ముద్రగడ సవాల్ పవన్ కళ్యాణ్‌ గెలుపునకే కలిసొచ్చిందా?

Mudragada challenge is a win for Pawan Kalyan?
x

ముద్రగడ సవాల్ పవన్ కళ్యాణ్‌ గెలుపునకే కలిసొచ్చిందా?

Highlights

‘అసెంబ్లీలో అడుగు పెడతా.. జగన్ తాట తీస్తా..’ సరిగ్గా రెండేళ్ల క్రితం జనసేన అధినేత చేసిన కామెంట్ ఇది. అటు పవన్‌ అసెంబ్లీలో ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వైసీపీ కూడా సవాల్‌ చేసింది. సీన్‌ కట్ చేస్తే.. పవన్‌ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది.

పిఠాపురం.. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. అందరి అటెన్షన్ సాధించిన సెగ్మెంట్ ఇది. ఆ మాటకొస్తే.. యావత్ దేశం దృష్టీ పిఠాపురంపైనే కనిపించింది. అందుకు కారణం జనసేనాని పవన్ ఈ నియోజకవర్గం బరిలో నిలవడమే. 2019లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోవడం, అధికార వైసీపీ.. ప్రధాన ప్రతిపక్షానికి మించి సేనానినే టార్గెట్ చేయడం.. వీటన్నింటికీమించి కాపు ఉద్యమ నేత ముద్రగడ.. పవన్‌ని ఓడించి తీరుతానని శపథం చేయడం వంటి పరిణామాలు పిఠాపురాన్ని హాట్‌సీట్ గా మార్చేశాయి. అంతెందుకు వైసీపీ అధినేత జగన్ చివరి ప్రచారం ముగిసిందీ పిఠాపురంలోనే. వంగా గీత ను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని సైతం సంధించారు. కానీ, అవేవీ వర్క్‌ఔట్ కాలేదు. సేనాని తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, ఈ విజయం అంత ఈజీగా వచ్చింది కాదు. ఇంతకూ, పిఠాపురంలో సేనాని విజయం వెనుక 'కీ ఫ్యాక్టర్స్' ఏంటి?

‘అసెంబ్లీలో అడుగు పెడతా.. జగన్ తాట తీస్తా..’ సరిగ్గా రెండేళ్ల క్రితం జనసేన అధినేత చేసిన కామెంట్ ఇది. అటు పవన్‌ అసెంబ్లీలో ఎలా అడుగుపెడతాడో చూస్తామంటూ వైసీపీ కూడా సవాల్‌ చేసింది. సీన్‌ కట్ చేస్తే.. పవన్‌ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. పిఠాపురం గడ్డపై జనసేన జెండా రెపరెపాలాడుతోంది. బలమైన అభ్యర్థి వంగా గీతాను అంతే బలంగా ఓడించడం ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేస్తోంది. అయితే పవన్‌కు ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు.. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్‌ ఎన్నో అటుపోట్లను, ఘోర అవమానాలను ఎదుర్కొన్నారు. వైసీపీని ఓడించేం దుకు కూటమి కోసం ఎన్ని త్యాగాలు చేశారో.. అంతకుమించిన కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. చివరికి.. వైసీపీ అభ్యర్థిపై 70వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పవన్ కళ్యాణ్ బరిలో నిలిచారు. కానీ, వైసీపీ ప్రభంజనం ముందు నిలవలేక రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఆనాటి ఎన్నికల్లో వైసీపీ పక్కా ప్రణాళికల ప్రకారమే జనసేన అధినేత రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఇప్పుడుకూడా వైనాట్ 175 అంటూ వచ్చిన వైసీపీ.. పిఠాపురంలో పవన్‌ను ఓడించే మాస్టర్ స్ట్రాటజీలను తెరపైకి తెచ్చింది. కులాల ఈక్వేషన్లతో పాటు టాప్ లీడర్లను పిఠాపురంలో మోహరించింది. వైసీపీ అధినేత జగన్ తన ఎన్నికల ప్రచారం ముగింపునకు పిఠాపురం నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. పవన్‌ను ఓడించేందుకు చివరి అస్త్రంగా వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురం పంపిస్తా అని బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. ఇదే సమయంలో వంగా గీత సరికొత్త సెంటిమెంట్‌ స్ట్రాటజీని అమల్లో పెట్టారు.

నిజానికి.. పిఠాపురం ఓటు బ్యాంకులో కీలక పాత్ర కాపులదే. నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 29వేల 591 ఓటర్లు ఉండగా వారిలో దాదాపు లక్ష ఓట్లు కాపు సామాజిక వర్గానివే. మిగిలిన ఓటర్లలో బీసీ, ఎస్సీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వారిలో చాలా మంది వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులే. ఇదే సమయంలో పవన్, వంగా గీత ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే. కాబట్టి ఈ నియోజకవర్గంలో పవన్‌ను ఓడించాలంటే వంగా గీతను డిప్యూటీ సీఎంను చేస్తాననే హామీ ఒక్కటే సరిపోదు ఈ విషయం వైసీపీకీ తెలుసు. అందుకే, జనసేనానిని ఓడించేందుకు ముద్రగడను రంగంలోకి దించింది. ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తాననీ, ఒకవేళ పవన్ గెలిస్తే పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఈ పరిణామం పిఠాపురం లెక్కలను పూర్తిగా మార్చేసింది. కాపు ఉద్యమ నేతగా పవన్‌ను ఓడిస్తానంటూ ముద్రగడ చేసిన ఛాలెంజ్ కచ్చితంగా గీతను గెలిపిస్తుందని భావించారు. కానీ, ముద్రగడ సీన్‌లోకి రావడం సేనానికే కలిసొచ్చింది. దాని ఫలితమే 70వేల పైచిలుకు మెజారిటీకి కారణంగా చర్చ జరుగుతోంది.

ఓవైపు ఓటమే ఎరుగని నేత వంగా గీత.. ఇంకోవైపు ఆమె గెలిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్న జగన్ హామీ.. ఇంకోవైపు తమ సంక్షేమం పథకాలపై అంతులేనంత నమ్మకం.. ఈ మూడు అంశాలు పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్ ఓటమిని శాసిస్తాయని అధికార పార్టీ భావించింది. కానీ, పిఠాపురం ప్రజలు మాత్రం పవన్‌ను గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు కారణం పవన్ కళ్యాణ్‌పై అభిమానం ఒక్కటే కాదు, జనసేన అధినేతకు స్థానికంగా పిలిస్తే పలికే లీడర్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు కూడా. ఓ విధంగా రాష్ట్ర రాజకీయంలో జనసేనాని గేమ్ ఛేంజర్‌గా నిలిస్తే.. పిఠాపురంలో పవన్ విజయంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది మాత్రం ఎస్వీఎస్ఎన్ వర్మ.!

ఔను.. పిఠాపురంలో పవన్ గెలుపు విషయంలో కూటమి శ్రేణులంతా వర్మనే హీరోగా అభివర్ణిస్తు న్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే టీడీపీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడి పని చేసి పార్టీని పటిష్టం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పిఠాపురం సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఎస్పీఎస్ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఏ క్షణంలో ఎస్పీఎస్ఎన్ వర్మను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడారో.. ఆ క్షణం నుంచీ నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిఠాపురంలో జనసేనానిని గెలిపించే బాధ్యతను వర్మ భుజానికి ఎత్తుకున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని విజయం ఖాయమనీ, అందుకు పూర్తి బాధ్యత తనదేననీ వర్మ చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కూ హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా తాను చంద్రబాబు శిష్యుడినననీ, ఆయన మాటే తనకు శిరోధార్యమనీ ప్రకటించారు. టీడీపీ క్యాడర్లో అసంతృప్తిని కూడా మాయం చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి అందరినీ ఎకతాటిపైకి తీసుకువచ్చారు.

మరోవైపు.. పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వేసిన ఎత్తుగడలు, వ్యూహాలను దీటుగా తిప్పికొట్టడంలో వర్మ ప్రధాన పాత్ర పోషించారు. వర్మ పవన్ కల్యాణ్ ఉద్రేకంతో, ఉద్వేగంతో పొరపాట్లు చేయకుండా ఎక్కడికక్కడ నియంత్రించారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సినీ హీరో పక్కన ఉన్నారన్న మొహమాటం లేకుండా సూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. పవన్ కల్యాణ్ ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినపుడు కళ్లతోనే వారించారు. అందుకు సంబంధించిన వీడియోను జనసైనికులే ఇప్పుడు వైరల్ చేస్తూ వర్మకు కృతజ్ణతలు చెబుతున్నారు. పిఠాపురంలో నిజమైన హీరో వర్మే అంటూ ప్రస్తుతిస్తున్నారు. పిఠాపురంలో వర్మ మద్దతును కాస్త పక్కనపెడితే.. ఈ ఎన్నికలకు ముందు పవన్ ఎత్తుకున్న నినాదం హండ్రెడ్ పర్శెంట్ స్ట్రైక్ రేట్. పిఠాపురంతో పాటు జనసేన పోటీచేసిన అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి ఆ విషయంలో కూడా అనుకున్నది సాధించారు. ఇక మిగిలిందల్లా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని సేనాని ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే.

Show Full Article
Print Article
Next Story
More Stories