ఒక్క ఐడియా కొణతాల రాజకీయ జీవితాన్ని మార్చేసిందా?

ఒక్క ఐడియా కొణతాల రాజకీయ జీవితాన్ని మార్చేసిందా?
x
Highlights

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా ఒక్క ఐడియా లైఫ్‌ను మలుపు తిప్పుతుంది. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన నాయకుడి ఫేట్‌ను కూడా, ఒక ఐడియా...

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా ఒక్క ఐడియా లైఫ్‌ను మలుపు తిప్పుతుంది. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన నాయకుడి ఫేట్‌ను కూడా, ఒక ఐడియా మార్చేసింది. కాదుకాదు పొలిటికల్‌ లైఫ్‌ను రివర్స్ చేసింది. ఆ ఒక్కటీ చేయకపోతే, ఎంత బాగుండేది అంటూ, ఆ లీడర్‌ కుమిలి కుమిలిపోతున్నారు. ఇంతకీ ఎవరా లీడర్ ఆయన మదిలో మెదిలిన ఐడియా ఏంటి ఆ ఐడియా ఆయన పొలిటికల్‌ లైఫ్‌ను ఎలా టర్నింగ్ ఇచ్చుకునేలా చేసింది?

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నియోజకవర్గం ఉత్తరాంద్రా నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పిన ఎంతో మంది ఉద్దండులు ఈ సెగ్మెంట్‌ నుంచే ఎదిగారు. అలాంటివారిలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఒకరు. కానీ ఇప్పుడాయన ఊసేలేదు. ఎందుకంటే ఒక ఐడియా ఆ‍యన రాజకీయ జీవితాన్ని కోలుకోలేని మలుపు తిప్పింది.

కొణతాల రాజకీయ అరంగేట్రం 1987లో. అనేక ప్రజా ఉద్యమాలు చేశారు. బెల్లం ఉద్యమంతో పాటు అనేక ఆందోళనలకు పాదం కదిపారు. 1989లో కాంగ్రెస్‌లో చేరారు. వచ్చీ రావడంతోనే అప్పటికే టీడిపీలో సీనీయర్ రాజకీయ చాణక్యుడుగా పేరొందిన పెతకంశెట్టి అప్పల నరసింహంపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా 1989లో పోటీ చేశారు. కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో కొణతాల పేరుమోగిపోయింది. అయితే 2004 నుంచి కొణతాలది మరో ప్రస్థానం అనొచ్చు. ఎందుకంటే వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు కొణతాల.

2004లో అనకాపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావుపై గెలిచారు కొణతాల రామకృష్ణ. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి క్యాబినెట్‌లో మూడు కీలక మంత్రి పదవులు నిర్వర్తించారు. న్యాయశాఖ, ఎక్సైజ్, కమర్షియల్ శాఖలు చేపట్టారు. వైఎస్‌కు తలలో నాలికగా మారారు. అయితే 2009 ఎన్నికల్లో గంటా శ్రీనివాస రావుపై పోటీ చేసి ఓడిపోవడం, ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది.

వైఎస్ మరణాంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్‌కు అండగా నిలిచినవారిలో కొణతాల ఒకరు. 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, వైఎస్‌ఆర్‌ సీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో కూడా తన మార్క్ రాజకీయాలు చేసినా, తరువాత జగన్‌తో విబేధాలు రావడంతో పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటూ ఉత్తరాంధ్రా ప్రజా వేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. కొణతాల సామర్థ్యం తెలిసిన కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానాలు ఇచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ ఒక్క ఐడియా కొణతాల జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అదే టీడీపీకి మద్దతివ్వడం.

జగన్‌పై వున్న విభేదాలతో 2019లో టీడిపి అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు కొణతాల. టీడీపీకి మద్దతిచ్చారు. అయితే అనూహ్యంగా జగన్ ప్రభంజనంతో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. అంచనాలన్నీ తలకిందులై సైలెంటయ్యారు కొణతాల. అదే వైసీపీలోనే ఉంటే, కొణతాల ఫేటు మరోలా ఉండేదని స్థానిక నాయకులంటారు. అటు దాదాపు తన సమకాలికులైన బొత్స ఇప్పుడు కేబినెట్‌లో కీలకమంత్రి. అటు ధర్మాన ప్రసాద రావు ఎమ్మెల్యేగా గెలిచారు. కొణతాల కూడా జగన్‌తోనే ఉండి వుంటే, ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్‌ నుంచి ఫేడౌట్ అయ్యే పరిస్థితి ఉండేదికాదని, ఆయన సన్నిహితులు సైతం మాట్లాడుకుంటున్నారు. అంటే వైసీపీ నుంచి వైదొలగడం, అటు టీడీపీకి మద్దతివ్వాలన్న ఒక్క ఐడియా కొణతాల పొలిటికల్‌ కెరీర్‌ను సందిగ్దంలో పడేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories