రోజా, ఆర్కేలకు లాస్ట్‌ మినిట్‌‌లో బెర్త్‌ ఎందుకు మిస్సయ్యింది?

రోజా, ఆర్కేలకు లాస్ట్‌ మినిట్‌‌లో బెర్త్‌ ఎందుకు మిస్సయ్యింది?
x
Highlights

రోజాకు మంత్రి పదవి ఖాయమన్నారు. ఆర్కేకు అగ్రికల్చర్‌ పక్కా అన్నారు. అంబటి రాంబాబుకు ఫోర్ట్‌ ఫోలియా కేటాయిస్తారని అనుకున్నారు. ఆనంకు బెర్త్ కన్‌ఫామ్...

రోజాకు మంత్రి పదవి ఖాయమన్నారు. ఆర్కేకు అగ్రికల్చర్‌ పక్కా అన్నారు. అంబటి రాంబాబుకు ఫోర్ట్‌ ఫోలియా కేటాయిస్తారని అనుకున్నారు. ఆనంకు బెర్త్ కన్‌ఫామ్ అన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నాటి నుంచి వీరితో పాటు అనేకమంది ప్రముఖుల పేర్లు బాగా చక్కర్లు కొట్టాయి. వీరిలో కొందరికి ఫోన్లు కూడా వెళ్లాయట. కట్‌ చేస్తే, ప్రమాణస్వీకారం రోజు, వీరి ఊసేలేదు. రోజా, ఆర్కే, అంబటిలకు కేబినెట్‌లో ఎందుకు బెర్త్ దొరకలేదు సామాజిక సమీకరణాలే కారణమా...లేదా మరేవైనా కారణాలున్నాయా?

రోజా,ఆర్కే,అంబటి,ఆనం వీరందరికీ మంత్రి పదవులు వస్తాయని ప్రచారమైతే జోరుగా సాగింది. వైసీపీ ఎల్పీ మీటింగ్‌ నుంచి కూడా వీరంతా నవ్వుతూ బయటికి వచ్చారు. మంత్రి పదవి ఖాయమా అంటే, ఫోన్‌ వస్తుందని ఆశిస్తున్నామని వెళ్లిపోయారు. ముఖ్యంగా రోజా అయితే, జబర్తస్ట్‌గా నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

రోజా సెల్వమణి. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న నాయకురాలు. చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే. తాను ఐరన్‌ లెగ్‌ కాదు గోల్డెన్‌ లెగ్‌ అంటూ చెప్పుకున్న ప్రజాప్రతినిధి. మంత్రివర్గ విస్తరణలో అందరికంటే రోజా పేరే ఎక్కువగా వినపడింది. ఆమెకు కేబినెట్‌ బెర్త్ పక్కా అంటూ వార్తలు వినిపించాయి. కానీ రోజా ఆశలు అడియాసలయ్యాయి. మరి ఎందుకు ఆమెకు మంత్రి పదవి దక్కలేదు?

రోజా ముందు నుంచి జగన్‌ వెంట నడిచారు. అసెంబ్లీ లోపలా, బయటా ధాటిగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. కష్టకాలంలో జగన్‌కు తోడున్న లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు బెర్త్ పక్కా అని అంచనా వేశారు. అయితే రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి చాలా కారణాలున్నాయి.

కేబినెట్‌లో సామాజిక సమతూకం పాటించాలన్నది జగన్‌ సూత్రంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ బెర్త్‌లు ఇచ్చి, రెడ్డి రాజ్యంగా విమర్శలు ఎదుర్కోవడం ఎందుకని, రెడ్డీలకు కాస్త తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. రోజా రెడ్డి సామాజికవర్గం. అందుకే రోజాను జగన్‌ ప్రస్తుతానికి పక్కనపెట్టారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆర్కే. మంగళగిరిలో చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌ను ఓడించిన నాయకుడిగా ఆర్కే మంచి మార్కులు కొట్టేశారు. ముందు నుంచి జగన్‌కు ఆప్తుడిగా పేరుంది. ఇప్పటికీ తాను రైతుగా చెప్పుకునే ఆర్కేకు, వ్యవసాయ శాఖ ఇవ్వొచ్చన్న ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఫోను కూడా వెళ్లిందట. కానీ లాస్ట్‌ మినిట్‌లో మాత్రం లిస్ట్‌లో ఆర్కే పేరు మాయమైంది. దీంతో ఆర్కేతో పాటు ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించినవారంతా షాకయ్యారు. రోజా క్యాలిక్యులేషన్‌ తరహాలోనే ఆర్కేకు కూడా ప్రస్తుతం మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమతూకం కోసమే, ఆర్కేకు ప్లేస్ దొరకలేదని తెలుస్తోంది.

వైసీపీకి బలమైన గొంతుకగా ప్రతి వేదికపైనా ధాటిగా మాట్లాడిన అంబటి రాంబాబుకు కూడా మంత్రి పదవి లేదంటే స్పీకర్‌ దక్కొచ్చన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా తన అనుచరులతో ఇదే చెప్పుకున్నారట. చివరి నిమిషంలో అంబటికి కేబినెట్ మిస్సయ్యిందని తెలుస్తోంది. అయితే గుంటూరు నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ప్రత్తిపాడు నుంచి గెలిచిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు, అలాగే బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవులొచ్చాయి. అంటే గుంటూరు జిల్లాకు రెండు బెర్త్‌లు దక్కాయి. అందుకే అంబటి రాంబాబుకు మంత్రియోగం రాలేదని తెలుస్తోంది.

రోజా, ఆర్కే, అంబటితో పాటు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఆనంల పేర్లు కూడా వినిపించాయి. వీరిక్కూడా మినిస్ట్రీ దక్కలేదు. అయితే, మొన్న జరిగిన వైసీపీ శాసన సభా పక్షం మీటింగ్‌లో జగన్‌ ఎమ్మెల్యేలందరికీ ఒక విషయం స్పష్టం చేశారు. గెలిచిన 151 మందికీ మంత్రి పదవులు ఇవ్వడం కష్టంకాబట్టి, అందులోనూ సామాజిక సమతూకం, అన్ని జిల్లాలకూ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం వుండాలి కాబట్టి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పారట. అంతేకాదు, ఇప్పుడు మంత్రిగా పదవులు చేపట్టేవరాంతా రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని, వారంతా 2021లో రాజీనామా చేసి, పార్టీకి పని చేస్తారని అన్నారట. రెండున్నరేళ్ల తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పారట. జగన్‌ వ్యాఖ్యలతో అందరూ ఏకీభవించారట కూడా. ప్రస్తుత మంత్రివర్గ కూర్పును కూడా ఇదే కోణంలో చూడాలని విశ్లేషకుల అభిప్రాయం.

మొత్తానికి రెడ్డి రాజ్‌ అన్న ముద్రపడకుండా, సామాజిక సమతూకం పాటించారు సీఎం జగన్. అందుకే అన్ని వర్గాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండేలా కేబినెట్‌ కసరత్తు చేశారు. అంతేకాదు, రోజా, అంబటి, ఆర్కే లాంటి ఫైర్‌బ్రాండ్ లీడర్లకు వచ్చే మంత్రివర్గంలో చోటిచ్చి, ధాటిగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారట. ఇలా సకల సమీకరణల నేపథ్యంలో తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ జగన్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories