకు సంబంధించిన పంట మార్కెట్‌కు పోటెత్తుతోంది. ఐతే ధరలు ఒక్కసారిగా తగ్గడంతో అమ్ముదామా? ఆగుదామా? అనే సందిగ్ధంలో మిర్చి సాగుదారులు ఉన్నారు. గుంటూరు మిర్చియార్డులో పలికే ధరల ఆధారంగా ఇతర ప్రాంతాల్లోని వ్యాపారులు కొనుగోళ్లు చేస్తుంటారు. బుధవారం నుంచి ఆదివారం వరకు గుంటూరు మిర్చియార్డుకు సెలవులు ప్రకటించడంతో సోమవారం మార్కెట్ ఎలాంటి ట్విస్టులు ఇస్తోందనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ధరలు, ఆగిన కొనుగోళ్లు నేపథ్యంలో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచాలా లేదంటే ఉన్న ధరకు అమ్ముకోవాలో తేల్చుకేలేక సతమతమవుతున్నారు. పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయాలంటే ఆర్థిక భారం అవుతుంది. ఆ తర్వాత ధర ఎలా ఉంటుందో తెలియని దైన్యం. ఈ ఏడాది సాగులో ఎన్నో కడగండ్లను మిర్చి రైతులు చవిచూశారు. గతేడాది మిర్చి దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అయితే అధిక వర్షాలతో మిర్చితోటలు 40 శాతానికిపైగా దెబ్బతిన్నాయ్. దిగుబడులూ తగ్గాయి. ఎకరాకు గతంలో 30 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వచ్చే చేలల్లో కూడా ఈ ఏడాది 10 నుంచి 20 క్వింటాళ్ల మధ్య పంట చేతికందింది. తాలు కూడా అధికంగా ఉండటంతో రైతు దిగాలుపడుతున్నాడు. కానీ తాలుకు క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలకటంతో రైతులు కొంత ఊపిరిపీల్చుకున్నారు.

తక్కువ ధరకు అమ్మలేక ఈ ఏడాది మిర్చికి మంచి ధరలు ఉంటాయని అటు వ్యాపారులు, సాగుదారులు భావించారు. అయితే పంట దెబ్బతినడం, దిగుబడులు తగ్గే పరిస్థితితో బేజారవుతున్నారు. వచ్చిన దిగుబడులను వెంటనే అమ్మలేని పరిస్థితితో అప్పులపాలవుతామని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సంక్రాంతి నుంచి రైతులు దిగుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అయితే ఈ ఏడాది సకాలంలో పంటలు చేతిక అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మిరప కోతల కూలీలకు ప్రతి శనివారం చెల్లింపునకు అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది.

ప్రస్తుతం క్వింటా రూ.20 వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. తాలు కాయ క్వింటా రూ.10 వేలకు తగ్గకుండా, మేలి రకం క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా ధర ఉంటే.. ఈ ఏడాది గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ధరల స్థిరీకరణ జరిగితే ఎంతోకంత మేలుజరుగుతోందంటున్నారు. మద్దతు ధరకు తక్కువగా ఉంటే స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories