Ventilators in Hospitals: మరిన్ని వెంటిలేటర్లు.. మంత్రి నాని ప్రకటన

Ventilators in Hospitals: మరిన్ని వెంటిలేటర్లు.. మంత్రి నాని ప్రకటన
x
Alla Nani (File Photo)
Highlights

Ventilators in Hospitals: పది రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది.

Ventilators in Hospitals: పది రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది. దీనికి మరింత అవసరమైన ఏర్పాట్లు చేస్తేనే బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం వీలైనన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. వీటిని వెంటనే అమలు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది.

రాష్ట్రంలో ఆక్సిజన్‌తో కూడిన 22,500 పడకలు ఇప్పటికే అందుబాటులో ఉండగా.. మరో 10 వేల పడకల్ని సిద్ధం చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిడ్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రతి రోజు కోవిడ్‌ పరీక్షల కోసం రూ.5 కోట్లు , క్వారంటైన్‌ కేంద్రాల్లో భోజనం, పారిశుధ్యం కోసం 1.5 కోట్ల వ్యయమవుతోందని వివరించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, కరోనా నోడల్‌ అధికారి కృష్ణబాబుతో కలిసి కోవిడ్‌ నియంత్రణ చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

► కోవిడ్‌ మరణాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అదేశించారు.

► మరింత మంది వైద్యుల్ని సమకూర్చేందుకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రతినిధి బృందంతో మాట్లాడుతున్నాం.

► జిల్లా కోవిడ్‌ ఆసుపత్రుల పెంపు ద్వారా మొత్తంగా 39,051 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో దాదాపు 4,300 ఐసీయూ బెడ్స్, 17,380 నాన్‌ ఐసీయూ బెడ్స్‌ (ఆక్సిజన్‌ సదుపాయం), నాన్‌ఐసీయూ బెడ్స్‌ 17,371 అందుబాటులో ఉన్నాయి. (క్వారంటైన్‌ బెడ్లు అదనం)

► మొత్తంగా శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 22, ఈస్ట్‌ గోదావరిలో 6, వెస్ట్‌ గోదావరిలో 9, కృష్ణాలో 13, గుంటూరులో 11, ప్రకాశంలో 9, నెల్లూరులో 7, చిత్తూరులో 12, అనంతపూరంలో 16, కడపలో 6, కర్నూలులో 7 ఆసుపత్రులు ఉన్నాయి.

► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 72,711 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఉన్న 34,556 యాక్టివ్‌ కేసులకు (సమీక్ష సమయానికి) సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

క్రిటికల్‌ కేర్‌ కోసం రాష్ట్ర స్థాయి ఆసుపత్రుల పెంపు

► రాష్ట్ర స్థాయిలో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల సంఖ్యను 10కి పెంచాలంటూ గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల అమలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా ఆసుపత్రుల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమ గోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూరం జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్‌ ఆసుపత్రులను రాష్ట్ర స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

► తద్వారా క్రిటికల్‌ కేర్‌ కోసం 2,380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపురం, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆసుపత్రులలో క్రిటికల్‌ కేర్‌ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆసుపత్రులు క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులుగా మార్చామన్నారు. ఈ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు.

► రాష్ట్ర స్థాయిలో ఆసుపత్రులు కాబట్టి ప్రమాణాలు అదే స్థాయిలో ఉండాలని సీఎం ఆదేశించారు. వచ్చే వారం రోజులు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇక్కడ భోజనం, పారిశుద్ధ్యం కూడా మెరుగ్గా ఉండాలన్నారు. మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని, కేసుల సంఖ్యకు తగినట్టుగా వైద్యులు, సిబ్బందిని ఉంచాలన్నారు.

► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేసుల సంఖ్య చూసి ఆందోళనొద్దు

► రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో దాదాపు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, హైరిస్క్‌లో ఉన్న వారిపై దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

► దీనివల్ల పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరిగిందని అధికారులు వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొద్ది రోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.

కోవిడ్‌ మరణాలు తగ్గించడంపై దృష్టి

కోవిడ్‌ కారణంగా మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్‌ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీ వైరల్‌ డ్రగ్‌లను పెద్ద మొత్తంలో ఆసుపత్రులకు అందుబాటులో ఉంచుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

► రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్‌ రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఆర్డర్‌ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే 5 వేల డోసులను రాష్ట్రంలోని కోవిడ్‌ ఆసుపత్రులకు చేర్చారు. రేపు సాయంత్రానికి మరో 15 వేలకు పైగా డోసులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆసుపత్రులకు చేరుకోనున్నాయి.

► ఆగస్టు మూడో వారం నాటికి ఇంకో 70 వేలకుపైగా డోసులు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే మొత్తంగా దాదాపు 90 వేలకుపైగా రెమ్‌డెసివిర్‌ డోసులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతోంది.

► విషమ పరిస్థితుల్లో ఉన్న 15 వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రానికీ ఇంజక్షన్లు లేవని అధికారులు చెప్పారు. గణాంకాల ప్రకారం చూస్తే క్రిటికల్‌ కేర్‌ చికిత్స అవసరమైన రోగుల సంఖ్య 7 నుంచి 8 శాతం వరకూ ఉంటోంది.

► ఈ లెక్కన దాదాపు 2 లక్షల పాజిటివ్‌ కేసుల వరకూ ప్రభుత్వం తెప్పిస్తున్న ఇంజక్షన్లు సరిపోతాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భయం వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం నాటి సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

► పరిస్థితిని బట్టి ఒక్కో రోగికి 5 నుంచి 7 డోసుల వరకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్కరిపైనా దాదాపు రూ.35 వేల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఖర్చు విషయంలో రాజీ పడొద్దు

► కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రుల్లో అత్యవసర మందులను వెంటనే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టాలి. (ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూ, మానిటరింగ్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు.)

► అన్ని రకాల చర్యల కోసం వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు కానుంది. దీంతోపాటు ప్రతిరోజూ కోవిడ్‌ పరీక్షల కోసం రోజుకు రూ.5 కోట్లు, క్వారంటైన్‌ సెంటర్లలో భోజనం, పారిశుధ్యం కోసం రూ.1.5 కోట్లు ఖర్చవుతోంది.

► ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. కోవిడ్‌ సోకిన వారికి మెరుగైన వైద్యం, సౌకర్యాలు, సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీపడొద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories