మహానాడులో పొత్తులపై నో క్లారిటీ.. ఇంతకీ జనసేనతో పొత్తు ఉన్నట్టా... లేనట్టా?

No Clarity on TDP and Jana Sena Alliances in Maha Nadu | AP News
x

మహానాడులో పొత్తులపై నో క్లారిటీ.. ఇంతకీ జనసేనతో పొత్తు ఉన్నట్టా... లేనట్టా?

Highlights

*మహానాడు తీర్మానాలపై తమ్ముళ్లలో చర్చ

Andhra Pradesh: తెలుగుదేశం పండగైన మహానాడు తెలుగు తమ్ముళ్లకు సంబరాలను పంచిందా? అంచనాలకు మించి జనం రావటంతో పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోందా? ఇంత జరిగినా అన్నీ సౌకర్యంగానే అనిపించినా ఇంకా ఏదో ఒక్కటి తగ్గిందనుకుంటున్న నేతలు మహానాడులో ఆ ఒక్కదానిపై క్లారిటీ రాలేదని ఫీలవుతున్నారా? ఆ ఒక్క మాట వస్తే మరింత బావుండేదన్న అభిప్రాయం కనిపిస్తోందా? పుష్ప సినిమాలో డైలాగ్‌లా తమ్ముళ్లు ఫీలవుతున్న ఆ ఒక్కటి ఏంటి? మహానాడులో రాని ఆ క్లారిటీ ఏంటి?

రెండురోజుల మహానాడు గ్రాండ్‌ సక్సెస్‌తో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు ఇంకా పార్టీలో అంతర్గతంగా సెట్ చేసుకోవాల్సిన అంశాలపై పార్టీ అధిష్టానం ఇప్పుడు దృష్టిసారిస్తోంది. 40 శాతం యువతకే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది, వరుసగా మూడుసార్లు ఓటమి పాలయితే ఇక నో టికెట్, రెండుసార్లు ఒకేరకమైన పదవిని చేపడితే మూడోసారి మార్పు ఖాయమన్న సీరియస్ నిర్ణయాలపై పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇలాంటి నిర్ణయాల వల్ల వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావచ్చని పార్టీ సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారట. ఒకవేళ తమకు రాకుంటే, తాము ముందుకు రాకుంటే, తమ వారసుల్ని రంగంలోకి దించేద్దామని లెక్కలు వేసేసుకుంటున్నారట.

అయితే, ఇదే సమయంలో పొత్తులపై కూడా ఆ పార్టీలో ఇంటర్నల్‌ మరో రకమైన డిస్కషనే నడుస్తోందట. ఒకవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే స్పష్టం చేస్తోన్న వేళ అంతకుముందే జనసేనతో పొత్తుపై వన్ సైడ్ లవ్‌తో ఏం ఉపయోగం తమ్ముడూ అంటూ చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో కచ్చితంగా ఈ మహానాడులో పొత్తులపై ప్రకటన ఖాయంగా ఉందని చాలామంది భావించారట. కానీ అటు అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు ఇటు ఇతర ముఖ్యనేతలంతా వైసీపీ సర్కారే లక్ష్యంగా విమర్శలు సంధించారు. రాజకీయ తీర్మానాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తే అందులో పొత్తుల ప్రస్తావనే లేకపోవటంతో కాసింత నిరాశ చెందారట తెలుగు తమ్ముళ్లు.

నిజానికి, జనసేనతో పొత్తుల గురించి ప్రస్తావిద్దామని అధిష్టానం తొలుత భావించిందట. కాకపోతే, ఆ అంశం డైవర్టయి దానిపైనే చర్చ జరుగుతుంది కాబట్టే ఈ సమయంలో పొత్తుల విషయాన్ని ప్రస్తావించకపోవటమే మేలని పెద్దలు భావించారట. మహానాడుకు ముందు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పొత్తుల అంశం ప్రస్తావనకు వచ్చినపుడు అధినేత చంద్రబాబు సున్నితంగా దాటవేశారట. కొద్ది రోజుల ముందు పొత్తుల గురించి పరోక్షంగా తాను చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చకు దారితీసిన తరుణంలో ఎన్నికలకు ముందు సరైన సమయంలో వాటిపై నిర్ణయం తీసుకోవచ్చని బాబు భావిస్తున్నారట. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్లు ముందుగానే పొత్తులపై ఎవరూ తొందరపడి మాట్లాడవద్దని పార్టీ నేతలకు కూడా ఈ మేరకు సంకేతాలను పంపారట.

మొత్తంగా పొత్తులపై ఇప్పటికే స్పష్టమైన క్లారిటీతో ఉన్న టీడీపీ అధిష్టానం ముందుగానే మాట్లాడి పార్టీ నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ అనవసరమైన కన్ఫ్యూజన్‌ను, రాజకీయ అలజడిని కలిగించటం ఎందుకని భావిస్తోందట. సో మొత్తానికి మహానాడు జోష్‌లో ఉన్న పార్టీ క్యాడర్‌ను కొద్దిరోజులు ఆ విధంగానే ముందుకు పంపుతూ సరైన సమయంలో తన మనసులో మాటను బయట పెట్టాలని అధినేత అనుకుంటున్నారట. మరి పొడవబోయే పొత్తులెలా ఉంటాయో దూసుకు వచ్చే మాటల కత్తులెలా ఉంటాయో తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories