ఏపీలో గనులను మింగేస్తున్న ఘనులు!

ఏపీలో గనులను మింగేస్తున్న ఘనులు!
x
Highlights

గనులను మింగేసే ఘనులు వారు కొండలను పిండి కొట్టి జేబులను నింపుకుంటున్నా బడాబాబులు వారే మైనింగ్ అధికారుల అండదండలే వారి బలం. అధికారంలోకి వచ్చే పార్టీల...

గనులను మింగేసే ఘనులు వారు కొండలను పిండి కొట్టి జేబులను నింపుకుంటున్నా బడాబాబులు వారే మైనింగ్ అధికారుల అండదండలే వారి బలం. అధికారంలోకి వచ్చే పార్టీల అందదండలే వారికి శ్రీరామ రక్ష అక్కడ వారు పాడిందే పాట, ఆడిందే ఆట. ఖనిజాల ఖిల్లా కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ మాఫియా దందాపై hmtv గ్రౌండ్‌ రిపోర్ట్‌.

ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లా ఖనిజాల ఖిల్లగా ప్రఖ్యాతి పొందింది. అందులో ముఖ్యంగా బనగానపల్లి, డోన్ నియోజకవర్గాలు సున్నపురాయి గనులకు పేరొందిన ప్రాంతాలు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలు, నాపరాతి గనులు కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఈ గనులే ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల గండి కొడుతూ మైనింగ్‌ అధికారులకు అక్రమ సంపాదనగా మారాయి. బేతంచర్ల, సమీప ప్రాంతమైన బనగానపల్లెలో ఖనిజ సంపద విస్తారంగా ఉంది. అయితే అక్కడ ప్రభుత్వ లీజు గడువు ముగిసినా ఇప్పటికీ అక్రమ మైనింగ్‌ కాసుల వర్షం కురిపిస్తోంది. అటు దీనిని నియంత్రించాల్సిన మైనింగ్ అధికారులు కొందరి నేతల పుణ్యమా అంటూ మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు.

గనుల తవ్వకాలు జరగాలంటే భూగర్భ గనుల శాఖ నుంచి NOC తీసుకుని ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ఫీజు చెల్లించి మైనింగ్ కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అటు బేతంచెర్ల, బనగానపల్లె, అవుకుతోపాటు కొలిమిగుండ్ల మండలాల్లో వెయ్యికిపైగా క్వారీలు ఉన్నాయి. అయితే అందులో 300 క్వారీలకు లీజు అనుమతి గడువు ముగిసినా విలువైనా సంపద తరలిపోతూనే ఉంది. అటు నాపరాతి గనులు కూడా బడాబాబులు, రాజకీయ నాయకుల ఆధీనంలోనే ఉన్నాయి. ఇటు భూగర్భ గనుల శాఖ అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉండటంతో అక్రమార్జనకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇక రాయల్టీని పరిశీలించే చెక్‌పోస్ట్‌ దగ్గర విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా ట్రాక్టర్‌కు సుమారు 500 రూపాయలు, లారీలకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తూ వాహనాలను వదిలిపెడుతున్నారు.

రవ్వలకొండ, యాగంటి ఉమా మహేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న బసవన్న కట్ట అక్రమ మైనింగ్‌తో చాలా వరకు ధ్వంసం అయ్యాయి. అటు మైనింగ్ సమయంలో పేళ్లుళ్ల వల్ల సమీపంలో ఉన్న ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మృతిచెందారు. దీంతో ఎంతోమంది ఆందోళన బాట పట్టినా పరిస్థితి మాత్రం మారలేదు. రెండేళ్ల క్రితం బ్లాస్టింగ్ సమయంలో పలువురు గాయపడగా సుమారు 14మంది కన్నుమూశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో మైనింగ్ శాఖ ఖనిజాభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సైతం చేరుకోవడం లేదు.

కొండలను పిండి చేస్తూ మైనింగ్‌ మాఫియా కోట్లకు పడగలెత్తుతుంది. కొందరు బడా బాబులు లీజు తీసుకున్నామంటూ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. అటు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు బడాబాబులు. అటు తమను ప్రశ్నించేవారే లేరంటూ సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం దృష్టిసారించాలంటున్నారు వామపక్ష నేతలు.

కర్నూలు మైనింగ్ శాఖ కార్యాలయం కింద 30 మండలాలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 17 మండలాల్లో మైనింగ్‌ లీజులు కొనసాగుతున్నాయి. బేతంచర్ల, డోన్‌, ప్యాపిలీ, ఆదోనీ, ఎమ్మిగనూరుతోపాటు కృష్ణగిరి మండలాల్లో 745 క్వారీలు ఉండగా 97 మైనింగ్‌లు లీజుపై కొనసాగుతున్నాయి. బనగానపల్లె మైనింగ్‌ ఆఫీసు పరిధిలో 680 క్వారీలతోపాటు మరో 832 మైనింగ్ లీజులు ఉన్నాయి. ఈ ఆఫీసు పరిధిలో 23 మండలాలు ఉండగా ఏడు మండలాల్లో మైనింగ్ క్వారీలు కొనసాగుతున్నాయి. అటు 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మైనింగ్‌ల వల్ల ఆశాఖకు 222 కోట్ల రూపాయల టార్గెట్‌కు 242 రూపాయల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో అప్పట్లో మైనింగ్ ఆదాయంలో జిల్లా మూడవ స్థానంలో ఉంది.

ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గనులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వానికి ఆదాయం మాత్రం రావటం లేదు. 2020-21కి 164 కోట్ల రూపాయలు టార్గెట్ కాగా ఇప్పటివరకు 103 కోట్ల రూపాయలే మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఆదాయం తక్కువగా రావడంతో ఇప్పుడు ఈ గనుల్లో లభ్యమయ్యే ఖనిజం నాణ్యమైనది కాదంటూ ముద్రవేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఇక్కడ దాదాపు 20 గనులు మూతపడ్డాయి. ఇక మైనింగ్ తగ్గిపోవడంతో వివిధ సంస్థలు భూములు కొన్నాయి. మరోవైపు విమానాశ్రయం కోసం మరికొన్ని భూములు కేటాయించారు. అటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందటంతో ప్రస్తుతం ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగి గనులు అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి.

50 ఏళ్ల క్రితం బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల్లో నాపరాళ్ల వెలికితీత కొనసాగింది. అయితే అప్పుడు గనుల ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు ఏమాత్రం ప్రయోజనం పొందలేకపోయారు. అటు నొక్కు లేకుండా గనులు త్రవ్వడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. మొత్తానికి బడాబాబులు, రాజకీయ నేతల తీరుతో అటు ప్రభుత్వం, ప్రజలు ఏమాత్రం ప్రయోజనం పొందలేకుండాపోయారు. ఇటు రోజుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా ప్రశ్నించేవారు లేకపోవడంతో మొత్తానికి బడాబాబులు కోట్లకు పడెగెత్తారు.

బనగానపల్లె మండలంలోని పలుకూరు, రామకృష్ణాపురం అవుకు మండలంలోని రామాపురం కొలిమిగుండ్ల మండలంలోని బెలుమ్‌, సింగవరం పల్లెల్లో ప్రధానంగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ వ్యాపారం జరిగిందంటున్నారు స్థానికులు. అవసరమైతే అధికారులను, ప్రత్యర్థులను బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయంటున్నారు. మైనింగ్ శాఖకు చెందిన కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు జీతం కంటే మామూల్లే అధికంగా వస్తుడటంతో ఇక్కడి నుండి బదిలీ కావడానికి ఇష్టపడలేదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మొత్తానికి అధికారులు, రాజకీయ నేతలు, బడా బాబులతో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories