AP Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారా... దీనివల్ల ఏంటి లాభం?

Now will special status be given to Andhra Pradesh What is the benefit of this?
x

AP Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారా... దీనివల్ల ఏంటి లాభం?

Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఈ అంశాన్ని చేర్చింది.

AP Special Status: తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ లో కీలకంగా మారిన నేపథ్యంలో ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్ళీ చర్చ మొదలైంది. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు తలచుకుంటే ఈసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు 2014లో ముఖ‍్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ఆ తరువాత జగన్ అధికారంలోకి రావడం, కేంద్రంలో మోదీ సొంత పార్టీ బలంతో ప్రధాని కావడంతో ప్రత్యేక హోదా సంగతిని దాదాపు అందరు మరిచిపోయారు. ఇంతకీ, ప్రత్యేక హోదా అంటే ఏంటి.. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం లాభం?

ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు?

ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, నిధులు లభిస్తాయి. ప్రత్యేక ఆర్ధిక సహాయంతో పాటు ఇతర ప్రయోజనాలు ప్రత్యేక హోదా కింద దక్కుతాయి. ఈ హోదా దక్కాలంటే ప్రణాళిక సంఘం సిఫారసులు చేయాలి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్ డీ ఏ ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది.

1969లో తొలిసారిగా ఐదో ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు జమ్మూ కశ్మీర్, అసోం, నాగాలాండ్ లకు ప్రత్యేక హదా కల్పించారు. ఈ మూడు రాష్ట్రాలకు ఉన్న సామాజిక , భౌగోళిక, ఆర్ధిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ తర్వాతి పరిణామాల్లో మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఈ హోదా దక్కింది. దేశంలో ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు.

పర్వత ప్రాంతాలు, రవాణ సౌకర్యం లేకపోవడం, మౌళిక వసతులు లేని ప్రాంతాలను ప్రత్యేక హోదా కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ది మండలి సమావేశం ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటుంది.

ప్రత్యేక హోదాతో ఉపయోగం ఏంటి?

ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుంది. 10 శాతం రాష్ట్రాలు ఇవ్వాలి. ఒక ఆర్ధిక సంవత్సరం ఖర్చు చేయని నిధులను వచ్చే ఏడాది కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ రాష్ట్రాలకు పన్నులు, సుంకాల్లో రాయితీలు కూడ లభిస్తాయి. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం 60 శాతం నిధులను ఇస్తే రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలి.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు యూపీఏ సర్కార్ హామీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఈ అంశాన్ని చేర్చింది. అయితే 2014లో కేంద్రంలో యూపీఏ స్థానంలో ఎన్ డీ ఏ ప్రభుత్వం ఏర్పాటైంది. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని అప్పటి ఎన్ డీ ఏ ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని తీసుకోవడంపై చంద్రబాబు ప్రభుత్వంపై అప్పట్లో వైఎస్ఆర్ సీపీ, జనసేన, కాంగ్రెస్ లు విమర్శలు చేశాయి. ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలు రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేశాయి. 2024లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇండియా కూటమి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది.

ప్రత్యేక హోదా మళ్ళీ తెర ముందుకు..

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ డీ ఏ కూటమిలో తెలుగుదేశం, జేడీ(యూ) కీలక భాగస్వామ్యపక్షాలుగా మారాయి. ఈ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో జేడీ(యూ) ఉంది. అయితే ఈ రెండు పార్టీలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఎన్ డీ ఏలో ఈ రెండు పార్టీలు కీలకంగా మారినందున ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్, బీహర్‌లకు ప్రత్యేక హోదా వస్తుందా?

బీహార్ కుల సర్వే 2022 ఆధారంగా ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. 2014 లో రాష్ట్ర విభజన సమయంలో హైద్రాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. అంతేకాదు ఏపీ పునర్విభజన చట్టంలో ఈ అంశం ఉన్న విషయాన్ని కూడా ఏపీ సర్కార్ గుర్తు చేస్తుంది. ఒడిశా కూడా ప్రత్యేక హోదా కోరుతుంది. తమ రాష్ట్రంలో 22 శాతం గిరిజన జనాభా ఉన్నందున తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఆ రాష్ట్రం కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల డిమాండ్లను తోసిపుచ్చింది.

ప్రత్యేక హోదాపై ఏపీలో రాజకీయ పోరాటం

2014లో చంద్రబాబు సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంపై పాచిపోయిన లడ్డూలు పంపారని అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి 25 ఎంపీలు కట్టబెడితే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని 2019 ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 22 మంది ఎంపీ పదవులు దక్కించుకుంది. అయితే కేంద్రంలో మోదీ ఎన్ డీ ఏ కూటమిలో బీజేపీ ఒంటరిగానే 303 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితిలో మోదీ సర్కార్ లేనందున ప్రత్యేక హోదా డిమాండ్ పై ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేదని జగన్ అప్పట్లో ప్రకటించారు.

ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి...

ప్రస్తుతం ఎన్ డీ ఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నందున ప్రత్యేక హోదా సహా ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేసేలా ఒత్తిడి చేయాలని ఆంధ్రా మేథావుల సంఘం కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు కోరుతున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కోసం ఈ నెల 15న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదాను కేంద్రం ఇస్తే సంతోషమని రాయలసీమ మేథావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.... ఏపీ విభజన చట్టంలోని అంశాలకు అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేసేలా టీడీపీ సర్కార్ ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా పేరుతో కాకున్నా... మరోరూపంలోనైనా రాష్ట్రానికి అవసరమైన నిధులను దక్కించుకొనే వ్యూహంతో ముందుకువెళ్లాలని ఆయన చంద్రబాబు సర్కార్ కు సూచించారు.

వైఎస్ జగన్ 2019లో అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం కేంద్రంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వానికి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లేదా ఏపీ విభజన చట్టంలోని అంశాలకు అవసరమైన నిధులను తెచ్చుకోలేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంపై పోరాటానికి వైఎస్ఆర్ సీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories