వైసీపీలో ఉన్న ఆ టీడీపీ కోవర్టులు ఎవరు.. రోజా ఎవరిని ఉద్దేశించి కామెంట్‌ చేశారు?

MLA Roja Fire On TDP Coverts In The YSRCP
x

వైసీపీలో ఉన్న ఆ టీడీపీ కోవర్టులు ఎవరు.. రోజా ఎవరిని ఉద్దేశించి కామెంట్‌ చేశారు?

Highlights

MLA Roja: చిత్తూరు జిల్లా వైసీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారా? జగన్‌ కోసం పనిచేస్తున్నామంటూ లోపాయికారిగా చంద్రబాబుకు సపోర్ట్‌ చేస్తున్నారా?

MLA Roja: చిత్తూరు జిల్లా వైసీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారా? జగన్‌ కోసం పనిచేస్తున్నామంటూ లోపాయికారిగా చంద్రబాబుకు సపోర్ట్‌ చేస్తున్నారా? కోవర్టు రాజకీయాలపై నగరి ఎమ్మెల్యే రోజా ఎందుకంత సీరియస్‌ అయ్యారు? ఏకంగా చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేయాల్సినంత అవసరం ఎందుకొచ్చింది.? రోజాకు వచ్చిన కోవర్ట్‌ స్మెల్‌ ఏంటి? ఎవరిని ఉద్దేశించి రోజా అలా కామెంట్‌ చేశారు? ఆమెకు అందిన ఉప్పేంటి? తప్పెవరిది?

చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు నగిరి ఎమ్మెల్యే రోజా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌ను కలిసిన రోజా వైసీపీలో ఉన్న కోవర్టులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలో ఉంటూ, టీడీపీతో జత కలిసిన వారిని ఉపేక్షించబోమని, రాష్ట్ర డీజీపీ ఫోటోలతో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారామె. అంతేకాదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో వేసుకుని కొందరు అధికారులను బెదిరిస్తున్నారని, గతంలో సస్పెండ్ అయిన కొందరు నేతలు వైసీపీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళానన్న రోజా పెద్దిరెడ్డితో తనకు విబేధాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది.

నిజానికి, రోజా కొన్నాళ్ల నుంచి నగరి నియోజకవర్గంలో రాజకీయంగా అంత యాక్టివ్‌గా లేరన్న చర్చ జరుగుతోంది. నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారనే మాటే గానీ ఎమ్మెల్యే రోజాకు పెద్దగా తృప్తి లేదట. అపోజిషన్‌లో అవమానాలు పొజిషన్‌లో సొంత పార్డీ నేతలతో పోట్లాటలతోనే ఆమెకు సరిపోతోందట. టీడీపీ హయాంలో ఏడాదిన్నర పాటు అసెంబ్లీకి వెళ్లలేకపోయిన జ్ఞాపకాలను ఇప్పటికీ తలుచుకుంటున్న రోజా పార్టీ అధికారంలోకి వచ్చి తాను గెలిచినా ఇంచు‌మించు అదే పరిస్థితి మరో రూపంలో ఎదురవుతోందట. జరిగేదంతా జననేతకు చెబుతున్నా ఆయన మౌనం వెనుక పరమార్ధమేమో గానీ రోజాను మాత్రం ఈ చిక్కులు వీడటం లేదన్న చర్చ జరుగుతోంది.

నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి‌, నిండ్ర మండలాలలో రోజాపై కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర పడిన రోజాకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల అసమ్మతి నిప్పుల కుంపటిగా‌ మారిందని తెలుస్తోంది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కరైన రోజా ఏకంగా సీఎం జగన్ వద్ద తన సమస్యలను ఏకరువు పెట్టుకున్నారట. అన్నీ సర్దుకుంటాయని అప్పట్లో జగన్ ఓదార్చినా సమస్యలు, తిరుగుబాట్లు మాత్రం వీడటం లేదట. 2014 ఎన్నికల నాటికి రోజా నగరికి కొత్త అయినా ఆమెను అందరూ ఆదరించారు. రాజకీయ ఉద్దండుడు ముద్దు కృష్ణమనాయుడుపై పోటీ చేస్తే గెలిపించారు. అంతగా ఆదరించిన చోట ఈ అవమానాలు ఎందుకు ఎదురౌతున్నాయి? తిరుగుబాట్లు ఎందుకు జరుగుతున్నాయి? స్వయం కృతాపదారమా? అంతా నా ఇష్టం అనే స్వభావమా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రోజాను కుంగదీస్తున్నాయట.

రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా చిత్తూరు జిల్లా రాజకీయాలు మాత్రం జగన్ కనుసన్నల్లో లేవంటున్నారు వైసీపీ నేతలు కొందరు. ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే పార్టీ క్యాడర్ ఎమ్మెల్యేల కుటుంబపాలనే సాగుతోంది. అధినేతకు అంతా విధేయులుగానే కనిపిస్తున్నా ఎవరికి వారు పక్కవారిని పోటేయడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనే ఇది చాలా క్లియర్‌గా కనిపించిందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య అనైక్యత నివురుగప్పిన నిప్పులా మారిందట. పాత కాంగ్రెస్‌కు తీసిపోని అంతర్గత కుమ్ములాటలు నగరిలో వికటాట్టహాసం చేస్తున్నాయంటున్నారు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఈ క్రమంలో నియోజకవర్గాలను గుప్పెట్టలో పెట్టుకోవాలన్న కొత్త ఎమ్మెల్యేల అత్యాశ పాత నేతలకు పొగబెడుతోంది‌. అది కాస్తా తిరగబడి అగ్గి రాజుకుంటోందట.

సరిగ్గా ఇదే రోజాను నడివీధిలో నిలదీసే స్థితికి తెచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. రెండోసారి గెలిచాక తన కుటుంబం నగరిలో పాగా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారట. అన్నలు, భర్త, బంధుగణం, వందిమాగదులతో సొంత బృందం తయారు చేసుకున్నారట. అప్పటివరకు నియోజకవర్గ రాజకీయాలలో పాత కాపులుగా వర్గపోరులో నిలిచిన నేతలకు ఇది బాధ కలిగించినా రోజా పెద్దగా పట్టించుకోలేదట. అదే సమయంలో ప్రత్యర్థి నేతలకు వైసీపీ కండువా కప్పారు. అలా పాత నేతల అలక అసమ్మతిగా మారిందట. అసమ్మతి నేతలకు జిల్లా పెద్దాయన ఆశీర్వాదం తోడైందని, అందుకే రోజా భవిష్యత్తు బొంగురంలా తిరుగుతోందన్న చర్చ జరుగుతోంది. పక్క నియోజకవర్గాలలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కుటుంబ పాలనే సాగిస్తున్నా అక్కడ లేని సమస్య రోజాకు నగరిలో ఎదురవుతోందట. పట్టువిడుపులకు పోకుండా ఉంటే పర్వాలేదు కానీ పట్టి చూడాలంటే కుదరంటున్నారు స్థానిక నేతలు. మరి విచ్చుకున్న రోజాకే గుచ్చుకుంటున్న ముళ్లను తొలగించుకుని నగరి సిగలో సొగసవుతుందా రోజాను ముట్టుకోకుండా కాపాడే ముల్లులుగా మార్చుకుంటుందా? ఏమో కాలమే‌ సమాధానం చెప్పాలి.!

Show Full Article
Print Article
Next Story
More Stories