రఘు రామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు

Key Development Takes in Custodial Torture of RRR
x

రఘు రామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామాలు

Highlights

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారనే కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారనే కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై తమ ఇష్టానికి పోస్టులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా రఘు రామకృష్ణ రాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్ పాల్ అరెస్టయ్యారు. 2021 మే నెలలో సీఐడీ రఘు రామను కస్టడీలోకి తీసుకున్నప్పుడు సీఐడీ అదనపు ఎస్పీగా విజయ్ పాల్ ఉన్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యకు యత్నించారని రఘురామ చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది జులైలో కేసు నమోదు చేశారు.

ఈ కేసులో 27 మందిని విచారించిన పోలీసులు మంగళవారం సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసి బుధవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. విజయ్ పాల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘు రామకృష్ణ రాజును వేధించిన వ్యవహారంలో కుట్ర దాడి ఉందని, కుట్రదారులు ఎవరో తెలియాలంటే పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు.

రఘు రామకృష్ణ రాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, నవ్వూతూ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చారని కోర్టుకు విన్నవించారు. రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని తెలిపారు. అంతే కాకుండా గుండెలపై కూర్చుని చావబాది చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు. రఘు రామను వేధించిన వీడియో అప్పటి ప్రభుత్వ పెద్దలకు పంపారని తెలిపారు. మిలిటరీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రఘు రామకృష్ణ రాజు శరీరంపై గాయాలు ఉన్నాయని ఈ కేసులో 27 మందిని విచారించిన తర్వాత విజయ్ పాల్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో విజయ్ పాల్‌తో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. విచారణకు హాజరైనప్పుడు విజయ్ పాల్ తీసుకువచ్చిన వాహనం, సెల్ ఫోన్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు రఘు రామను అరెస్ట్ చేసిన రోజు సీఐడీ కార్యాలయానికి సునీల్ కుమార్ వచ్చారన్న సెంట్రీ స్టేట్‌మెంట్, ఆయన సెల్ ఫోన్ లొకేషన్ రిపోర్ట్ కీలకంగా మారాయి.

2021లో అప్పటి ఏపీ సీఎం జగన్‌పై రఘు రామకృష్ణ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయనను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీసుకు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ.. ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆర్ విజయ్ పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న విజయ్ పాల్ రిక్వెస్ట్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 1న ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనకు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆర్డర్స్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసు శాఖను సూచించింది. సోమవారం సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విజయ్ పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే విజయ్ పాల్ అరెస్ట్ చోటుచేసుకుంది.

విజయ్ పాల్ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు స్పందించారు. విజయ్ పాల్ అరెస్టును స్వాగతించిన రఘు రామ.. కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా సీఐడీ మాజీ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఈ కేసులో అసలు కుట్రదారు సునీల్ కుమార్ అని చెప్పారు. భవిష్యత్తులో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories