Punganur Cattle: పొట్టి ఆవుల నిలయం.. ప్రపంచంలోనే ప్రత్యేకం

Krishna Raju is rearing 150 Small cows in the Kakinada district
x

పొట్టి ఆవుల నిలయం.. ప్రపంచంలోనే ప్రత్యేకం

Highlights

* ఓ గోశాలలో వీటిని పెంచుతున్న నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు

Punganur Cattle: పుంగనూరు ఆవులు సాధారణ గోవులకంటే భిన్నమైన పూర్తి దేశీయ రకం బహు అరుదైన ఈ రకం ఆవులు ఒకటి రెండు ఉంటే ఎంతో గొప్ప కాకినాడ జిల్లాలో ఓ నాడీపతి వైద్యుడు ఏకంగా 150 వరకు పొట్టి గోవుల్ని పెంచుతూ ఔరా అనిపిస్తున్నారు. ఈయన వద్ద ఉన్న వివిధ దేశీయ పొట్టి జాతి ఆవులు ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడం విశేషం ఈయనే 'ఆవు ఆత్మీయ ఆలింగనం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పొట్టి జాతి ఆవులను పెంచుతూ ప్రత్యేకతను చాటుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ సమీపంలో ఓ గోశాలలో వీటిని పెంచుతున్నారు. 8 అంగుళాల నుంచి 36 అంగుళాల ఎత్తు వరకు పుంగనూరు జాతి గోవులు ఉన్నాయి. సాధారణంగా ఉండే పెద్ద ఆవుని పోషించే బదులు పుంగనూరు గోవుల్ని పదింటిని పెంచొచ్చు. ఇవి తినే గడ్డి, దాణా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ వీటి ధర మాత్రం 3 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. మన దేశంలో ఒంగోలు జాతి సహా వివిధ పశువుల్ని విదేశీయులు కూడా అభివృద్ధి చేసుకున్నారు. కానీ ఈ మినేచర్ పుంగనూరు జాతులు మాత్రం వారి వద్ద లేవనే చెప్పాలి.

వ్యవసాయ రైతు కుటుంబానికి చెందిన కృష్ణంరాజు 15 ఏళ్ల క్రితం ఓ పుంగనూరు ఆవును కొన్నారు. దానికి గుంటూరు లాం ఫామ్‌లో కృత్రిమ గర్భధారణ చేయించారు. 6 అంగుళాల పొట్టి కోడె దూడ పుట్టింది. అది అప్పట్లో ప్రపంచ రికార్డు. ఆ తరవాత పశ్చిమ బెంగాల్ నుంచి పొట్టి జాతి ఎద్దును తీసుకొచ్చారు. ఈ జంటకు కూడా పుట్టిన మరుగుజ్జు దూడలకు ప్రపంచ రికార్డు వచ్చింది. ఆపై పుంగనూరు పశువుల్ని కొనుగోలు చేయటంతోపాటు గర్భధారణ చేయించి వాటిని వృద్ధి చేశారు. ఇప్పటివరకు వాటిని కాకినాడ జిల్లా కేంద్రంలో సంరక్షించేవారు. అయితే 2 సంవత్సరాల క్రితం లింగంపర్తి సమీపంలోని కొండల మధ్య ఐదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గోశాలకు వీటిని తరలించారు. దీనికి "నాడీపతి గోశాల" అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ 250 అతి చిన్న పుంగనూరు 260 సాధారణ పుంగనూరు గోవులు ఉన్నాయి.

భారతీయ ప్రాచీన వైద్యవిధానమైన "ఆవుతో ఆలింగనం" ప్రక్రియను ఐదేళ్ల క్రితం ప్రారంభించారు కృష్ణంరాజు. గతంలో ఈయన చేపట్టిన ఆవు ఆత్మీయ ఆలింగనం కార్యక్రమంలో చాలామంది గో ప్రేమికులు పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమం నమోదయింది. ఆవును కనీసం 10 నిమిషాలు ఆలింగనం చేసుకుంటే మెదడులోని గ్రంధులు, హార్మోన్లు ఉత్తేజితమవుతాయని దీనివల్ల మానసికఒత్తిడి, ఆందోళన తొలిగిపోయి మనసుకు ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు కృష్ణంరాజు దేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ మినేచర్ ఆవుల జాతి ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ వ్యాపార దృక్పథం వైపు అడుగులు వేసేలా చేస్తోంది.

పుంగనూరు ఆవులు మామూలు ఆవుదూడల సైజులో ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. సుమారు 200 కిలోల బరువు ఉంటాయి. ఈ రకం జాతి ఆవులు ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా తోక మాత్రం నేలను తాకుతూ చూపరులని ఇట్టే ఆకర్షిస్తోంది.

ఈ రకం జాతి ఆవుల పెంపకం చాలా సులువైందిగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ రకం జాతి ఆవులు అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఈ పశుజాతి ఆవులు ఇప్పుడు వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాల దిగుబడి తక్కువగా ఉండటం విదేశీ ఆవుల పాల దిగుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ జాతి ఆవులకు బదులు ఎక్కువగా పాలిచ్చే ఆవు జాతులను పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories