బాబాయి-అమ్మాయి మధ్యలో బాబు గొడవేంటి?

బాబాయి-అమ్మాయి మధ్యలో బాబు గొడవేంటి?
x
Highlights

విజయనగరం పూసపాటి రాజ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం, ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నలుగా మిగులుతోంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ రాజ...

విజయనగరం పూసపాటి రాజ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం, ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నలుగా మిగులుతోంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ రాజ కుటుంబం రగడ, ఎవరికీ బోధపడ్డం లేదు. రాజుగారి కోట సెకండ్ ఎపిసోడ్‌లో, ఇప్పుడు చంద్రబాబు ఎంటర్ ‌కావడం, సమరాన్ని మరింత రసవత్తరంగా మార్చింది. బాబాయి-అమ్మాయి మధ్యలో చంద్రబాబు లడాయి ఏంటి?

విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్పాస్ ట్రస్టు, అలాగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్టు ఛైర్మన్ నియామకంలో జరిగిన, పరిణామాలు మరువకముందే, తాజాగా విజయనగరం పట్టణంలో చోటు చేసుకున్న మూడు లాంతర్ల స్థంభం కూల్చివేత మరో వివాదానికి దారితీసింది. అతి పురాతనమైన ఈ కట్టడాన్ని కూల్చివేయడంపైవిపక్షాలు, ప్రజా సంఘాలతో పాటు రాజవంశీయులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వ నేతల తీరుపై అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు అన్న ఆనందగజపతిరాజు కుమార్తె, ప్రస్తుత మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ సంచైత గజపతిరాజు కూడా అదే స్థాయిలో బాబాయ్ పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడంపై బాబాయ్ రాజకీయం చేస్తున్నారని, 1869లో కోటలో నిర్మించిన మోతీమహల్ ను పునరుద్దరించకుండా, మాన్సాస్ ఛైర్మన్ గా బాబాయ్ ఎందుకు కూల్చివేశారంటూ ఎదురు ప్రశ్నించడం ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చెయ్యడం, సంచైతపై కౌంటర్‌ ఇవ్వడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.

బాబాయ్-అమ్మాయి మధ్య జరుగుతున్న యుద్ధం మధ్యలో, చంద్రబాబు చేసిన ట్వీట్‌‌ గొడవను మరింత హీటెక్కించింది ఆయన ట్వీట్‌లో ఏముందంటే, మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ జగపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి''అని చంద్రబాబు అభ్యర్థించారు. దీనిపై సంచైత కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

సంచైత ట్వీట్‌ ఏంటంటే, చంద్రబాబు తన సహచరుడు అశోక్ గజపతి రాజును పొగిడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. అశోక్ గజపతిరాజు పదవీకాలంలో మాన్సాస్ ట్రస్ట్ ఆర్థికంగా నష్టపోయింది. ట్రస్ట్ భూములు పరుల పాలు అవుతుంటే కనీసం విశాఖలో లాయర్‌ని కూడా నియమించలేదు. ఆనందగజపతిరాజు పెద్దబిడ్డగా, వారసురాలిగా ట్రస్ట్ బాధ్యతలు చేపట్టాను. ఆ సంగతి చంద్రబాబు గారు గారు తెలుసుకోవాలి మాన్సాస్‌-లా కాలేజ్ క్యాంపస్ స్థలాన్ని ఐ.ఎల్.ఎఫ్,ఎస్ కు ధారాదత్తం చేసి కుంభకోణాల్లో ఇరుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇదీ సంచైత ట్వీట్.

ఇలా మాన్సాస్ ట్రస్ట్‌పై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా, చెలరేగిపోతున్నారు ట్రస్ట్ చైర్మన్ సంచైత. ఒకవైపు మీడియా వేదికగా బాబాయ్‌ ప్రశ్నలు సంధిస్తుంటే, తాజాగా చంద్రబాబు కూడా ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేయడంతో, ధాటిగానే కౌంటర్ ఇచ్చారు సంచైత. పూసపాటి వంశీయుల వారసత్వ సంపద కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉండదని, అది తరతరాల నుంచి వస్తోందని, తాము కేవలం ఆ వారసత్వ సంపదకు సంరక్షులము మాత్రమేనంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మాన్సాస్ ట్రస్ట్ నేపథ్యంలో, బాబాయి-అమ్మాయి మధ్య రోజురోజుకు తీవ్రమవుతున్న వివాదాల నేపథ్యంలో, రాజుగారి కుటుంబంలో అసలు ఏం జరుగుతోంది? వారసత్వ పోరాటమా...లేక రాజకీయమా అంటూ ప్రజల్లో సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై అశోక్ గజపతిరాజు కుటుంబం హైకోర్టును ఆశ్రయించడం, ఇప్పటి వరకు కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories