JP Nadda: జనసేన డిమాండ్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న నడ్డా

Nadda Said There Was No Need To Respond To Janasena Demands
x

JP Nadda: జనసేన డిమాండ్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న నడ్డా

Highlights

JP Nadda: పొత్తులపై నేతలెవ్వరూ మాట్లాడవద్దని నడ్డా ఆదేశం

JP Nadda: రాష్ట్రంలో పొత్తు అంశాలను పూర్తిగా పక్కనపెట్టి.. బీజేపీని ఎలా బలోపేతం చేయాలో దృష్టిపెట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన నడ్డా రాత్రి నగరంలో రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పొత్తల అంశంపై ఎవరూ నోరు విప్పకూడదని హెచ్చరించారు. బీజేపీ తమతో కలిసి పోటీచేస్తుందని కొన్ని ప్రత్యర్థి పార్టీల మైండ్‌ గేమ్‌ గురించి ఆలోచించవద్దన్నారు.

ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులు ఏపీలో పర్యటనలు చేస్తుండగా... తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడలో పర్యటిస్తున్నారు. వచ్చిరాగానే జేపీనడ్డా ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల అంశం ఇప్పుడేందుకని చురకలు అంటించారు.

ఏపీలో బీజేపీ బలోపేతం కావాలంటే.. నాయకులు, కార్యకర్తల్లో ఐక్యత కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాలను ఏర్పాటు చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ ఛార్జిలు చొరవ చూపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించాలని ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు నడ్డా.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జేపీ నడ్డాకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన వచ్చే సమయంలో బీజెవైఎం నేతలు కూడా లోపలకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీనిపై కార్యకర్తలు అక్కడే బైటాయించి నిరసన తెలపడంతో.. సోము వీర్రాజు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత తమ కార్యకర్తలను సముదాయించి బయటకు పంపించారు. అక్కడి నుంచి ర్యాలీగా సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణానికి నడ్డా చేరుకుని... బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ ఛార్జిల సభలో పాల్గొన్నారు.

ఏపీలో వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలే.. వాళ్లతోనే మన పోరాటం చేయాలని, తెలంగాణలోనూ కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీతోనే పోరుబాట తప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాదని, అన్నా చెల్లెళ్ల పార్టీ అని స్పష్టం చేశారు. విజయవాడ నుంచే బీజేపీ విజయం ఢంకా మోగించాలని కార్యకర్తల్లో జేష్ ను నింపారు.

ఇదే సభా వేదిక పై నుంచి జగన్ ప్రభుత్వ తీరుపై దగ్గుబాటి పురంధరేశ్వరి, సోము వీర్రాలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ బలమెంత అని జాతీయ నాయకులు అడుగుతున్నారని, ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని ప్రతిఒక్కరూ పార్టీబలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పెట్టుబడిదారులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయన్నారు. భూ మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియాతో ఏపీ నిండిపోయిందని, లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories