Pawan Kalyan Vs DMK: పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కామెంట్స్‌ తమిళనాడులో డీఎంకేకు ఎందుకు కోపం తెప్పించాయంటే

Pawan Kalyan Vs DMK: పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కామెంట్స్‌ తమిళనాడులో డీఎంకేకు ఎందుకు కోపం తెప్పించాయంటే
x
Highlights

Pawan Kalyan Vs DMK: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్స్ తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి ఆగ్రహం తెప్పించాయి....

Pawan Kalyan Vs DMK: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్స్ తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. పవన్ కల్యాణ్ నిన్న తిరుపతిలో వారాహి సభలో చేసిన వ్యాఖ్యలపై డిఎంకే అధికార ప్రతినిధి డా సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ బీజేపి, టీడీపీ, పవన్ కల్యాణ్‌పై నేరుగా విమర్శలు చేశారు. "బీజేపి, టీడీపీ, పవన్ కల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూయిజం పేరును, హిందూ దేవుళ్లను వాడుకున్నారు. తామెప్పుడూ హిందూయిజం గురించి కానీ లేదా ఒక మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమ పోరాటం అంతా కుల వ్యవస్థపై, అంటరానితనంపై, కులం పేరుతో జరుగుతున్న అరాచకాలపైనే" అని సయ్యద్ హఫీజుల్లా స్పష్టంచేశారు. హిందూ మతానికి వాళ్లే అసలైన శత్రువులు అని సయ్యద్ అభిప్రాయపడ్డారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల కోట్ల మందికి జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుని, జనం దృష్టిని మరల్చేందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కి సయ్యద్ హఫీజుల్లా కౌంటర్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై తమిళనాడు డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. "సనాతన ధర్మం గురించి చెబుతూ పవన్ కల్యాణ్ మీ వ్యాఖ్యలకే బదులిచ్చారు కదా" అని చెన్నైలో తమిళ మీడియా అడిగిన ప్రశ్నకు ఉదయనిధి స్టాలిన్ చాలా సాధారణంగా స్పందిస్తూ.. "లెట్స్ వెయిట్ అండ్ సీ.. లెట్స్ వెయిట్ అండ్ సీ" అని నవ్వుతూ బదులిస్తూ వెళ్లిపోయారు. అంతకుమించి ఈ అంశం గురించి ఇంకా ఎక్కువ మాట్లాడటానికి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తిచూపించలేదు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో అసలు డిఎంకేకు ఎందుకు కోపం వచ్చిందంటే..

సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రూలింగ్ పార్టీకి కోపం తెప్పించడానికి సంబంధం లేకపోలేదు. తిరుపతిలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ఏడుకొండలవాడికే అన్యాయం జరిగితే మాట్లాడకుండా ఎందుకుంటాం. ధర్మో రక్షతి రక్షితః.. ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అన్ని ధర్మాలను రక్షించే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. అందుకే నేను ఈరోజు బయటికొచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో.. వారితో గొడవ పెట్టుకోవడానికే ఈరోజు ఇక్కడ తిరుపతికి వచ్చాను" అని అన్నారు. ఇతర మతాలను గౌరవించేదే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి అన్యాయం జరిగిందని తాను దీక్ష చేపడితే తనని కించపరిచారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రామాయణాన్ని కించపరిస్తే మనం బాధపడటం తప్పా? పవిత్ర తిరుమలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేస్తే మనకు కోపం రావద్దా? ఇదే కల్తీ లడ్డూలను అయోధ్యకు ప్రసాదంగా పంపివ్వడం, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించి లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడితే మనకు కోపం వస్తే తప్పా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అదే "క్రమంలో సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది.. దానిని వ్యతిరేకించడం కాదు. మొత్తంగా రూపుమాపాలి" అని గతంలో లోక్ సభ ఎన్నికలకు ముందు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఎక్కడా ఉదయనిధి స్టాలిన్ పేరెత్తనప్పటికీ.. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలను మాత్రం తమిళంలో ప్రస్తావించారు.

"ఈమధ్యే ఒక యువ నాయకుడు మాట్లాడుతూ, సనాతన ధర్మం ఒక వైరస్.. దానిని అంతం చేస్తామని అన్నారు. ఇదే వ్యాఖ్యలు ఒక ఇస్లాం మతంపై జరిగితే వెంటనే దేశంలోని కోర్టులన్నీ స్పందిస్తాయి. కోర్టులన్నీ శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మంపై తప్పుగా మాట్లాడితే మాత్రం ఎవ్వరూ స్పందించరేం" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. "సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని కుట్ర చేసిన వాళ్లే తుడిచిపెట్టుకుపోతారు" అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సనాతన ధర్మంపై, హిందూ దేవతలపై దాడి చేసే సెక్యులరిస్టులకు ఇస్లాం దేశాల్లోని విపరీత పోకడలు కనిపించవు. పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాదేశ్‌కి స్వాతంత్ర్యం అందించేందుకు భారత్ సహకరించింది. కానీ చివరకు బంగ్లాదేశ్ కూడా తమ దేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించుకుని అక్కడి హిందువులపై దాడులు చేస్తోంటే ఈ సెక్యులరిస్టులు ఎవ్వరూ నోరు విప్పరేం అని పవన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని ఎవరైనా తుడిచిపెట్టాలని చూస్తే.. వాళ్లే తుడిచిపెట్టుకుపోతారని తమిళంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనే తమిళనాడు వైపు నుండి డిఎంకే పార్టీ స్పందించింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమ యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ని ఉద్దేశించి చేసినవేననే ఆ పార్టీ నిర్ణయానికొచ్చింది. అందుకే పవన్ కల్యాణ్‌కి రివర్స్ కౌంటర్ ఇస్తూ ఆయనపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కింది. అలా మొత్తానికి సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పక్కరాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories