Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్‌ కొడతారా?

MLA Balakrishna Hat-Trick Attempts in Hindupur | Off The Record
x

హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్‌ కొడతారా?

Highlights

*బాలయ్య పవర్ డైలాగులకు ఈసారి ఓట్లు రాలుతాయా?

Balakrishna: కత్తితో కాదు కంటిచూపుతో శాసిస్తారు బాలయ్య. ఒక్క డైలాగ్‌తో వెండితెర మీద మెరుపులు మెరిపిస్తారాయన. తొడగొట్టారంటే బాక్సాఫీసు రికార్డులు బద్దలవుతాయి. సిల్వర్‌ స్క్రీన్‌ మీదే కాదు రాజకీయ తెర మీదే డైలాగ్స్‌లో దమ్ము, ధైర్యం చూపిస్తారు. అలాంటి నందమూరి నటసింహం హిందూపురంలో హ్యాట్రిక్‌ కోసం పావులు కదుపుతున్నారట. డైలాగులతో తెరమీద చెలరేగిపోయే బాలకృష్ణ నిజంగానే హ్యాట్రిక్‌ నమోదు చేయగలరా? ఒకవేళ నిజంగా అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో మార్పులు తప్పవన్న ప్రచారంలో వాస్తవమెంత?

కంటి చూపుతో శాసించే బాలయ్య హిందూపురంలో పట్టు కోసం విపరీతంగా శ్రమిస్తున్నారట. వెండితెర మీద మెరుపులు మెరిపించే నందమూరి నటసింహం ఈసారి తన హవా తగ్గకుండా పావులు కదుపుతున్నారట. ఉన్నఫళంగా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఒక్కోసారి సడన్‌గా నియోజకవర్గానికి వెళ్తూ తమ్ముళ్లలో ఉత్సాహం రేకెత్తిస్తున్నారట. అసలు బాలయ్య హిందూపురంలో ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు? ఇంతకుముందులా కాకుండా సైకిల్‌కు మరమ్మతులు చేస్తూ ఆయన వేస్తున్న ఎత్తుగడలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ బాలయ్య ఏం చేయబోతున్నారు?

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. కొన్ని సందర్బాల్లో అయితే ఆయన ఏమీ చెయ్యకుండా ఉన్నా సంచలనమే అంటారు ఆయన అభిమానులు. నందమూరి వారసుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తీరు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తుంది. ఎమ్మెల్యేగానే ఉన్న బాలకృష్ణ, పార్టీలో ఉన్నతమైన వేదికగా చెప్పుకునే పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానించడంతో తన పట్టును అట్లాగే కొనసాగిస్తూ హిందూపురంలో తెలుగుదేశం జెండాను తాను మూడోసారి పాతాలని డిసైడ్‌ చేసుకున్నారట.

నిజానికి, హిందూపురం అన్నగారి ఇలాఖా. దశాబ్ధాలుగా తెలుగుదేశానికి పెట్టని కోట. సార్వత్రిక ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డా ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కోటకు బీటలు వారినా ఈసారీ ఆయనదే హవా అంటున్నారు తమ్ముళ్లు. ఎన్నికల ముందు బాలయ్య చేసే మంత్రాంగం ఎలా పని చేస్తుందో చూడాలంటూ సవాల్‌ విసరుతున్నారు. 2019లో ఫ్యాన్ గాలికి సైకిల్ గింగరాలు కొట్టిన ఉదంతాలను గుర్తు చేసుకుంటూనే పంక్చరైన రెండు టైర్లకు మరమ్మతులు చేసి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేస్తారని నమ్మబలుకుతున్నారు.

అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెనుకొండ, హిందూపురం, మడకశిర సహా పలు నియోజకవర్గాలు, టీడీపీకి ముందు నుంచి పట్టుకొమ్మలు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థులే హిందూపురంలో గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రాతినిథ్యం వహించడం ఆయన రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకోవడంతో ఈ ప్రాంతంలో టీడీపీ హవా కొనసాగింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి, పెనుకొండలో తెలుగుదేశంలో కీలక నేతగా ఉన్న పరిటాల రవీంద్ర ప్రాతినిథ్యం వహిండం అప్పట్లో పార్టీకి అదనపు బలంగా మారింది. దశాబ్ధాలుగా టీడీపీకి ఎదురులేని ప్రాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు ఏవి వచ్చినా అక్కడ మెజార్టీ స్థానాలు టీడీపీనే వరించేవి. అన్నగారు వేసిన పునాదులే టీడీపీ తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెడుతూ వచ్చింది. అయితే, ఈసారి కూడా అదే హవాను నందమూరి నటవారసుడు ఈసారి కూడా కొనసాగిస్తారని తమ్ముళ్లు భరోసాగా ఉన్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ మినహా మిగిలిన 12 నియజకవర్గాల్లో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నుంచే వైసీపీ ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాలు జరిగాయి. అయితే, ఎక్కడా ఏకగ్రీవాలకు ఆస్కారం లేకుండా టీడీపీ నేతలు గట్టిగానే కృషి చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా అందరితో మాట్లాడి అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోనూ అదే స్థాయిలో నేతలు పనిచేశారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరును మాత్రం ఆపలేకపోయారు. బాలయ్య పవర్ డైలాగులకు ఓట్లు ఏమాత్రం రాలలేదు. దానికి కొన్ని కారణాలు చెబుతున్నారు టీడీపీ నేతలు. కరోనా మహమ్మారి ప్రభావంతో బాలయ్య కొన్నాళ్లు హిందూపురానికి దూరంగా ఉన్నా క్యాడర్‌ పట్టు సడలేదని, 2024 ఎన్నికల్లోనే తననే గెలిపిస్తామని చెబుతున్నారు నందమూరి అభిమానులు.

బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల్లో తెలుగుదేశం కాస్తో, కూస్తో సీట్లు సాధించింది. అయితే, అప్పట్లో బాలయ్య స్థానికంగా లేకపోవడం నేతలు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనకపోవడం పార్టీకి కొంత డ్యామేజ్ అయిందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. దాన్ని పూర్తిగా సెట్‌ చేసేలా నెలా, రెండు నెలలకు ఒకసారి వచ్చి నియోకవర్గమంతా కలియ తిరుగుతూ క్యాడర్‌కు, అధికారులకు మార్గనిర్దేశం చేయాలని బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చారట. ఇటీవల సినిమాలలో బిజీబిజీగా ఉన్నా ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నప్పటికీ చాలా రోజులుగా ఇటువైపు రాకపోవడంపై తమ్ముళ్లు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఆయన రాని లోటును భర్తీ చేస్తామని ఏదో పైకి భరోసా చెబుతున్నారట. అధికార పార్టీ తప్పులను ఎండగడుతూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌కు అన్ని విదాలుగా అండగా ఉండాలన్న తమ అభ్యర్థనను బాలయ్య అంగీకరించారని, త్వరలోనే నియోజకవర్గంపై మళ్లీ తన పట్టేంటే చూపిస్తారని చెబుతున్నారు.

కానీ, హిందూపురం టీడీపీలో ఓ వర్గమైతే బాలయ్యకు సపోర్ట్‌గా ఉంటుంది కానీ, పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా, పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన సమయంలో ఆయన కేవలం సినిమాలకే పరిమితమవడాన్ని క్యాడర్‌ తప్పుపడుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోకవర్గ కేంద్రంగా చేపట్టాల్సిన ఆందోళనల్లో ఇతర నేతలు పాల్గొంటూ నడిపిస్తున్నా అసలైన నేత, నందమూరి రాజకీయ వారసుడు రాకపోవడం వెలితిగానే ఉందని ఫీలవుతున్నారట. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్న వేళ తమ్ముళ్లుగా అండగా ఉంటే ఆ లెక్క వేరేగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారట. నా అనుకున్న వాళ్లు ఎక్కడున్నా వారికోసం ఎక్కడికైనా వస్తా ఏమైనా చేస్తా అని చెప్పే బాలయ్య నియోజకవర్గంలో మళ్లీ ఎలా పట్టు నిలుపుకుంటారో, పురం పార్టీలో ఎలా జోష్ నింపుతారోనని చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories