Tirumala: చిరుతే చంపేసింది.. చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

RUIA Hospital Forensic Declares That Leopard Attack on Lakshitha
x

Tirumala: చిరుతే చంపేసింది.. చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

Highlights

Tirumala Ghat Road: తిరుమల దైవ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబానికి మెట్ల మార్గంలో తీరని విషాదం మిగిలింది.

Tirumala Ghat Road: తిరుమల దైవ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబానికి మెట్ల మార్గంలో తీరని విషాదం మిగిలింది. కన్నబిడ్డలతో వెంకన్న మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా.. అల్లారుముద్దుగా పెంచుకున్న పాపను చిరుత పులి ఎత్తుకెళ్లింది. ఆపై నరసింహస్వామి ఆలయ సమీపాన చంపేసింది. లక్షిత విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు తిరుమలగిరుల్లో మిన్నంటాయి.

తిరుమలలో దారుణం చోటుచేసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్‌ దంపతులు.. తమ గారాలపట్టి లక్షిత, బాబుతో కలిసి కారులో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయల్దేరారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో దేవదేవుని వద్దకు నడక సాగిస్తుండగా ఘోరం జరిగింది. క్రూరమృగం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. బాలిక లక్షితను చిరుత చంపేసింది.

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో లక్షిత సహా కుటుంబసభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా లక్షిత కనిపించకుండా పోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. సమీప ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే, రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు వీలుకాలేదు. ఇవాళ ఉదయం గాలింపు చేపట్టగా.. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

చిరుత దాడిలో చిన్నారి తల భాగం పూర్తిగా ఛిద్రమైంది. అదే ప్రాంతంలో చిన్నారి తలవెంట్రుకలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. అప్పటివరకు తమతో కలిసిమెలిసి ఆనందంగా కలిపిన లక్షిత.. విగతజీవిగా పడిఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు. తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. దీంతో.. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాద సాగరంలో మునిగిపోయింది. అటు.. బాలిక స్వగ్రామం పోతిరెడ్డిపాలెంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలిక అవ్వా, తాతలు, అమ్మమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లక్షిత మృతదేహాన్ని అంబులెన్స్‌లో రుయా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

అయితే.. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలికపై దాడి చేసింది చిరుత కాదని, ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. బాలిక తల వెంట్రుకలు తొలగించి ఉన్నాయంటున్న ఫారెస్ట్ అధికారులు.. ఎలుగుబంటి దాడిలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని చెప్పారు. పోస్ట్ మార్టం నివేదికలో నిజా నిజాలు తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు అన్నారు. మరోవైపు.. తిరుమలలో వరుస ఘటనలతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వన్యప్రాణులు ఆలయ పరిసరాల్లోకి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బాలిక లక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి స్పందించారు. టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించాలని కోరారు. అయితే.. ఇదే సమయంలో బాలిక మృతిపై ఆయన చేసిన కామెంట్స్‌.. సంచలనంగా మారాయి. బాలిక మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పూర్తిస్థాయిలో విచారించాలని అధికారులను ఆయన కోరారు.

ఫారెస్ట్ అధికారులు, ఎమ్మెల్యే కామెంట్ల నేపథ్యంలో బాలిక మృతి ఘటన.. చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. రుయా ఆస్పత్రిలో చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అయితే.. చిరుత దాడితోనే లక్షిత మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికపై దాడి చేసింది ఎలుగుబంటి అన్నట్టుగా ముందుగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం చిరుతదాడిలోనే బాలిక మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దీంతో.. చిన్నారి లక్షిత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపైనా చిరుత దాడి చేసింది. తాతతో పాటూ ఓ షాపు దగ్గర ఆగిన బాలుడ్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న పోలీసులు అప్రమత్తమై.. అటవీ ప్రాంతంవైపు వెళ్లి గాలించారు. ఈ క్రమంలో బాలుడ్ని చిరుత వదిలేసి వెళ్లింది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ఈ దాడి ఘటన జరిగిన వెంటనే అటవీశాఖ అధికారులు, టీటీడీ అప్రమత్తం అయ్యింది. బోనును ఏర్పాటు చేసి చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. చిరుత బెడద తప్పిపోయిందని భావిస్తున్న సమయంలో ఇప్పుడు చిరుత బాలికను చంపేయడం కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories