Vijayawada Floods: ప్రజల ప్రాణాలు కాపాడిన రిటైనింగ్ వాల్... దీన్ని కట్టిందెవరు... ఆ క్రెడిట్ ఎవరిది?

Vijayawada Floods: ప్రజల ప్రాణాలు కాపాడిన రిటైనింగ్ వాల్... దీన్ని కట్టిందెవరు... ఆ క్రెడిట్ ఎవరిది?
x
Highlights

ప్రస్తుతం విజయవాడలో ఒక అంశం హాట్ టాపిక్ అయికూర్చుంది. ఇంతకీ ఏంటా విషయం అంటే... క్రిష్ణలంక రిటైనింగ్ వాల్ మొత్తం క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అని.

Vijayawada Retaining Wall Constructed by Whom: విజయవాడలో క్రిష్ణమ్మ ఉప్పోంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. విజయవాడలో భారీ వర్షాలు, వరద నీటితో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, ప్రాజెక్టుల నుండి వస్తోన్న వరద నీటితో క్రిష్ణా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇంత కష్టకాలంలోనూ ప్రస్తుతం విజయవాడలో ఒక అంశం హాట్ టాపిక్ అయికూర్చుంది. ఇంతకీ ఏంటా విషయం అంటే... క్రిష్ణలంక రిటైనింగ్ వాల్ మొత్తం క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అని.

నిన్న వైఎస్ జగన్ క్రిష్ణలంక ప్రాంతంలో పర్యటించి బ్రిడ్జిపై నుండి రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాల ప్రజలను పరామర్శించి వెళ్లారు. తమ నాయకుడు జగన్ చొరవ వల్లే ఇవాళ ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే క్రిష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంపై వైసీపీ, తెలుగు దేశం పార్టీల మధ్య క్రెడిట్ గొడవ మొదలైంది. ఒకవైపు దశాబ్ధాల తరబడి ఎన్నడూ చూడని వర్షం, వరద ఇప్పుడే చూస్తున్నామని బరువెక్కిన గుండెతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన క్రెడిట్ తమదేనని వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఇంత భారీ వర్షం, వరదల్లోనూ రిటైనింగ్ వాల్ చుట్టే తిరుగుతున్న రాజకీయాలు..

ఈ ఏడాది మార్చి నెలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో క్రిష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం చేశారు. 2.7 కిమీ పొడవుతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్ల రాణిగారి తోట, భూపేష్ గుప్త నగర్, తారక రామ నగర్, క్రిష్ణ లంక పరిసర ప్రాంతాల ప్రజలకు కృష్ణా నది నుండి వచ్చే వరద ముంపు లేకుండా అడ్డుకట్టలా నిలిచింది.

వైసీపీ ఏం చెబుతోంది..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయకపోయి ఉంటే.. ఈ వరదలకు కృష్ణలంకతో పాటు ఆ పరిసర ప్రాంతాలన్నీ జల విళయంలో చిక్కుకుని ఉండేవని వైసీపీ చెబుతోంది. జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడం వల్ల అక్కడ నివాసం ఉంటున్న లక్ష మంది ప్రజలు గతంలో మాదిరిగా అక్కడి నుండి ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇవాళ నిచ్చింతగా ఉండగలుగుతున్నారు అనేది అక్కడి వైసీపీ నేతలు చెబుతున్న మాట. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ నివాసం ఉంటున్న లక్ష మంది ప్రజలకు మేలు చేసిన ఘనత తమ నాయకుడు వైఎస్ జగన్ కే దక్కుతుందని వైసీపీ నేతలు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

టీడీపీ వెర్షన్ ఏంటంటే..

విజయవాడ టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. వాస్తవానికి కృష్ణా నది నీరు విజయవాడను ముంచెత్తకుండా 2016 లో రిటైనింగ్ వాల్ ప్రతిపాదన తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. జగన్ కంటే ముందుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో మెజార్టీ భాగాన్ని పూర్తి చేశారని.. అందుకే ఈ ప్రాంతాన్ని వరదల బారి నుండి కాపాడిన ఘనత కూడా తమ నాయకుడు చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అని టీడీపీ వాదిస్తోంది.

విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చరిత్ర ఏంటి..

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ మొత్తం పొడవు 3.44 కిమీ. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటి తాకిడి తట్టుకుని నిలిచేలా ఈ రిటైనింగ్ వాల్‌ని నిర్మించారు. ఈ రిటైనింగ్ వాల్ మొత్తం నిర్మాణంతో లక్ష మంది ప్రజలకు వరద ముంపు నుండి విముక్తి లభిస్తుంది అని ప్రభుత్వం అంచనా వేసింది.

రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరం ఎందుకొచ్చిందంటే..

భారీ వర్షాలు కురిసి కృష్ణా నదిలో వరదలు పోటెత్తితే క్రిష్ణమ్మ ఉప్పొంగి ప్రవహించి నది తీర ప్రాంతాలను ముంచెత్తకుండా అడ్డుకట్టలా నిర్మించిన నిర్మాణమే ఈ రిటైనింగ్ వాల్. క్రిష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణంతో లక్ష మంది నివాసితులకు మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం అంచనా. ఎందుకంటే గతంలో ప్రతీ సంవత్సరం, క్రిష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతీసారి నది తీర ప్రాంతాల్లోకి వరద నీరు ఉప్పొంగి రావడంతో ఆయా ప్రాంతాల వాసులు తమ ఇళ్లు ఖాళీ చేసి ప్రాణాలు అరచేతపట్టుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు వెళ్లాల్సి వచ్చేది. వరద తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి రావడం అనేది పరిపాటిగా ఉండేది. శాశ్వతంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే 2016 లో అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలైంది.

రిటైనింగ్ వాల్ ఎప్పుడు ఎంత పూర్తయిందంటే...

ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం మూడు దశలుగా విభజించారు. అందులో ఒకటి రూ. 165 కోట్ల బడ్జెట్‌తో యనమలకుదురు నుండి గీతానగర్ కట్ట వరకు 2.37 కిమీ పొడవు నిర్మాణం.. రెండో ఫేజ్‌లో భాగంగా రూ. 126 కోట్ల నిధులతో గీతానగర్ నుండి వారధి వరకు 1.23 కిమీ పొడవు నిర్మాణం ప్లాన్ చేశారు. ఇక మూడో ఫేజ్‌లో భాగంగా రూ. 110 కోట్ల నిధులతో వారధి నుండి పద్మావతి ఘాట్ వరకు రిటైనింగ్ వాల్ ప్లానింగ్ జరిగింది. ఇందులో మొదటి రెండు దశలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తయ్యాయి.


మూడో దశ నిర్మాణం కూడా చంద్రబాబు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, అక్కడి ప్రాంత ప్రజలకు మరో చోట స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తాం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అక్కడి ప్రజలు మాత్రం ఇళ్లు ఖాళీ చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లారు. దీంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. క్రిష్ణలంక ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేలా వారిని ఉసిగొల్పింది కూడా వైసీపీ నేతలే అని టీడీపీ ఆరోపిస్తోంది.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. పదవీ కాలం ముగియడానికి ఏడాది ముందు మూడో ఫేజ్ నిర్మాణంలో వేగం పెంచి ఈ ఏడాది మార్చి నెలలో క్రిష్ణలంక రిటైనింగ్ వాల్‌ని ప్రారంభించారు.

వైఎస్ జగన్ హయాంలో క్రిష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేసే క్రమంలో తాము సహకరించామే కానీ వైసీపీ నేతల తరహాలో సమస్యలు సృష్టించి, కోర్టు కేసుల పేరుతో రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా అడ్డుపడలేదని టీడీపీ చెబుతోంది.

ఈ వివాదాల సంగతెలా ఉన్నా.. విజయవాడ రిటైనింగ్ వాల్‌కి ఓ గుర్తింపు ఉంది. సౌతిండియాలో నిర్మించిన అతి పెద్ద రిటైనింగ్ వాల్ ఇదేనని రికార్డులు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories