Andhra Pradesh: ఏపీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ

Night Curfew in Andhra Pradesh From Today | AP News Today
x

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

Highlights

Andhra Pradesh: రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

Andhra Pradesh: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో మంగళవారం (18వ తేదీ) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది.

వీరికి మినహాయింపు..

కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరికోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది.

అమలులోకి వచ్చే ఇతర నిబంధనలు..

► ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు.

► వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయానికొస్తే బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలి.

► సినిమా హాళ్లలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటిస్తూ ప్రేక్షకులందరూ మాస్క్‌ ధరించాలి.

► ఇక ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ధరించాలి.

► వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు.

► మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రదేశాల్లో కోవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు, మార్కెట్లు మూసివేసేలా చర్యలు ఉంటాయి.

► మార్కెట్‌ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి.

► దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. భక్తులు భౌతిక దూరం. మాస్క్‌లు ధరించటం తదితర జాగ్రత్తలు పాటించాలి.

► జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

► నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories