మంచు మోహన్ బాబు, తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలవడంపై, రాజకీయవర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన త్వరలో వైసీపీని...
మంచు మోహన్ బాబు, తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలవడంపై, రాజకీయవర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన త్వరలో వైసీపీని వీడి, కమలం గూటికి చేరతారన్న ప్రచారం సాగుతోంది. ఇంతకీ మోహన్ బాబు, వైసీపీని వీడతారన్న చర్చకు కారణమేంటి? జగన్‌పై ఆయన అలిగారా? ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, బీజేపీకి మోహన్ బాబు అవసరం వుందా మోహన్ బాబుకు బీజేపీ అవసరముందా? కాషాయ అగ్రనేతలను మంచు ఫ్యామిలీ కలవడం వెనక అసలు కథేంటి?
మంచు ఫ్యామిలీ మనసు మారుతోందా? కమలం వైపు లాగుతోందా? మోడీ, షాలను కలిసిన తర్వాత కూడా జగన్‌పై ప్రశంసల అర్థమేంటి? జగన్ మీద మోహన్ బాబు అలిగారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది?
కలెక్షన్ కింగ్, మాజీ ఎంపీ, సినీ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబం ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం టాలీవుడ్‌లోనే కాదు, తెలుగు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మోడీని కలిసిన ఫోటోలు బయటకు వచ్చినా, అమిత్ షాను కలిసిన చిత్రాలేవీ బయటకు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలతో, మంచు ఫ్యామిలీ బీజేపీ అగ్రనాయకులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
త్వరలో తమ విద్యాసంస్థల ఫంక్షన్‌కు రావాలని ఆహ్వానించేందుకే ప్రధాని మోడీని కలిశామని మోహన్ బాబు చెబుతున్నా, అంతకుమించిన సంప్రదింపులేవో జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి రావాలని మంచు ఫ్యామిలీని మోడీ ఆహ్వానించారా అన్న విలేకరు ప్రశ్నకు, దానిపై తానిప్పుడే మాట్లాడను, అవన్నీ తర్వాత చెబుతానంటూ మోహన్ బాబు చేసిన దాటవేత వ్యాఖ్యలు కూడా, ఆయన పార్టీ మారతారన్న ఊహాగానాలకు బలమిస్తున్నాయి.
మోహన్ బాబు కమలం గూటికి చేరడం ఖాయమా? వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? జగన్ మీద మోహన్ బాబు అలిగారన్న ప్రచారం వాస్తవమేనా?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రూటే సెపరేటు. తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా వున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీలో అనేక నియోకజవర్గాల్లో ప్రచారం సైతం నిర్వహించారు. వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం వుండటం, చంద్రబాబు అంటే అస్సలు పడకపోవడంతో, మోహన్ బాబు వైసీపీలో చేరారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వస్తే, ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని కూడా మోహన్ బాబు ఆశించారట. టీటీడీ చైర్మన్ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నా గల్లంతయ్యాయి.
అయితే టీటీడీ చైర్మన్ పోస్టు ఆశించానన్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా వివరణ ఇచ్చారు మోహన్ బాబు. ఆ తరువాత ఆయనకు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ పదవిని మరో నటుడు విజయ్ చందర్‌కు ఇచ్చారు సీఎం జగన్. దీంతో సీఎం జగన్, మోహన్ బాబుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, మరో ఏడాదిలో వైసీపీకి దక్కబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో, తనకు ఒకటి వస్తుందని కూడా మోహన్ బాబు ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ నుంచి అలాంటి సానుకూల సంకేతాలేవీ రావడం లేదట. వైసీపీకి అంత ప్రచారం చేసినా, తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదని రగిలిపోతున్న మోహన్ బాబు, ఈ పరిణామాల నేపథ్యంలోనే, తాజాగా ప్రధాని నరేంద్రమోదీని కలవడంతో ఆయన ఫ్యామిలీ బీజేపీలో చేరబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
మోహన్ బాబును బీజేపీ కోరుకుంటోందా? బీజేపీని మోహన్ బాబు కోరుకుంటున్నారా? ఇద్దరికీ పరస్పర ప్రయోజనాలు ముడిపడి వున్నందుకే కలిశారా?
మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మోహన్ బాబు, అమిత్ షా మధ్య ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత మోహన్ బాబు కుటుంబీకులు కేంద్ర హోం సెక్రటరీ ఏకే భల్లాను కలిశారు. అయితే, ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి, అక్కడ పాపులర్ ఫేసున్న లీడర్ దొరకడం లేదు. మోహన్ బాబు కాషాయంలోకి వస్తే, బీజేపీ దూకుడు మరింత పెంచవచ్చని అమిత్ షా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అటు మోహన్ బాబు కూడా, వైసీపీలో తనకు ప్రాధాన్యం ఏమాత్రం లభించడం లేదు కాబట్టి, ఇక కమలంలోకి వెళ్లడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీకి నాయకత్వం వహించడానికీ సిద్దమన్నట్టుగా ఆయన సంకేతాలిచ్చారట. అయితే, సీఎం జగన్ పాలనపై మోహన్ బాబు ప్రశంసలు కురిపించడం ఇందులో మరో ట్విస్టు. ఒకవేళ వైసీపీ మీద కోపం వుంటే, జగన్‌ను విమర్శించాలి. కానీ ప్రశంసించారు. అంటే, ప్రధాని, హోంమంత్రి దగ్గరే తనకు పరపతి వుందని జగన్‌కు చెప్పడం ద్వారా, వైసీపీలో తనకు ప్రాధాన్యం పెంచుకోవడం, మోహన్ బాబు వ్యూహంలో భాగమన్న చర్చ జరుగుతోంది. ఇలా ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షాను కలిసి, తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది మంచు ఫ్యామిలీ. వీరి అడుగులు ఎటు పడతాయన్నది రానున్న కాలమే చెప్పాలి.
మోహన్ బాబు ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై, ప్రచారంలో వున్న మరో రెండు యాంగిల్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజధానితో పాటు మరో అంశం కూడా, వీరి భేటికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ ఆర్గ్యూమెంట్లకు బలం చేకూరుస్తున్న అంశాలేంటి?
రాజధాని అంశంతో అమరావతి అట్టుడుకుతోంది. దీనిపై చర్చించేందుకు మోహన్ బాబు ఢిల్లీవెళ్లి, ప్రధాని నరేంద్ర మోడీని కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు చిరు సలహాతోనే మోహన్ బాబు మోడీని కలిశారని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి చెప్పడం వల్లే, మోడీ దగ్గరకు వెళ్లి విశాఖ రాజధానిగా మారడం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంగీకారమేనన్న సమాచారం వివరించేందుకే, మోహన్ బాబు ప్రధాని దగ్గరకు వెళ్లారని తెలుస్తోంది.
వైసీపీ నుంచి కమలంలోకి వెళతారన్న ప్రచారం ఒకవైపు, మరోవైపు చిరు సలహాతో రాజధానిపై మోడీతో మాట్లాడటం వంటి రెండు వాదనలు ప్రచారం జరుగుతుంటే, ఈ రెండింటికీ విరుద్దంగా మరో ఆర్గ్యూమెంట్ కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిరంజీవి క్లోజ్ కావడం, మోహన్ బాబుకు అస్సలు నచ్చడం లేదట. చిరుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట మోహన్ బాబు. సినీ పరిశ్రమలో చిరు యాక్టివ్ కావడం, దాసరిలా పెద్దన్న పాత్ర పోషించేందుకు పావులు కదపడం కూడా మోహన్ బాబుకు రుచించడం లేదట. అసలే సీఎం జగన్, తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వడం లేదని రగిలిపోతున్న మోహన్ బాబుకు, ఈ పరిణామాలు సహించడం లేదట. అందుకే ప్రధాని మోడీని కలిసి, తనకు ప్రధాని ఇస్తున్న ఇంపార్టెన్స్‌ను చాటిచెప్పాలనుకున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ టూర్ అన్న చర్చ జరుగుతోంది.
మొత్తానికి మోహన్ బాబు, మాటలే కాదు చేతలు కూడా సంచలనమే. తన రూటే సెపరేటు అని చెప్పుకునే మోహన్ బాబు, ప్రధానితో ఒక్క మీటింగ్‌తో అనేక రకాల చర్చలకు తెరలేపారు. మరి మోడీని మంచు ఫ్యామిలీ కలవడంలో అర్థం, వైసీపీని వీడి బీజేపీలో చేరడమా లేదంటే చిరు సలహాతో రాజధానిపై ప్రధానితో మాట్లాడమా ఈ రెండూ లేదంటే, చిరంజీవికి జగన్ క్లోజ్ కావడం సహించలేక, తాను మోడీకీ దగ్గరవడమా అన్నది, ఎవరి ఆలోచనను బట్టి, వారు అంచనా వేసుకుంటున్నారు. చూడాలి, మంచు ఫ్యామిలీ రూటేంటో, అడుగులు ఎటు పడతాయో.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire