చింతమనేనిని జనం ఎందుకింత కసిగా ఓడించారు?

చింతమనేనిని జనం ఎందుకింత కసిగా ఓడించారు?
x
Highlights

అతను కాన్ఫిడెన్స్‌ అనుకున్నాడు. కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌‌గా లెక్కేశారు జనం. వేదిక ఏదైనా యాక్షన్‌ తనదేనని గొప్పలకు పోయాడు. కానీ అతనిదంతా...

అతను కాన్ఫిడెన్స్‌ అనుకున్నాడు. కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌‌గా లెక్కేశారు జనం. వేదిక ఏదైనా యాక్షన్‌ తనదేనని గొప్పలకు పోయాడు. కానీ అతనిదంతా ఓవర్‌యాక్షనేనని తీర్పిచ్చేశారు ఓటర్లు. తన మాటే శాసనమని చిందులేశాడు. తాను చెప్పిందే వినాలని రంకెలేశాడు. తన దారికి అడ్డొస్తే తొక్కేస్తానని కళ్లు ఉరిమి చూశాడు. ప్రశ్నించినవారినే పరుగులు పెట్టించాడు. అయితే ప్రతిఒక్కరికీ ఒకరోజుస్తుందని వెయిట్ చేసిన బాధితులు, పోలింగ్‌ రోజు ఓటనే ఆయుధంతో వేటేశారు. తనను ఓడించే వాడనేవాడు పుట్టలేదని తొడగొట్టిన నాయకున్ని దారుణంగా ఓడించి గుణపాఠం నేర్పారు. అతను ఎన్ని వేషాలు వేసినా భరించే ఓపిక చంద్రబాబుకు ఉందేమో కానీ, తమకు మాత్రం లేదని, ఆ నేతను కసితీరా నేలకేసి కొట్టారు. అతని ఓటమితో రెవెన్యూ ఉద్యోగులు పండగ చేసుకున్నారు. బాధితులు సంబరాలు జరుపుకున్నారు. అతను మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక కౌంటింగ్‌ రోజు ఇంట్లోని టీవీలను ధ్వంసం చేశాడట. ఇంతకీ ఎవరా కాళకేయుడు జనం ఎందుకు అతన్ని అంత కసిగా ఓడించారు?

చింతమనేని ప్రభాకర్...మాజీ ఎమ్మెల్యే, కమ్ విప్. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్. నోటి దురుసుకు కేరాఫ్‌ అడ్రస్. ఎవరైతే నాకేంటి అన్న తలబిరుసు. పవరనే పొగరుతో రెచ్చిపోయిన దెందులూరు బాసు.అదే లెక్కలేనితనం జనంతో చీదరించుకునేలా చేసుకున్న నేత.

గత ప్రభుత్వంలోని టిడిపి ఎమ్మెల్యేలలో రెబల్ ఎమ్మెల్యేనే కాదు, నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటూ చంద్రబాబు సర్కారుకే తలపోటు తెచ్చి నాయకుడు. గడచిన ఐదేళ‌్ల కాలంలో పార్టీ పరువు తీస్తూ రచ్చకెక్కిన నేత. బహుశా చింతమేనిని మూటగట్టుకున్నంత అప్రదిష్ట, ఏ ప్రజాప్రతినిధి మూటగట్టుకోలేదు. చింతమనేని చంద్రబాబు అంతగా భరించడానికి కారణం, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజవర్గంలో చింతమనేనిని ఎవరూ ఓడించలేరని, అది టీడిపికి పక్కా గెలిచే సీటంటూ ఫుల్ కాన్పిడెన్స్. అందుకే ఐదేళ్లూ చింతమనేని ఎన్ని వేషాలేసినా, ఎమ్మెల్యే స్థాయి మరిచి నోరుపారేసుకున్నా, మహిళా ఎమ్మార్వోను కొట్టి, పార్టీ పరువు బజారున పడేసినా చంద్రబాబు మౌనంగా ఉన్నారు. కారణం ఆ ఒక్కటే. చింతమనేని దెందులూరులో తిరుగులేని నాయకుడు. ప్రభాకర్ గెలుపు నల్లేరుమీద నడకేనని బాబుగారి ధీమా. కానీ కేవలం గెలుపు లెక్కల్లో బాబుగారు భరించరేమోకానీ, జనం మాత్రం భరించలేమని బండకేసి కొట్టినట్టుగా తీర్పిచ్చారు. తనకు ఎదురులేదు, బెదురులేదు, జనానికి మరో ఛాయిస్‌ లేదని విర్రవీగిన చింతమనేని ఓవర్ కాన్ఫిడెన్స్‌‌ను పాతాళానికి తొక్కేసేలా తీర్పిచ్చారు.

నియోజకవర్గాన్ని సంస్థానంలా పాలిస్తూ, నిత్యం వివాదలను చంకలోపెట్టుకు తిరుగుతూ, నేనింతే మారనంతే మారితే మీరే మారండి అనే చింతమనేని ఇప్పుడు ఓటమి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఊహించని పరాజయం నుంచి తేరుకోలేదు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలు అంచనావేస్తూ పోల్ మ్యానేజ్ మెంట్ చేయడంలో ఈసారి బోల్తా పడ్డారు చింతమనేని. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని మార్క్ పాలిటిక్స్ మరెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాకర్, ఇసుక కాంట్రాక్టర్‌గానే మొదట అందరికీ తెలుసు. ఆ తరువాత టిడిపి ఎంపీటిసిగా గెలుపొంది, తనదైన మార్క్ పాలిటిక్స్‌తో తర్వాత రాజకీయాల్లో వెనుదిరిగి చూసుకోలేదు.

2009 ఎన్నికల్లో మహామహులను పక్కన పెట్టి మరీ చింతమనేని ప్రభాకర్‌కు అప్పట్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. నాడు కాంగ్రెస్ అభ్యర్ది కొఠారు రామచంద్రరావు, పిఆర్‌పి అభ్యర్థి అశోక్ గౌడ్‌లను ఓడించి చింతమనేని గెలుపొందారు. 2009లో రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ హవా వీస్తే, ఒక్క దెందులూరులో మాత్రం చింతమనేని ముందు నిలువలేకపోయింది. తిరిగి 2014 ఎన్నికల్లో రెండోసారి టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై విజయం సాధించారు ప్రభాకర్. రెండోసారి పార్టీకి తిరుగులేని విజయం రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారం చేపట్టడంతో, ప్రభాకర్ పరిస్దితి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయ్యింది.

ఇంకేముంది చంద్రబాబు విప్ పదవి కూడా ఇవ్వడంతో చింతమనేని గడచిన ఐదేళ్ల కాలంలో తనకెదురు లేదన్నట్టుగా చెలరేగిపోయారు. గెలిచిన నాటి నుంచి మహిళా ఎమ్మార్వోపై దాడి, ఫించన్ కోసం వచ్చిన వృద్దుడిపై నోరుపారేసుకోవడం, పోలీసులపై దాడి వివాదం, దళితులను కించపరిచేలా సంచలన వ్యాఖ్యలు, ఇలా ఒకటేమిటి చింతమనేనికి తిక్కలేస్తే, బూతు పురాణమే.

ఎంతలా విర్రవీగినా, ఓ రోజుస్తొంది అంటే ఇదేనేమో అంటున్నారు చింతమనేని బాధితులు. పదవి చేతిలో ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటే ఫలితం ఇలా ఉంటుందని చెప్పడానికి చింతమనేని ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా మిగిలాడు. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రత్యర్ది, వైసిపి అభ్యర్ది కొఠారు అబ్బయ్య చౌదరిపై 17వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు చింతమనేని ప్రభాకర్. ఆ ప్రస్టేషన్‌లో టీవిలు పగలగొట్టి, నానా బూతులు తిట్టి హంగామా సృష్టించాడంటూ సన్నిహితులు నోరెళ‌్ల బెట్టారట. కలలో కూడా ఊహించని ఓటమి, ఒక్కసారిగా తాజాను కాస్తా మాజీని చేసింది. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనిని ఓడించడం అంత సామాన్యమైన విషయం కాదు అందులోనూ ఏకంగా చింతమనేనిపై 17వేల ఓట్ల మెజారిటీ సాధించడమంటే ఇది కచ్చితంగా చింతమనేని స్వయంకృతాపరాధామే అంటున్నారు విశ్లేషకులు. దుందుడుకు తీరు ఒక కారణమైతే, జనసేన అభ్యర్థి అంతగా ప్రభావం చూపకపోవడంతో జనసేన ఓట్లు కాస్తా చింతమనేనికి వేయలేక వైసిపి ఖాతాలోకి వెళ్లాయనేది రాజకీయ పండితుల విశ్లేషణ.

గత ఎన్నికల్లో చింతమనేనిని నెత్తిన ఎత్తుకున్న కొల్లేరు గ్రామాలు, ఈసారి పూర్తిగా రివర్స్ అవ్వడం, ప్రభాకర్ ఓటమికి మరో కారణంగా చెప్పవచ్చు. పక్కా టిడిపి అనుకున్న గ్రామాలు సైతం చింతమనేని తీరుతో విసిగిపోయి వైసిపికి ఓటువేయక తప్పలేదని, అందుకే ఇంతలా చింతమనేనికి ఓటమి తప్పలేదంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఈసారి ఎన్నికల ప్రచారంలో పవన్, జగన్, షర్మిళ చింతమేనిపై శివాలెత్తారు. వాస్తవ పరిస్దితులను అంచనా వేయడం పక్కనపెట్టి, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చింతమనేని వ్యవహరించిన తీరే ప్రత్యర్దిని గెలుపు గుర్రం ఎక్కేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహంలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories