Mudragada Padmanabham: అందుకే జగన్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్నారా?

Mudragada Padmanabham Making Route for Political Career
x

Mudragada Padmanabham: అందుకే జగన్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్నారా?

Highlights

Mudragada Padmanabham: ముద్రగడ రాజకీయ జీవితం మళ్లీ పట్టాలెక్కనుందా? పర్యటనలు, భేటీలు, సమావేశాలు, మాటలు ముద్రగడను ఏ పార్టీ వైపు నడిపించనున్నాయి?

Mudragada Padmanabham: ముద్రగడ రాజకీయ జీవితం మళ్లీ పట్టాలెక్కనుందా? పర్యటనలు, భేటీలు, సమావేశాలు, మాటలు ముద్రగడను ఏ పార్టీ వైపు నడిపించనున్నాయి? ఏపీ పొలిటిక్స్‌‌లో మరోసారి తన ముద్ర వర్కవుట్‌ కాబోతుందా? సెలబ్రెటీల నుంచి సీనియర్‌ రాజకీయ నాయకులతో నెరుపుతున్న రాజకీయం ముద్రగడను ఎటువైపు తీసుకెళ్లబోతోంది? టీడీపీతో అయితే చాన్సే లేదంటున్న ముద్రగడ వైసీపీలోకి కదలిరాబోతున్నారా? తాజాగా కోడి పందాలపై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక జరుగుతున్న కొత్త కోణం ఏంటి? ఇంతకీ ముద్రగడ ముద్ర ఏంటి ఆయన రూటేంటి?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఎప్పుడూ ఉత్కంఠే వుంటుంది. అయితే అది ఉద్యమంలోనే కాదు, తనకు ఆవేదన కలిగించే ఏ అంశంలోనైనా ఆయన తీరు ఇలాగే వుంటుంది. ముద్రగడ పద్మనాభంను మొదటి నుంచి ఫాలో అయ్యే ముఖ్యులకు కూడా ఆయన ఏమనుకుంటున్నారో, అమలు చేసేవరకూ తెలియదు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ పద్మనాభం తాజాగా ఏపీ రాజకీయాల్లో తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అలకలు, మౌనాలు ముద్రగడకు మామూలే అయినా, ఈసారి ఏపీ సర్కార్‌ను కోట్‌ చేస్తూ రాసిన లేఖపై మాత్రం సర్వత్ర చర్చ జరుగుతోంది.

ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ రోజుల్లో కోడిపందాలకు ఉన్న విశిష్టతను చెబుతూ ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డికి ముద్రగడ ఓ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ఐదు రోజులూ కోడిపందాల పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమ‌న్నారు. ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో ప్రస్తావించిన ముద్రగడ చివరికి పర్మిషన్ ఇవ్వడానికి పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని వాపోయారు. పండగుల సమయంలో ప్రజలకు పెద్దగా వేరే కూడా పని కూడా ఉండదు కాబట్టి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని, అలాంటి సెలబ్రేషన్స్‌కు పర్మిషన్‌ ఇవ్వాలని ఆయన విన్నవించారు.

ముద్రగడ రాసిన ఈ లేఖతో ఆయనపై రాజకీయవర్గాల్లో మరోసారి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగిన ముద్రగడ తాజాగా తన అడుగులును అధికార పార్టీ వైసీపీ వైపు వేస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సంక్రాంతి కోడి పందాల లేఖే కాదు అప్పట్లో ఓసారి కాపుల రిజర్వేషన్ల అంశం గుర్తు చేస్తూ తమ జాతికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలంటూ సీఎంకు ఓ లెటర్‌ రాశారు. అడగనివారికి, అడిగిన వారికి అన్నీఇస్తూ దానకర్ణుడిలా వ్యవహరిస్తున్న మీరు, మీ పదవిని మూణాళ్ల ముచ్చటగా కాకుండా మాజీ సీఎంల మాదిరిగా పూజలందుకునేలా ఉండాలంటూ సూచించారు. దానకర్ణుడు అనే మాటే, ముద్రగడపై విమర్శల వర్షానికి గేట్లెత్తింది. ఈ మాటను పట్టుకుని అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు కాపు నేతలు, ముద్రగడపై మండిపడ్డారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయారా అంటూ విమర్శించారు. ఈ మాటలతో హర్ట్‌ అయిన ముద్రగడ కొన్నాళ్లు రాజకీయ పరమైన అన్ని అంశాలకు దూరంగా ఉన్నారట.

నిజానికి, ముద్రగడ కాపు ఉద్యమాన్ని చాలాకాలం వదిలేశారు. చాలాకాలం రాజకీయాలకు, కాపు ఉద్యమానికి దూరంగా వున్నారు. అలాంటి ముద్రగడ కాపు ఉద్యమంలోకి తిరిగి రావడానికి ముఖ్యకారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. కాపు జాతికి బిసీ రిజర్వేషన్లు ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఏడాదైనా పట్టించుకోకపోవడంతోనే ముద్రగడ ఉద్యమం చేపట్టారు. జగన్ మాత్రం కాపులకు రిజర్వేషన్ హామీ ఇవ్వలేదు. ఇది టీడీపీ, జననసేలకు ప్రచారాస్త్రమైనా, ఎక్కువ శాతం కాపు ఓట్లు వైసీపీకు బదిలీ అయ్యాయి. దీంతో ముద్రగడ మళ్లీ మౌనంలోకి జారుకున్నారు. సోషల్ మీడియాలో విమర్శలతో, ఏకంగా నాయకత్వాన్ని వదిలేస్తున్నట్టు ప్రకటించారు.

తాము హామీ ఇవ్వకపోయినా ఈమధ్య వైసీపీ ప్రభుత్వం కాపులకు చాలా ప్రాధాన్యతనిచ్చింది. కాపు నేస్తం వంటి పథకాలు ప్రవేశపెట్టి, వేలాది కాపు కుటుంబాలను ఆదుకుంది. కాపు నేతలకు సైతం మంత్రి మండలితో పాటు పలు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ల అంశం పక్కకుపోయి, వైసీపీ పట్ల కాపులు సంతోషంగా వున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మొన్న ముద్రగడ కూడా, దానకర్ణుడు అని జగన్‌ను లేఖలో కీర్తించడం ఇందుకే అనే వారున్నారు. ఇక నుంచైనా తాను రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నారా అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ఏమైనా, రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యేందుకే, ముద్రగడ కాపు ఉద్యమాన్ని పక్కకు పెడుతున్నారని, కాపువర్గాల్లో చర్చ జరుగుతోంది. అదీగాక, కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా సీఎం జగన్‌కు లేఖ రాయడంపై కూడా ఆసక్తికరమైన టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి ముద్రగడ కాపు ఉద్యమ నాయకత్వాన్ని విడిచిపెట్టడం ఎంత చర్చనీయాంశమైందో తాజాగా జగన్‌కు లేఖ రాయడం కూడా అంతే చర్చనీయాంశమవుతోంది. మరి, మున్ముందు ఏం జరగబోతోందో, ముద్రగడ అడుగులు ఏంటో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories