Pawan Kalyan: వారాహి దీక్ష అంటే ఏంటి.. ఇప్పుడే ఎందుకు చేయాలి?

Pawan Kalyan 11 Days Varahi Deeksha Know Varahi Devi Significance
x

Pawan Kalyan: వారాహి దీక్ష అంటే ఏంటి.. ఇప్పుడే ఎందుకు చేయాలి?

Highlights

జనసేన ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్షా వస్త్రాలు ధరించి వచ్చారు.

Pawan Kalyan Varahi Deeksha: సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ కష్టపడి రాణించిన పవణ్ కళ్యాణ్.. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సొంతం చేసుకున్న జనసేనాని కూటమి విజయానికి సేనాపతిలా పనిచేసి విజయం చేకూర్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తున్నారు... పవన్ కళ్యాణ్ వారాహి అమ్మ వారి దీక్షను 11 రోజులపాటు కొనసాగించనున్నారు. ఆయన కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ దీక్ష చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టారనే దానిపై పొలిటికల్, సినిమా రంగాల్లో చర్చ నడుస్తోంది.

జనసేన ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్షా వస్త్రాలు ధరించి వచ్చారు. నిన్న ప్రారంభించిన దీక్ష 11 రోజుల పాటు చేస్తారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ దీక్ష చేపట్టారని అంటున్నారు. ఉపవాస దీక్ష చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కి దైవభక్తి ఎక్కువ ఆయన వారాహి అమ్మ వారి భక్తుడు కూడా. అందువల్లే ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. తెలంగాణలోని కొండగట్టుతోపాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు నిర్వహించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా ఈ వాహనం పై నుంచే చేసి ఘన విజయం సాధించారాయన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించింది జనసేన దీంతో వారాహి వాహనం సెంటిమెంట్‌ కూడా కలిసి వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు.

వారాహి దీక్ష పాటిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కేవలం పాలు, పండ్లు లాంటి కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. గతేడాది జూన్‌లో వారాహి విజయ యాత్ర చేపట్టిన సమయంలో పవన్ కల్యాణ్ వారాహి అమ్మ వారి దీక్ష పాటించారు. వారాహి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న ఏడు రూపాల్లో వారాహి మాత రూపం ఒకటి అని మన పురాణాలు చెబుతున్నాయి. రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగానూ చెబుతుంటారు. మరికొన్ని గ్రంథాల్లో లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొంటారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మ వారి దీక్షను సాధారణంగా జ్యేష్టమాసం చివరలో లేకుంటే ఆషాఢమాసం ప్రారంభంలో స్వీకరిస్తారు. ఈ ఏడాది వారాహి నవరాత్రులు జులై 6వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దృష్టి, దిష్టి దోషాలు, పిశాచ, పీడ భయాందోళనలు తొలగడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వారాహి నవరాత్రుల సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు, తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. రెండు పూటల మాత్రమే ఆహారం స్వీకరిస్తూ నేలపైనే పడుకుంటూ, అమ్మ వారిని పఠిస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పవన్ ఈ దీక్షను చేపట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ పిఠాపూరం పర్యటనకు వెళ్లనున్నారు. జూలై ఒకటో తేదీన పిఠాపురం నియోజకవవర్గంలో ఆయన పర్యటిస్తారు. అదే రోజు అక్కడ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారు. మూడు రోజులు పాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అందుకు ముందు జూన్ 29న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు పవన్.

మొత్తానికి తనను గెలిపించిన నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపి అక్కడి అభివృద్ధిఫై పోకస్ చేస్తారు. కాగా పవన్ ఈ వారాహి దీక్షలోనే కీలక కార్యక్రమాలు తలపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories