Polavaram Project: పోలవరం... రాజకీయ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

Polavaram the pinnacle of political negligence
x

Andhra Pradesh: పోలవరం... రాజకీయ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

Highlights

Polavaram Project: ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కలలు గంటున్న పోలవరం నిర్మాణం సాకకారమైతే బీడువారిన భూములన్నీ మాగాణులవుతాయి.

దేళ్ళుగా ఎండమావిగా మారిన ప్రాజెక్ట్.

నిధుల లేమితో పనుల నత్తనడక.

డయాఫ్రం వాల్ ధ్వంసం కావటంతో ఆగిపోయిన పనులు.

మరో నాలుగేళ్ళు పడుతుందంటున్న చంద్రబాబు ప్రభుత్వం.

సవరించిన అంచనాలను ఆమోదించని కేంద్ర ప్రభుత్వం.

ఎప్పటికపుడు పెరిగిపోతున్న బడ్జెట్ అంచనాలు.

డీపీఆర్ – 2 మీద కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్న ప్రజలు.

పోలవరం.. నిజంగా ఏపీ ప్రజలకు ఒక వరమే. కాకపోతే ,రాజకీయ వైఫల్యం వల్ల కనుచూపు మేరలో ఆ వరం సిద్ధించే అవకాశం లేదు. పోలవరం ఫలాలను అందుకునే అదృష్టం దరి చేరాలంటే రాష్ట్ర ప్రజలు మరెంతకాలం ఎదురుచూడాలే ప్రశ్నకు బదులిచ్చే వారెవ్వరూ లేరు.

ఆంధ్రుల జీవనాడి.. బీడు వారిన లక్షలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేసే గోదావరి వరప్రసాదినిగా భావించిన పోలవరం గడిచిన పదేళ్ళుగా ఎండమావిగా, అందని ద్రాక్షగా ఎందుకు మారిపోయింది? దీనికి కారకులెవ్వరు? పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోలవరాన్ని ఉద్దేశ్యపూర్వకంగానో, వ్యూహాత్మకంగానో నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా పోలవరం అసలు పూర్తవుతుందో, లేదో తెలియని సందిగ్ధావస్థ ఎదురైంది.

ఏపీ పాలకులకే కాదు, ఢిల్లీ పెద్దలకు కూడా పోలవరంపై కనికరం లేదు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పించినా ఆ మేరకు నిధులివ్వకుండా గడిచిన పదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టంలో 2014 నుంచి 2024 దాకి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కూడా ఘోర వైఫల్యం చెందాయి. 2014 నుంచి చంద్రబాబుకు కేంద్రంతో సఖ్యత చెడి నిధులు రాబట్టలేకపోతే 2019 నుంచి జగన్ కేంద్రంతో సఖ్యత ఉండి కూడా నిధులు తీసుకురాలేకపోయారు. ముందు మీరెంత ఖర్చు పెట్టారో లెక్కలివ్వమని కేంద్రం, ముందు మీరు మాకు నిధులివ్వండని ప్రభుత్వాలు... చెప్పడం, చెప్పించుకోవడాలతోనే పదేళ్ళు గడిచిపోయాయి.

ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు పోలవరం పనులను వేగవంతం చేయాలనుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక కట్టడమైన డయాఫ్రం వాల్ 2020లో వచ్చిన వరదల ధాటికి ధ్వంసమైంది.

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులోని ఒక ప్రధాన కట్టడం వరదల ధాటికి ధ్వంసమై పోయిందంటే పోలవరం నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్పిల్ వే పూర్తి కాకుండానే కమిషన్లకు కక్కుర్తి పడి డయాఫ్రం వాల్ నిర్మించారనీ, అందువల్లనే వరదల్లో కొట్టుకుపోయిందని వైసీపీ, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రం వాల్ ధ్వంసమైందని టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఇపుడు డయాఫ్రం వాల్ సంగతేమిటో తేలనిదే పోలవరం నిర్మాణం ముందుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. గడిచిన నాలుగేళ్ళుగా ప్రాజెక్టు చతికిలబడటానికి కూడా కారణం అదే..! పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జాతీయ జలవిద్యుత్ సంస్థ, వివిధ ప్రఖ్యాత యూనివర్శిటీలకు చెందిన ఐఐటీ నిపుణులు, జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన రిటైర్డ్ ఇంజనీర్లు.. ఇలా అనేక సంస్థలు, వ్యక్తులు డయాఫ్రం వాల్ పునరుద్ధరణపై అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాయి. అయినా డయా ఫ్రం వాల్ పునర్నిర్మాణంపై కేంద్ర జలశక్తి నుంచి తుది నిర్ణయం వెలువడలేదు. చివరకు ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ఏజెన్సీ.. ఐడీఏ సూచన మేరకు డయాఫ్రంవాల్ పునరుద్ధరించాలని నిర్ణయించినా అది కూడా కొలిక్కి రాలేదు.

ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి..వచ్చేనెల జులై మొదటి వారం నుంచి గోదావరికి ఎగువ నుంచి వరదలొస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో పోలవరం పనులు మొదలయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబరు దాకా పోలవరం పనులు.. ప్రత్యేకించి డయాఫ్రం వాల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించే అవకాశమే లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈనెల 17న ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయం చెప్పారు. డయాఫ్రం వాల్ మాత్రమే కాదు..గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నాణ్యతా ప్రమాణాలపై కూడా అనేక అనుమానాలున్నాయి.


డయాఫ్రం వాల్ బాగు చేయాలంటే...

వరదల ధాటికి ధ్వంసమైన డయాఫ్రం వాల్ కు మరమ్మతులు చేపట్టి పునరుద్ధకరిస్తే 446 కోట్ల రూపాయల అవుతుందని ఇంజనీర్లు ప్రాథమిక అంచనా వేశారు. మరమ్మతులు వల్ల ప్రయోజనం లేదనీ, దానికి సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మించటమే మేలని డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ తో పాటు జాతీయ జల విద్యుత్ సంస్థలు అభిప్రాపడ్డాయి.

కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మించాలంటే 990 కోట్లు అవుతుందని అంచనా. ఈ ఏడాది నుంచే పనులు మొదలుపెట్టినా పోలవరం పూర్తి కావటానికి మరో నాలుగు సీజన్లు.. అంటే నాలుగేళ్ళు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ఈనెల 17న పోలవరం ప్రాజెక్టు వద్ద తెలిపారు.


పోలవరం వస్తే సస్యశ్యామలం...

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొన్ని దశాబ్దాలుగా కలలు గంటున్న పోలవరం నిర్మాణం సాకకారమైతే బీడువారిన భూములన్నీ మాగాణులవుతాయి. నీటి చుక్కకు నోచుకోని అనేక ప్రాంతాలు సస్యశ్యామలవుతాయి. వాస్తవిక డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎగువన అంటే 150 అడుగుల మేర పోలవరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తే గోదావరి డెల్టాలో 10.13లక్షలఎకరాలు, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఏర్పడుతుంది. కొత్తగా 10.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుంది.

గోదావరి-కృష్ణా అనసంధానం ద్వారా 80 టీఎంసీలను కృష్ణా బేసిన్ కు తరలించే అవకాశం ఉంది. దీని ద్వారా వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సాగునీటి సమస్యల పరిష్కారానికి కూడా మార్గం సుగమం అవుతుంది. విశాఖపట్టణం తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. 611 గ్రామాల్లో 28.5 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేయవచ్చు. పొరుగు రాష్ట్రాలైన ఒడిసాకు 5 టీఎంసీలు, చత్తీస్ ఘడ్ కు 1.5 టీఎంసీల నీటిని అందించవచ్చు.

ఈ దశలో పోలవరం పనులను యుద్ద ప్రాతిపదికపై ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మార్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్వేషించాలనీ, పోలవరాన్ని జాతికి అంకితం చేసే మహత్కార్యానికి చిత్తశుద్దితో నడుం బిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


నిధులెక్కడ..!

పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు భారీ పెరిగినా కేంద్ర ప్రభుత్వం మాత్రం సవరించిన అంచనాలను ఇంతవరకు ఆమోదించలేదు. 2010-11 అంచనా వ్యయమైన 16,010.45 కోట్లకే ఇప్పటివరకు అధికారికంగా ఆమోదముద్ర ఉంది. ఆ తరువాత 2013-14 సవరించిన అంచనా వ్యయమైన 30,718.95 కోట్లకూ.. ఆ తరువాత 2017-18లో సవరించిన 55,656.87 కోట్లకు కేంద్ర జలశక్తి సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదముద్ర వేసింది.

రెండవ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్ -2) ఆమోదించిన 55,656.87 కోట్లను రివైజ్ట్ కాస్ట్ కమిటీ 47 వేల 725 కోట్లకు సవరించి సిఫార్సులయితే చేసింది కానీ కేంద్ర మంత్రి మండలి ఆమోదం మాత్రం ఇంతవరకు లభించలేదు. అంతేకాకుండా, ప్రాజెక్ట్ తొలిదశ పేరుతో పోలవరం ఎత్తును 150 నుంచి 140 అడుగులకు తగ్గిస్తూ 36 వేల 449కోట్ల రూపాయల అంచనా వ్యయ ప్రతిపాదనలను జగన్ ప్రభుత్వం కేంద్రానికి అందించటం, కేంద్ర జలసంఘం దాన్ని సవరించి 31 వేల 625 కోట్లకు కోట్లకు సిఫార్సు చేసింది. చివరకు ఆ బడ్జెట్ కు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. నిధులు సాధించుకోవటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ ఆరోపిస్తోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories