Rewind 2024 - Andhra Pradesh: ఏపీ రాజకీయాలను అనూహ్యంగా మలుపు తిప్పిన సంవత్సరం

Rewind 2024 - Andhra Pradesh: ఏపీ రాజకీయాలను అనూహ్యంగా మలుపు తిప్పిన సంవత్సరం
x
Highlights

Rewind 2024 of AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 2024 మలుపు తిప్పింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ అధికారాన్ని కోల్పోయింది. 2019లో 151...

Rewind 2024 of AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను 2024 మలుపు తిప్పింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ అధికారాన్ని కోల్పోయింది. 2019లో 151 సీట్లు దక్కించుకున్న ఫ్యాన్ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 144 స్థానాల్లో గెలిచింది. బీజేపీ, జనసేనలతో కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ డీ ఏ ప్రభుత్వాలే అధికారంలో ఉండడంతో అమరావతి పనుల్లో వేగం పెరిగింది.

జగన్‌కు కోలుకోలేని దెబ్బ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పరాజయం పాలైంది. ఆ పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2019లో ఆ పార్టీ 151 సీట్లతో అధికారాన్ని దక్కించుకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి 164 స్థానాలను దక్కించుకున్నాయి. టీడీపీకి 45.60 శాతం ఓట్లు వచ్చాయి.

వైఎస్ఆర్ సీపీకి39.37 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలతో పాటు జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎంత ఉందో ఫలితాలే నిదర్శనమని అప్పట్లో టీడీపీ నాయకులు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలపై వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ 6న ప్రమాణం చేశారు. చంద్రబాబు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేన నుంచి కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కు చోటు దక్కింది. త్వరలోనే నాగబాబు కూడా చంద్రబాబు కేబినెట్ లో చేరనున్నారు.

అధికారానికి దూరం కావడంతో వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ బీద మస్తాన్ రావు వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారు. మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఆ పార్టీని వీడారు. మరికొందరు నాయకులు కూడా ఆ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఆ పార్టీ చీఫ్ జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. 2025 సంక్రాంతి నుంచి జిల్లాల వారీగా పర్యటించనున్నారు.

100 % పొలిటిషీయన్ పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఏర్పడిన పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ గెలిచి వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ, బీజేపీ తో కలిసి కూటమి ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

ఎన్ డీ ఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను మోదీ తుఫాన్ తో పోల్చారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కోరారు. ఆయన ఆహ్వానం మేరకు మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేశారు.

ఇది ఎన్ డీ ఏ కూటమికి కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్ డీ ఏ కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. ఇది జాతీయ స్థాయిలో ఆ పార్టీకి గుర్తింపు తెచ్చింది. 2024 గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ టాప్ 5 జాబితాలో నిలిచారు. డిప్యూటీ సీఎంగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నిస్తున్నారు.

అమరావతి ఊపిరి పీల్చుకో

ఎన్ డీ ఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల రుణం అందిస్తామని 2024-25 బడ్జెట్ లో కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ రుణంపై 15 ఏళ్లు మారటోరియం ఉంటుంది. దీనికి 4 శాతం వడ్డీ . రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం నిధులను కూడా కేంద్రమే సర్దుబాటు చేస్తుంది.

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు సంయుక్తంగా ఈ రుణాన్ని అందించేందుకు సుముఖతను తెలిపాయి. ఈ మేరకు కేంద్రానికి 2024 అక్టోబర్ లో లేఖ అందింది. ఇందులో భాగంగానే ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు అమరావతిలో పర్యటించారు.

మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ లో రూ. 2,348 కోట్లను విడుదల చేసింది. 75 శాతం నిధులను ఖర్చు చేస్తే మిగిలిన నిధులను విడుదల చేస్తామని కేంద్రం షరతు విధించింది. డిసెంబర్17న పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. 2026 అక్టోబర్ నాటికి నీటిని నిల్వ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

తిరుపతి లడ్డూ వివాదం

తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఈ ఏడాది సెప్టెంబర్ 18న చంద్రబాబు చేసిన ప్రకటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జులై 9,సెప్టెంబర్ 16న ఎన్ డీ డీ బీ రిపోర్టును టీడీపీ బయటపెట్టింది. టీటీడీ రిపోర్టును టీడీపీ కార్యాలయం నుంచి ఎలా విడుదల చేస్తారని వైఎస్ఆర్ సీపీ ప్రశ్నించింది.

కల్తీ నెయ్యిపై విచారణ జరిపేందుకు సెప్టెంబర్ 24న గుంటూరు రేంజ్ ఐటీ సర్వశ్రేష్టత్రిపాఠి చీఫ్‌గా సిట్ ఏర్పాటైంది. కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీం కోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 4న తీర్పును వెల్లడించింది.

ఇందులో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు, FSSAI అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినందుకు పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబర్ 22న దీక్షను ప్రారంభించి అక్టోబర్ 2న తిరుపతిలో దీక్ష విరమించారు. కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు సర్కార్ రాజకీయకక్షతో తమపై ఆరోపణలు చేసిందని వైసీపీ ఆరోపించింది.

రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా?

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజులకే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రెడ్ బుక్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ సమయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ఒక రెడ్ బుక్‌లో రాసుకుంటున్నానని లోకేష్ తెలిపారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సీపీకి చెందిన నాయకులపై వరుసగా కేసులు నమోదయ్యాయి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ సీపీ విమర్శిస్తోంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని వైఎస్ఆర్‌సీపీకి చెందిన నాయకులపై కేసులు నమోదయ్యాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేశ్, వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లపై కేసులు నమోదయ్యాయి. నందిగం సురేశ్, వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లు అరెస్టయ్యారు. సినీ నటులు శ్రీరెడ్డి తనను క్షమించాలని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంచార్జీ సజ్జల భార్గవ్ రెడ్డి తనపై నమోదైన కేసులపై కోర్టును ఆశ్రయించారు.

జగన్- వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం

అసెంబ్లీ ఎన్నికల్లో అన్న జగన్ పై షర్మిల విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య ఆస్తుల వివాదం తెరమీదికి వచ్చింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీకి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ లో జగన్, ఆయన భార్య వైఎస్ భారతి ఈ ఏడాది ఆగస్టు 27న పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కంపెనీలోని తన, తన భార్య వాటాలను అక్రమంగా తన తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని ఆ పిటిషన్ లో ఫిర్యాదు చేశారు. 2019 ఆగస్టు 31న ఒప్పందం ప్రకారం విజయమ్మను ట్రస్టీగా ఉంచి ఆ ట్రస్ట్ ద్వారా షర్మిలకు కంపెనీ షేర్లు భవిష్యత్తులో బదిలీ చేయాలి. దీని మేరకు విజయమ్మకు కొన్ని షేర్లు గిఫ్ట్ గా ఇచ్చారు.

కోర్టు అనుమతులు లభించిన తర్వాత ఈ షేర్లను బదిలీ చేయాలనేది జగన్ వాదన. అయితే తమ అనుమతి లేకుండానే గిఫ్ట్ డీడ్ ను ఎగ్జిక్యూట్ చేశారని జగన్ ఆ పిటిషన్ లో తెలిపారు. దీనిపై షర్మిల మండిపడ్డారు. ప్రతి కుటుంబంలో ఉండే గొడవలేనని జగన్ వ్యాఖ్యలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ఎంత ప్రతి ఇంట్లో ఉండే గొడవలే అయితే తల్లిపై ఎవరైనా కేసు వేస్తారా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ విజయమ్మ పేరుతో విడుదల చేసినట్లుగా చెబుతున్న లేఖ అప్పట్లో చర్చకు దారి తీసింది. షర్మిల, జగన్ పిల్లలకు సమానంగా ఆస్తి దక్కాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమతమని ఆమె ఆ లేఖలో చెప్పారు.

కాకినాడ పోర్ట్: 'సీజ్ ది షిప్'

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా నౌకను సీజ్ చేశారు అధికారులు. ఈ ఏడాది నవంబర్ 29న కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు బియ్యం తరలిస్తున్న నౌకను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బియ్యం అక్రమంగా తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీజ్ ది షిప్ అని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నౌకలో 4 వేల టన్నుల బియ్యం ఉంటే.. 1320 టన్నుల బియ్యం రేషన్ బియ్యం అని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి చెప్పారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు వినీత్ బ్రిజ్ లాల్ చీఫ్ గా కొనసాగుతారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నమోదైన 13 ఎఫ్ఐఆర్ లపై ఈ సిట్ విచారణ చేయనుంది. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపులో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారనే దానిపై సిట్ విచారణ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories