Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

Pawan Kalyan Man of the Match in Andhra Pradesh Elections 2024
x

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

Highlights

పవన్ మాటల్లోనే చెప్పాలంటే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన ఘన విజయం సాధించింది. 2 లోక్ సభ సీట్లను దక్కించుకుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ 11 సీట్లలో గెలిస్తే జనసేన మాత్రం పోటీ చేసిన 21 సీట్లను దక్కించుకోవటం ద్వారా అసెంబ్లీలో టీడీపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

పడి లేచిన పవనం.

ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడు అతడే...

ఎన్నో అవరోధాలు.. మరెన్నో అవమానాలు..

అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిన పవర్ స్టార్

కూటమి చరిత్రాత్మక విజయంలో కీలక పాత్రధారి పవన్ కల్యాణ్.

ఇపుడు ఏ నోటా విన్న పవన్ కల్యాణ్ పేరే. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల మ్యాచ్ లో మ్యాన్ ఆప్ ది మ్యాచ్ పవనే. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా పవనే. రాజకీయాల్లో ఎవరైనా తాము పెరిగి ఇతరులను తగ్గించాలని భావిస్తారు. పవన్ మాత్రం తాను తగ్గి ఇతరులను పెంచాడు. వెరసి జగన్‌ను ఓడించటమనే కూటమి లక్ష్యాన్ని చేధించారు.

2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశారు. దాన్నొక ప్రధాన అజెండాగా మార్చారు. దీని కోసం అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అన్నిటినీ భరించారు. చంద్రబాబుతో కలవటమేంటని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన సత్యమే.

పవన్ మాటల్లోనే చెప్పాలంటే అనేక మాటలు పడ్డాడు. ప్లీజ్ సార్ ప్లీజ్ ... మా రాష్ట్రం సర్.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సర్.. ఒక్కసారి ఆలోచించండి సర్ .. మూడు పార్టీలు కలిస్తేనే జగన్ ను ఓడించే బలం వస్తుంది సర్ అని బీజేపీ పెద్దలను ఒప్పించారు. టీడీపీకీ, బీజేపీకీ.. ప్రత్యేకంగా చెప్పాలంటే మోడీకీ, చంద్రబాబుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను శాంతింపచేయటంలో పవన్ కీలక పాత్ర పోషించాడు.

2014లో ఎన్డీఏతో కలిసి ఉన్న చంద్రబాబుకు కొద్ది కాలంలోనే మోడీతో చెడింది. ప్రత్యేక హోదా మాట దేవుడెరుగు.. రాజధానికి నిధులు, ఇతర రాయితీల విషయంలో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. చంద్రబాబుకు దక్కాల్సిన గౌరవం కూడా దక్క లేదు. దీంతో ఆయన ఎన్డీఏ నుంచి తెగతెంపులు చేసుకున్నాడు. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇతర పక్షాలను ఐక్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. రాహుల్ గాంధీతో చేసిన రాజకీయ స్నేహం కూడా వర్కవుట్ కాలేదు. మోడీకి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత స్థాయిలోనూ మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.. దీంతో మోడీ, చంద్రబాబుల మధ్య రాజకీయంగా శత్రు వైరుధ్యాలు ఏర్పడ్డాయి.

2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు మరింత బలహీనపడ్డారు. రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కోవాలంటే మోడీతో మళ్ళీ చేతులు కలపటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు బలంగా నమ్మారు. చంద్రబాబు ఎంత కావాలనుకున్నా బీజేపీ నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు బాగుంటే తాము బాగుంటామని భావించే అనేకమంది పెద్దలు బీజేపీకి ఎంత చెప్పి చూసినా ప్రయోజనం కనబడలేదు. ఒక రకంగా దిక్కతోచని స్థితిలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వేగుచుక్కలా నిలిచారు. టీడీపీ-బీజేపీ-జనసేన రాజకీయ మైత్రి కోసం పవన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకముందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం బయటకు వచ్చి టీడీపీ-జనసేన ఈ రోజు నుంచే కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.

చంద్రబాబు జైలుకెళ్ళిన ఒక విషాద సందర్భంలో, దైన్య స్థితిలో పవన్ చేసిన పొత్తు ప్రకటన ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది మొదటి నుంచే చంద్రబాబుకూ, పవన్ కళ్యాణ్ కు ఉన్న అండర్ స్టాండింగ్ అని రాజకీయ పరిశీలకులు భావించారు.

మొదటి అంకమైతే పూర్తయింది కానీ, బీజేపీని ఒప్పించే పని మాత్రం పూర్తి కాలేదు. చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వచ్చాక కూడా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఏపీలో తెలుగుదేశం శ్రేయస్సు కోరుకునే రాజగురువుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో పెద్దాయన చేసిన ప్రయత్నాలు కూడా అరకొరగానే ఆగిపోయాయి. ఈ దశలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఢిల్లీ పెద్దలను ఒప్పించి మూడు పార్టీల కూటమి అనే రాజకీయ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాడు. కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి గురించి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించి ప్రశింసిస్తున్న సందర్భాన్ని కూడా ఇపుడు చూస్తున్నాం.

పడి లేచిన పవనం...

2008లో తన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీతో పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం యూత్ విభాగానికి నాయకత్వం కూడా వహించాడు.. 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించటం ద్వారా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారారు. దీంతో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి కన్నా పవన్ కళ్యాణే అందరికీ టార్గెట్ అయ్యారు. ఆ తరువాత ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేసి కాంగ్రెస్ లో విలీనం చేయటంతో కొంతకాలం మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ చిత్రపటంపై మళ్ళీ మెరుపులు మెరిపించారు. 2014 ఎన్నికల నాటికి జనసేనను స్థాపించినా అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించారు.

కట్ చేస్తే.. .

2014లో తెలుగుదేశం అధికారం చేపట్టిన కొంతకాలానికే పవన్ కళ్యాణ్ తో గ్యాప్ పెరిగింది. అది క్రమేపీ పెద్దదయింది.. దీంతో టీడీపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు, లోకేష్ ల అవినీతిని ప్రశ్నిస్తూ నాగార్జున యూనివర్శిటీ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటుచేసి విమర్శలు గుప్పించాడు. దీంతో టీడీపీ సోషల్ మీడియా పవన్ ను టార్గెట్ చేసింది.. పవన్ లక్ష్యంగా హైదరబాద్ లో చంద్రబాబుకు బంధువైన ఒక ప్రముఖ నటుడి కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం ఏర్పాటుచేసినట్టు కూడా ప్రచారం జరిగింది. తన తల్లిని సైతం నిందిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆక్రోశించిన సందర్భం కూడా ఉంది. బాలకృష్ణ ఏం మాట్లాడాడో, తనకు వ్యతిరేకంగా టీడీపీ ఏం చేస్తుందో చెబుతూ బహిరంగ వేదికలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సెకండ్ టేక్

2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనను ఏ మాత్రం సంతృప్తికర ఫలితాలు రాలేదు. గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు. సరిగ్గా ఇక్కడే నాయకుడంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ నిరూపించారు.

తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన పార్టీకి ప్రాణవాయువులందించి జవసత్వాలు సమకూర్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. టీడీపీ హయాం కన్నా వైసీపీ పాలనలోనే ఎక్కువ అవమానాలు ఎదురవుతున్నట్టు పవన్ భావించారు. అమరావతి రాజధాని విధ్వంసంపై స్పందించారు. రైతులకు అండగా నిలిచారు. అనేక సందర్భాల్లో రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల బాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకూ, ఆయన కుటుంబసభ్యులకు జరిగిన అవమానంపై స్పందించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులకు అండగా నిలిచి ఆర్ధిక సాయం అందించారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన మధ్య మళ్ళీ స్నేహం చిగురించింది. అదే దశలో అధికారపార్టీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. పోలీస్ బలగాలతో ఆయన పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అన్నిటినీ పవన్ ఎదిరించారు. ధైర్యంగా నిలబడ్డారు. అధికారపార్టీ నుంచి ఎన్నో వేధింపులు, అవమానాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేశారు. ఏపీలో కూటమి పొత్తు పొడిచేలా చేయటం ద్వారా వైసీపీ ఘోరమైన ఓటమిలో ప్రధాన భూమికను పోషించారు.

తాను తగ్గి కూటమిని పెంచి...

వైసీసీని ఓడించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి. ఇదీ పవన్ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఎంతవరకైనా తగ్గేందుకు పవన్ కల్యాణ్ సిద్దపడ్డార. పొత్తులో భాగంగా 60 నుంచి 70 సీట్లు అడగాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ తరువాత కనీసం 40 నుంచి 50 సీట్లు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందని భావించారు. కానీ, 24 సీట్లకే పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారు. ఆ తరువాత బీజేపీకి సర్దు బాటు చేయాల్సిన సమయంలో మరో మూడు సీట్లను తగ్గించుకుని 21 సీట్లకే పరిమితమయ్యారు. సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు.

అన్ని సీట్లలో పోటీ చేసే ఆర్ధిక వనరులు మన వద్ద ఎక్కడున్నాయంటూ బలమైన ప్రశ్నను సంధించటం ద్వారా పార్టీ శ్రేణులను ఆలోచింపచేశారు.. అయితేనేం, పవన్ మాటల్లోనే చెప్పాలంటే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన ఘన విజయం సాధించింది. 2 లోక్ సభ సీట్లను దక్కించుకుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ 11 సీట్లలో గెలిస్తే జనసేన మాత్రం పోటీ చేసిన 21 సీట్లను దక్కించుకోవటం ద్వారా అసెంబ్లీలో టీడీపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది.మరో వైపు టీడీపీ 135, బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. ఫవన్ కల్యాణ్ పడుతూ, లేస్తూ ఎదురుదెబ్బలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఎక్కడ వెనకడుగు వేసినా ఈ చరిత్రాత్మక విజయం కూటమి సొంతమయ్యేది కాదు.. ఈ ఘన విజయంలో పవన్ దే కీ రోల్. అందుకే ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అసలైన అర్జునుడు పవన్!

Show Full Article
Print Article
Next Story
More Stories