Pawan Kalyan: రాజకీయాల్లో పనితీరే ముఖ్యం.. నాగబాబు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: రాజకీయాల్లో పనితీరే ముఖ్యం.. నాగబాబు మంత్రి పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

Pawan Kalyan about Nagababu minister post: సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో...

Pawan Kalyan about Nagababu minister post: సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని.. కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. అమరావతిలో మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్న పవన్.. నాగబాబుకు మంత్రిపదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని.. తర్వాత జనరేషన్‌కు ఒక అండగా మారామని చెప్పారు. నాగబాబు నాతో సమానంగా పనిచేసి.. వైసీపీ వాళ్లతో తిట్లు తిన్నారని గుర్తుచేశారు. పార్టీ కోసం నిలబడ్డారని చెప్పారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా? కాదా? అన్నది చూడాలన్నారు.

కందుల దుర్గేష్‌ది ఏ కులమో కూడా తెలియదన్నారు. కేవలం పనితీరు ఆధారంగా మంత్రి పదవి కేటాయించినట్టు తెలిపారు. నాగబాబును మొదట రాజ్యసభకు అనుకున్నాం. అక్కడ కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నాం. నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత మంత్రి పదవిపై చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమీ లేవని.. అందువల్ల నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలని అన్నారు.

హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌పై కేసు అంశాలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్నారు. అల్లు అర్జున్ తరుపున ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ బాధిత కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా కల్పిస్తే బాగుండేదన్నారు. రేవతి ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడం వల్లే జనాల్లో ఆగ్రహం వ్యక్తమైందన్నారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయకూడదని.. ఆ థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే సరిపోయేదన్నారు.

ఈ ఘటనపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని.. చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నారు. పుష్ప 2 సినిమాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారని.. టికెట్లు రేట్ల పెంపునకు అవకాశం ఇచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories