ఎస్‌ఈసీ ఆదేశాలను బేఖాతర్ చేసిన అధికారులు

ఎస్‌ఈసీ ఆదేశాలను బేఖాతర్ చేసిన అధికారులు
x

నిమ్మగడ్డ ఫైల్ ఫోటో  

Highlights

*తొలివిడత నామినేషన్‌ ప్రక్రియను పట్టించుకోని అధికారులు *కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు *నోటిఫికేషన్ వేయాలని వెళ్లిన అభ్యర్థులకు చుక్కెదురు

నిజానికి నేడు తొలివిడత నామినేషన్‌ ప్రక్రియ షురూ కావాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎస్ఈసీ హోదాలో కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్‌ఈసీ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం ఆఫీసులకు తాళాలు తీయలేదు. ఈ సంఘటనలతో అధికారులు ఎస్‌ఈసీ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని అర్ధమైపోయింది. ప్రభుత్వ ఆగ్రహానికి గురికావడం ఎందుకనే కలెక్టర్లు మౌనంగా ఉన్నారా.. లేదంటే ఖచ్చితమైన ఆదేశాలు అందలేదా.

తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి ఏపీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో కలెక్టర్‌ కనీసం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. దీంతో జిల్లాలోని మండల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి.

తూర్పుగోదారి జిల్లాలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు చుక్కెదురైంది. నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో టీడీపీ నేతలు అందోళన చేపట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారిస్తోన్న అధికారులు సమాధానం చెప్పాలని బైఠాయించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళాలు వేయడంతో అధికారులు సందర్శకులు, సిబ్బంది అయోమయానికి గురయ్యారు.. కలెక్టరేట్ లో కొన్ని శాఖల కార్యాలయాలు తెరుచుకోలేదు.

అనంతపురం జిల్లా పెనుగొండ డివిజన్ పరిధిలోని సిబ్బంది అందుబాటులో లేరు. నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థులు వెనుతిరిగారు. కొన్నిచోట్ల అధికారులు నామినేషన్లను తిరస్కరించారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అభ్యర్థులను వెనక్కి పంపించారు.

కడప, విశాఖ జిల్లాలోనూ అదే పరిస్థితి. అధికారులు సహాయనిరాకరణ చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేపట్టలేదు. దీంతో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అభ్యర్థులు వెనుతిరిగారు.

గుంటూరు జిల్లాలో అధికారులు మాత్రం ఎస్‌ఈసీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. పెదకాకాని మండలం, తక్కెళ్లపాడులో తొలి నామినేషన్‌ దాఖలు అయింది... ఇలా జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది.

ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఖంగుతిన్నాయి. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పప్పులో కాలేశామని ఫీలవుతున్నాయి. అయితే ఎన్నికలకు ఆరోగ్యవంతులైన ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతారని ఉద్యోగ సంఘాల నేతలు కొత్త స్వరం వినిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఎలక్షన్‌ డ్యూటీకి మినహాయించాలని ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈసీని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories