Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణానికి ముందు.. ఆ 90 నిమిషాలలో ఏం జరిగింది?

Know What Happened 90 Minutes Before Mekapati Goutham Reddy Death
x

Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణానికి ముందు.. ఆ 90 నిమిషాలలో ఏం జరిగింది?

Highlights

Mekapati Goutham Reddy: ఏపీ కేబినెట్‌లోనే యంగెస్ట్ మినిస్టర్.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన ఫిజిక్.. అన్నింటికీ మించి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా కనిపించే రూపం.

Mekapati Goutham Reddy: ఏపీ కేబినెట్‌లోనే యంగెస్ట్ మినిస్టర్.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన ఫిజిక్.. అన్నింటికీ మించి ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా కనిపించే రూపం. మేకపాటి గౌతం రెడ్డిని చూస్తే అనారోగ్యం ఆలోచనే ఎవ్వరికీ రాదు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలడం ఆ తర్వాత నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచి వెళ్లిపోవడం రాజకీయ వర్గాలతో పాటు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అసలు మేకపాటి హఠాన్మరణానికి కారణాలేంటి.? పోస్ట్‌కోవిడ్ వెంటాడిందా..? ఆ 90 నిమిషాల్లో అసలేం జరిగింది..?

ఏపీ కేబినెట్‌లో ఎందరు మంత్రులున్నా మేకపాటి గౌతం రెడ్డి ప్రత్యేకతే వేరు. వివాదాలుండవు విభేదాల మాటే వినిపించదు. తనపని తాను చేసుకుపోతూనే విమర్శలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటారు. అలాంటి మంత్రి మరణవార్త తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురిచేసింది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న గౌతంరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారని తెలియగానే ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, మేకపాటి గౌతం రెడ్డి లాంటి ఫిట్‌నెస్ ఫ్రీక్‌కు గుండెపోటా..? ఇప్పుడిదే ప్రశ్న అంతుచిక్కని మిస్టరీగా మారింది.

1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతంరెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజమోహన్ రెడ్డి ముగ్గురు కుమారుల్లో గౌతమ్ ఒక్కరే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అన్నింటికీ మించి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన గౌతమ్ మంచి వాగ్ధాటి కలిగిన నేతగా అనతికాలంలోనే గుర్తింపు పొందారు. తండ్రి అడుగు జాడల్లో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టినా కేవలం పనితీరుతోనే మంత్రి పదవి సాధించారు. ప్రజల్లోనూ జననేతగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం రెడ్డి మొన్నటి సీమ వరదల సమయంలోనూ నేరుగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ తమకు అండగా నిలిచిన నేత ఇకలేరన్న వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

గత వారం రోజులుగా మంత్రి మేకపాటి దుబాయ్‌ ఎక్స్‌ పోలో పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరపటంతో పాటు పలు సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అక్కడి సదస్సులో అత్యద్భుతంగా ప్రసంగించారు కూడా.

దుబాయ్ నుంచి వచ్చీ రాగానే ఓ నిశ్చితార్ధం కార్యక్రమానికి హాజరై అనంతరం హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు కాఫీ తాగే అలవాటున్న మంత్రి అలసటో, ప్రయాణ బడలికో లేక శరీరంలోపల అనారోగ్యమో నిర్ణీత సమయానికి నిద్రలేవలేదు. ఏడుగంటలకు లేచిన ఆయన 7.15కు వంటమనిషి కాఫీ ఇస్తే వద్దన్నారట ఆ తర్వాత కాసేపటికే 7.25 నిమిషాలకు చమటలు పడుతున్నాయని గుండెపట్టుకోవడంతో వెంటనే గౌతమ్ భార్య కీర్తికి సమాచారం ఇచ్చారు. 7.30 నిమిషాలకు గౌతమ్ సృహతప్పినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. 7.45కు అపోలో ఆస్పత్రికి తరలించగా ఉదయం 9 గంటలకు వైద్యులు గౌతంరెడ్డి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేవలం 90 నిమషాల వ్యవధిలోనే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.

అసలా 90 నిమిషాలలో ఏం జరిగింది?

7గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 55 నిమిషాల వరకూ గౌతమ్‌ రెడ్డిని కాపాడేందుకు అపోలో వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ 90 నిమిషాల్లో గౌతంను సేవ్ చేసేందుకు వైద్యులు CPR నిర్వహించారు. ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9 గంటల సమయంలో మంత్రి మరణించినట్టు ధృవీకరించారు. స్పందించని స్థితిలో గౌతమ్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని ఆస్పత్రికి వచ్చే సమయానికే శ్వాస ఆడట్లేదని తెలిపారు. ఎమర్జెన్సీ వార్డ్‌లో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని వైద్యులు ప్రకటించారు.

గౌతం రెడ్డి హెల్త్ కండిషన్ గురించి వ్యక్తి గతంగా తెలిసిన డాక్టర్లు సైతం షాకవుతున్నారు. మంత్రి మరణం వెనుక పోస్ట్‌కోవిడ్ ఎఫెక్ట్ ఉండొచ్చా? ఇప్పుడు అందరినీ వేధిసున్న ప్రశ్న ఇదే.. గౌతం రెడ్డి రెండు సార్లు కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపధ్యంలోనే గౌతం మరణానికి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉండొచ్చన్న అనుమానాలూ కలుగుతున్నాయి. పోస్ట్‌కోవిడ్ తర్వాత హార్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్టులు సర్వ సాధారణంగా మారాయి. రక్తం గడ్డ కట్టడం వల్ల శరీరంలో క్లాట్స్ ఏర్పడి ప్రాణాలు పోతున్నాయన్నది పరిశోధకులు, వైద్యులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.., మరికొందరిలో గుండె కవాటాలు, కండరాల సంకోచ వ్యాకోచాలను కోవిడ్ 19 దారుణంగా దెబ్బ తీస్తుందనీ, కోవిడ్ నుంచి కోలుకున్నా దాని ప్రభావం వల్ల తర్వాత కాలంలో ఏదో ఒక సమస్యతో కన్నుమూస్తున్నారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ మరణానికి పోస్ట్ కోవిడ్ ప్రభావమే కారణమా? లేక స్ట్రెస్సా? కారణమేదైతేనేం ఓ ఫిట్నెస్ ఫ్రీక్ ఇలా అర్ధాంతరంగా కన్నుమూశారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి మరణాలు వైద్యులకే అంతుచిక్కని మిస్టరీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యాయామాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయని వారు ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడం విశ్మయానికి గురి చేస్తోంది. ఈ జాబితాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ సైతం ఉన్నారు. పునీత్ ఇటీవలే కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. పునీత్ వర్క్‌ఔట్స్ చేస్తూనే కుప్పకూలడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అతిగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయడం కూడా ప్రమాదమే అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా గౌతం రెడ్డి సైతం ఇలానే మరణించడం వైద్య వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

సడెన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌లు ఇటీవలి కాలంలో పెరిగిపోవడం అన్నింటికీ మించి యంగ్‌స్టర్స్ వీటి బారిన పడుతుండడంతో గుండెపై పోస్ట్‌కోవిడ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై పలు కీలక అధ్యయనాలు సైతం జరిగాయి. ఈ అధ్యయనాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ప్రధానంగా కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై దాడి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ దాడి ప్రభావం గుండె పనితీరుపై తీవ్రంగా పడుతుందని గుర్తించారు. మేకపాటి గౌతం రెడ్డి విషయంలోనూ ఇలా జరిగే ఛాన్స్‌ లేకపోలేదని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తంగా మేకపాటి గౌతంరెడ్డి మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఏపీ ప్రజలకు ఇది అశనిపాతం విభజిత ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఇప్పుడు అత్యవసరం.. తన పలుకుబడితోనూ, హుందా తనంతోనూ, తెలివి తేటల్లోనూ మంత్రివర్గంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన గౌతం రెడ్డి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తారన్న అంచనాలున్నాయి. తన సదస్సు అనంతరం శుభవార్తను ఏపీ సీఎంకు అందించే ముందే ఆయన తుది శ్వాస విడవడం దురదృష్టకరం. పాలిటిక్స్‌లో తనదైన హుందా తనంతో ఆకట్టుకున్న గౌతమ్ రెడ్డి లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది.. ఒక యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్ను కోల్పోవడం ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories