తూర్పులో అదృష్టం కలిసిరాని ఆ దురదృష్టవంతుల ఫ్యూచరేంటి?

తూర్పులో అదృష్టం కలిసిరాని ఆ దురదృష్టవంతుల ఫ్యూచరేంటి?
x
Highlights

ఆ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో తమకంటూ వర్గాన్ని, చరిస్మాను సంపాదించుకోగలిగారు. ఏ...

ఆ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో తమకంటూ వర్గాన్ని, చరిస్మాను సంపాదించుకోగలిగారు. ఏ రాజకీయ నాయకుడైనా, అమాత్య పదవి వారి జీవిత ఆశయంగా భావిస్తారు. కానీ అటువంటి అదృష్టాన్ని పొందలేకపోయిన దురదృష్టవంతులు వారు. దశాబ్దాలు దాటినా, ఎన్నోసార్లు గెలిచినా, మంత్రి మాత్రం కాలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో గడప దాకా వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుని, ఇప్పుడు కుమిలిపోతున్నారు. ఇంతకీ ఎవరా అన్‌లక్కీ లీడర్స్?

తోట త్రిమూర్తులు...జ్యోతుల నెహ్రూ...ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకులు ప్రజల అభిమానం కూడా మెండుగా ఉన్న నేతలే. కానీ ఇద్దరూ ఎంతగా మంత్రి పదవి ఆశపడ్డారంటే, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అందినట్టే అంది, ప్రతీసారి చేజారుతూనే వచ్చింది మినిస్ట్రీ. ఇప్పుడు చివరికి ఎమ్మెల్యే పదవులు కూడా పోయి, ఏం చెయ్యాలో దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు ఇద్దరు నాయకులు.

జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మంత్రివర్గ కూర్పులో ప్రతిసారీ, చివరి వరకూ వారి పేర్లు చక్కర్లు కొట్టేవి. తీరా ఏదో ఒక బ్రేక్ పడి ఆ పదవి,అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి దొరుకుతుంది. ఇద్దరికీ తెలుగుదేశం పార్టీలో రెండు మూడేళ్ల క్రితం మంత్రి పదవులు వస్తాయని భావించారు. తీరా మరోసారి భంగపడ్డారు. తెలుగుదేశంలో వద్దు వైసీపీలోకి రండి, మీ సీనియార్టీ గుర్తించి జగన్ మంత్రి పదవులు ఇస్తారని ఆ ఇద్దర్నీ, పలువురు మధ్యవర్తిత్వం వహించినప్పటికి, వారు మాత్రం వినలేదు. టీడీపీ నుంచి పోటీ చేయడంతో ఈసారి దురదృష్టం వెంటాడింది. తెలుగుదేశం ఓటమితో వారికి నిరాశే మిగిలింది. అందివచ్చిన అవకాశాన్ని తోట త్రిమూర్తులు వదులుకుంటే, గెలిచిన పార్టీ నుంచి టీడీపీలోకి జంపయిపోయి, జ్యోతుల నెహ్రూ తీరిగ్గా కుమిలిపోతున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజార్టీతో విజయం సాధించింది అరడజను మంది కాపు ఎమ్మెల్యేలు జిల్లా నుంచి గెలుపొందారు. సామాజిక పరంగా జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి లభిస్తుంది. ఆ ఒక్కటి ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు దక్కింది. అదే జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు వైసీపీ నుంచి వీడి ఉండకపోయినా, జగ్గంపేట ఎమ్మెల్యేగా తిరిగి మరోసారి గెలుపొంది, సీనియార్టీ ప్రకారం ఆయనకే మంత్రి పదవి వచ్చేది.

అలాగే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా, అప్పటికీ ప్రతిసారి మంత్రి పదవి కోసం ఆశించి భంగపడటం తోట త్రిమూర్తులకు పరిపాటి అయింది. వైసీపీ నుంచి పోటీ చేస్తే, మంత్రి పదవి తప్పక లభిస్తుందని సామాజికపరంగా ఎందరో పట్టుబట్టినా, టిడిపిని వీడలేకపోయారు. వైసిపిలో ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందివుంటే, తోట త్రిమూర్తులు పొజిషన్‌ మరోలా ఉండేదని స్థానికంగా అందరూ మాట్లాడుకుంటున్నారు.

జిల్లాలో జక్కంపూడి, ముద్రగడ తరువాత అంతటి సామాజిక గుర్తింపు పొందిన నేతలు ప్రస్తుతం మౌన ముద్రలో ఉండవలసి పరిస్థితి ఏర్పడింది. గెలుపొందిన ఎమ్మెల్యేల కన్నా, ఆ సామాజిక పరంగా ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో, వారు వేసే ప్రతి అడుగుపైనా ఎక్కడికక్కడ నిఘాలుంటాయి. ఆ ఇద్దరు నేతలు తమ భవిష్యత్తును ఏ విధంగా మలుచుకుంటారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. జనాకర్షణ కలిగిన నేతలు కావడంతో, అటు చంద్రబాబు, ఇటు జగన్ బహిరంగ సభలకు జనాలను విపరీతంగా తరలించి, సభలను సక్సెస్ చేసేవారు. అంతటి సత్తా చాటుకున్న ఈ నేతలు, తగిన అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ, పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్లడం పెద్ద తప్పిదంగానే భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశంలోకి వెళ్లడం ద్వారా, పొలిటికల్ కెరియర్ దెబ్బతింటుందని వైసీపీలో ఉన్న ఆయన సన్నిహితులు ఎంత చెప్పినప్పటికీ జ్యోతుల వినకపోవడంతో, వైసీపీ ద్వారం మూతపడింది. ఆయనపై రెండు పర్యాయాలు ఓటమి చెందిన ఆయన సమీప బంధువు జ్యోతుల చంటిబాబు తొలిసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందడం కొసమెరుపు. మొత్తానికి తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూలు, రాజకీయ వ్యూహాత్మక తప్పిదాలకు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారని, స్థానిక జనం మాట్లాడుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories