గుంటూరు జిల్లా అమీనాబాద్ చెరువులో.. అక్రమంగా మట్టి తరలింపు

Mud Mafia In Guntur District
x

గుంటూరు జిల్లా అమీనాబాద్ చెరువులో.. అక్రమంగా మట్టి తరలింపు

Highlights

Guntur: జగనన్న కాలనీలకు మట్టి తరలింపు పేరుతో.. చెరువు మట్టిని వెంచర్లకు తరలిస్తున్న మాఫియా!

Guntur: నాణ్యమైన మట్టి కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, బంజరు భూములు ఇలా ఏ భూములైనా సరే, మట్టి మాఫియా కళ్లు పడి భారీ గోతులుగా మిగిలిపోతున్నాయి. అక్రమ తవ్వకాలకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి.

ఇదీ గుంటూరు జిల్లా అమీనాబాద్‌లోని చిన్ననీటిపారుదల చెరువు పరిస్థితి. కొండల నుంచి వచ్చే నీరు చెరువుకు ఆధారం. కొండల నుంచి వచ్చే మట్టితో చెరువులో నాణ్యమైన గ్రావెల్‌ నిల్వ ఉంది. దీనిని గుర్తించిన కొందరు పొలాలకు మట్టి తరలింపు పేరుతో, ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు. గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి పట్టణాలకు ఇక్కడి నుంచి మట్టి తరలించారు. స్థానిక అధికారపార్టీ నేత ఒకరు చెరువులో రాత్రిపగలు తవ్వకాలు చేసి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిపోతూనే ఉంది.

అమీనాబాద్‌ చెరువు నుంచి అనుమతులు తీసుకుని మట్టిని తరలిస్తే భూగర్భ గనులశాఖకు డబ్బులు చెల్లించాలి. భూగర్భ గనులశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోనందున రాయల్టీ చెల్లించలేదు. ఇదంతా యథేచ్ఛగా జరిగినా యంత్రాంగం దృష్టికి రాలేదు. మట్టి మాఫియాకు పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో.. కొందరు వృత్తిగా మార్చుకుని నిత్యం ఇదే పనిలో నిమగ్నమయ్యారు.

అమీనాబాద్‌ చెరువులో మట్టిని జగనన్న కాలనీకి తరలించడానికి అనుమతులు ఇవ్వాలని జలవనరులశాఖకు కొందరు దరఖాస్తు చేశారు. ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఉండడంతో దస్త్రం ఆఘమేఘాలపై కదులుతోంది. రోజుల వ్యవధిలోనే అన్ని ప్రక్రియలు పూర్తి కావాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో యుద్ధప్రాతిపదికన దస్త్రం రాష్ట్ర కార్యాలయానికి చేరింది. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లి అనుమతి వచ్చిన తర్వాత తవ్వకాలు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే చెరువులో మట్టి 80 శాతం ఖాళీ కావడంతో నిర్దేశిత మొత్తం మట్టిని ఎక్కడికి తవ్వి తరలిస్తారో వారికే తెలియాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories