కరోనా సోకినా బిడ్డకు పాలు ఇవ్వచ్చు.. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి

కరోనా సోకినా బిడ్డకు పాలు ఇవ్వచ్చు.. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి
x
Highlights

ప్రసవం అనంతరం తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు పాలు ఇవ్వచ్చని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి చెప్పారు.

ప్రసవం అనంతరం తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు పాలు ఇవ్వచ్చని రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి చెప్పారు. ఏసమయంలో అయినా తల్లి పాలు బిడ్డకు శక్తిని ఇస్తాయన్నారు. శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ ( శ్వేత) ఆధ్వర్యంలో గురువారం ఆ కార్యాలయం నుంచి టీటీడీ మహిళా ఉద్యోగులకు ఆన్ లైన్ ద్వారా కరోనా అవగాహన కార్యకమం నిర్వహించారు. డాక్టర్ భారతి ఉద్యోగులకు తగిన జాగ్రత్తలు, కోవిడ్ 19 (కరోనా) అవగాహన అంశాలను వివరించారు.

గర్భవతులు జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. గర్భిణికి 8 లేదా 9వ నెలలో కరోన వస్తే బిడ్డకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రసవం తర్వాత బిడ్డకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని చెప్పారు. ప్రసవం తర్వాత తల్లి తన చేతులు సబ్భుతో గానీ, శానిటైజర్ తోగానీ, స్థనాలను నీటితో బాగా శుభ్రం చేసుకుని, మాస్క్ వేసుకుని బిడ్డకు పాలు ఇవ్వాలన్నారు. గర్భవతులు వేడినీరు బాగా తాగాలన్నారు.

అల్లం, బెల్లం, మిరియాలు ఉడికించిన కషాయం రోజుకు ఒకసారి 50 మిల్లీ లీటరు తాగితే మంచిదని, నిమ్మకాయ రసం తాగరాదని తెలిపారు. సి విటమిన్, బి కాంప్లెక్స్, జింక్ మాత్రలు డాక్టర్ సూచన మేరకు రోజూ తీసుకోవాలని సూచించారు. ఉత్త నీటితో కూడా ఆవిరి పట్టుకోవచ్చని చెప్పారు. మహిళా ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇంటికి వస్తూనే చేతులు, కాళ్ళు బాగా కడుక్కుని, మాస్క్ తీసి వేశాకే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆఫీసులో ఉన్నప్పుడు తరచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్ తప్పని సరిగా ధరించాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

శ్వేత డైరెక్టర్ శ్రీ రామాంజులు రెడ్డి మాట్లాడుతూ జులై 27వతేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా రోజూ 70 మంది ఉద్యోగులకు శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రావు, ఏఈఓ శ్రీమతి జగదీశ్వరి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories