Exit Polls: జగన్, బాబు... గెలిచేదెవ్వరు? ఏపీలో కోట్లల్లో బెట్టింగ్‌లు

Kai Raja Kai Betting Beyond The Cost Of Elections With Exit Polls
x

Exit Polls: జగన్, బాబు... గెలిచేదెవ్వరు? ఏపీలో కోట్లల్లో బెట్టింగ్‌లు

Highlights

పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్‌కు ముందే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పందేలు జోరందుకున్నాయి.

పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్‌కు ముందే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పందేలు జోరందుకున్నాయి. లక్షకు రెండు లక్షలు..కోటికి కోటిన్నర..రెండెకరాల మాగాణికి ఆరెకరాల మెట్ట .. బస్తీమే సవాల్ ..గెలుపు మాదే..పందెమేదైనా, ఎంతైనా తగ్గేదే లేదు.. ఇదీ, ఇపుడు ఏపీలో కోడై కూస్తున్న పందేల జోరు..గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కాళ్ళకు కత్తులు కట్టి కోడి పుంజులను బరిలోకి దింపే సందడి ఇపుడు రాష్ట్రమంతా నెలకొంది. మార్నింగ్ వాక్ గ్రౌండ్లు, టీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పార్టీ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు..ఒకటేమిటి..ఏ నలుగురు ఎక్కడ గుమికూడినా ఇదే సందడి. జూన్ 4న రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..గెలిచేదెవరు, ఓడేదెవ్వరు..అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారం దక్కించుకుని జగన్ రెండవసారి సీఎం అవుతాడా, కూటమి విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తాడా..! ఎవరి ధీమా వారిదే, ఎవరి లెక్కలు వారివే..! తమ ఆకాంక్షలు, అంచనాల మేరకు పందాలు కట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ నేతలు, వారి అనుచరులు పోటీ డుతున్నారు. అసలు ఏ పార్టీతో సంబంధం లేని వారు కూడా పందాలు ద్వారా ఒక్కరోజులో కోటీశ్వరులుగా మారేందుకు ముగ్గులోకి దిగుతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్ధి ఎన్నికల ఖర్చు సగటున రూ 50 కోట్లు అయినట్టు అంచనా. 2019 ఎన్నికల కంటే ఇది నూటికి నూరుశాతం ఎక్కువ. అంటే, రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్ధుల ఎన్నికల సగటు వ్యయం సుమారు రూ 100 కోట్లు. మరి, పందాల విలువెంతో తెలుసా..! రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను సుమారు 100 సెగ్మెంట్లలో పందాల విలువ ఎన్నికల వ్యయం కంటే దాదాపు రెట్టింపు .. అంటే రూ 200 కోట్లు ఉంటుందని అంచనా.

కూటమి పందేలకు పీకే జోష్

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్న పందాలు కాసే మొనగాళ్ళు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. కూటమి అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు ప్రకటించటమే కాకుండా పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంతకిషోర్ పదే పదే వైసీపీ ఓడిపోతుందని ప్రకటించటంతో పందాల జోరు ఎక్కువయింది. ప్రత్యేకించి అర్బన్ నియోజకవర్గాల్లో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి..ఆ పైన ఉన్నతశ్రేణి వర్గం ఓట్లు 100 శాతం కూటమికి పడ్డాయన్న నమ్మకంతో పందాలు కట్టేందుకు ఎగబడుతున్నారు. హైదరబాద్ తో పాటు ఇతర నగరాల నుంచి పోలో మంటూ వచ్చి ఓట్లు వేసిన వారు కూడా కూటమి పక్షానే ఉన్నారనీ, క్యూలైన్లు కనివినీ ఎరుగని రీతిలో బారులు తీరటానికి వారి రాకే కారణమని తెలుగుదేశం నాయకులు నమ్ముతున్నారు. పందాలు కాసే వాళ్ళలోనూ నమ్మకం కలిగించేలా విశ్లేషణలు చెబుతున్నారు.

లగడపాటి చేసిందదే.

ఆంధ్రా అక్టోపస్ గా పేరుపొంది ఆ తరువాత రాజకీయాలకు శాశ్వత విశ్రాంతి ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ప్రభావం 2019 ఎన్నికల్లో అంతా ఇంతా కాదు.. ఏపీలో వందలాది కోట్ల ఎన్నికల్లో పందాలకు లగడేపాటే కారణం. లగడపాటి అంతకు ముందు ఎన్నికల్లో చెప్పిన జోస్యాలు నిజం కావటంతో అతని మాట విని 2019 ఎన్నికల్లో జోరుగా పందాలు పెట్టిన వారంతా నిండా మునిగారు. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే ఫలితాలకు చంద్రబాబు కూడా మరింత బలాన్నివ్వటంతో అడ్డూ ఆపూ లేకుండా స్థలాలు, పొలాలను కూడా పందాల్లో పెట్టి తీవ్రమన నష్టాలను ఎదుర్కొన్నారు. డబ్బు పందాలు పెట్టిన వారు సర్వం కోల్పోయి ఆ తరువాత ఆస్తులను అమ్ముకున్నారు. ఇదంతా 2019 కథ .. ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిందని అప్పట్లో టీడీపీ తరపున పందాలు పెట్టిన వారంతా బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తధ్యమనీ, మంత్రులుగా ఎవరెవరు ఉంటారో కూడా లెక్కలు చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి తరపున ఎంతటి పందేలకన్నా తెగబడుతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఒక అడుగు వెనకే ఉందన్న చెప్పాలి. 151 సీట్ల కన్నా ఎక్కువ గెలుచుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత కూడా పందేల విషయంలో టీడీపీ సై అంటుంటే వైసీపీ సైసై అనకలేకపోతోంది. దీంతో టీడీపీ తరపున పందెం రాయుళ్ళు ఒక అడుగు ముందుకు వేసి లక్షకు రెండు లక్షలు, కోటికి కోటిన్నర కూడా ఆఫర్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే టీడీపీ పందెం రాయుళ్లను ముగ్గులోకి దించి అధిక మొత్తాలను రాబట్టేందుకు వైసీపీ పథకం రచించిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

ఏందయ్యా ఇది..ఇవెక్కడి పందేలురా బాబూ..!

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి బెంగుళూరులో వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డాడు. అతనిక్కడికి వచ్చి ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ గెలుస్తాడని రూ 6 కోట్ల పందెం కాశాడు. ప్రకాశం జిల్లాలో అధికారపార్టీకి చెందిన ముఖ్య నాయకుడు సుమారు రూ 50 కోట్ల పందెం కాసినట్టు అంచనా. పందేలు పెట్టటంలో ఆయనకు అనుభవం కూడా ఉంది. కాకపోతే ఆయన కూటమికి గెలుస్తుందని కూడా పందెం కట్టాడని ఆయన ప్రత్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆయన వైసీపీ గెలుస్తుందనే పందెం కాసినట్టు సమాచారం. 96 నుంచి 105 సీట్లను వైసీపీ గెలవటం తధ్యమనీ, ఆ పైన ఎంతయినా రావచ్చని ఆ ముఖ్య నాయకుడు అంచనా. ఒంగోలుకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు, అతని అనుచరులు కూడా రూ 30 కోట్ల దాకా పందెలు కాశారు.

పందెం బరిలో ముఖ్య నేతలు

ఎన్నికల పందేల బరిలో ప్రముఖులు రంగంలోకి దిగారు..ఇంకా దిగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు..ఇంకా అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.టీడీపీ అధికారంలోకి వస్తుందనీ, చంద్రబాబు సీఎం కాబోతున్నాడన బలంగా నమ్ముతున్న అనేకమంది కూడా పందెం బరిలో నిలుస్తున్నారు. బలాబలాలు సమంగా ఉన్న చోట్ల వందకు వంద పందె నడుస్తోంది. ఎక్కడైనా తమ బలం ఎక్కువగా ఉందని బలంగా నమ్ముతున్న చోట మాత్రం ఒకటికి ఒకటిన్నర, ఒకటికి రెండు పందెం నడుస్తోంది. అంటే కోటికి కోటిన్నర, కోటికి రెండు కోట్ల పందెం కూడా ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. ప్రకాశంతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పందాలు జోరుగా నడుస్తున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు భారీ పందెం కాసినట్టు సమాచారం. కోవూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ పై కూడా రూ 100 కోట్లకు చేరువైనట్టు అంచనా. రాయలసీమలో ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పందెలు జోరుగా నడుస్తున్నాయి. విశాఖతో సహా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పందాల జోరు కాస్త తక్కువగానే కనబడుతున్నా ఆ పక్కనే ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందెలు కాలుదువ్వుతున్నాయి. నాలుగు జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో పందెం కనిష్టంగా రూ 100 కోట్లు, గరిష్గంగా రూ 200 కోట్లకు పైబడినట్టు అంచనా. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలపై పందాలు భారీగా నడుస్తున్నాయి. ఇక్కడ కోటి రూపాయలు దాకా పందెం పెట్టినోళ్లు 100 మంది పైగానే ఉంటారని అంచనా. అంబటి రాంబాబు పోటీ చేసిన సత్తెనపల్లితో పాటు గురజాల, మాచర్ల, వినుకొండపై పందాలు బాగా నడుస్తున్నాయి. కనిష్టంగా ఒక రూ లక్ష నుంచి పందెం నడుస్తోంది.. రాజకీయపార్టీల్లో తిరిగే అత్యంత సామాన్య కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు రూ 5 నుంచి రూ 10 వేలు కలిపి లక్ష రూపాయలు దాకా వసూలు చేసి వాటిని పందెల్లో కాస్తున్నారు.

జగన్ ట్వీట్ తో పెరిగిన వైసీపీ పందేలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తూనే చేసిన ట్వీట్ వైసీపీ పందెం రాయుళ్లలో ఉషారు పెంచింది. అప్పటిదాకా టీడీపీ రెచ్చగొడుతున్నా ఆచితూచి పందేలు కాస్తున్న వైసీపీ నేతలు ‘ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్టు’ బలంగా నమ్ముతూ చేసిన ట్వీట్ వైసీపీలో జోష్ ఫెంచింది. దీంతో పందెలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల లక్షకు లక్షన్నర, కొన్ని చోట్ల లక్షకు రెండు లక్షల దాకా పందెం నడుస్తోంది. పందేలు కాసేవాళ్ళు ముందుగానే తమ డబ్బును మధ్యవర్తి దగ్గర డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద మొత్తాలు నడుస్తున్న చోట రాతపూర్వక ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఫలితాల ఆధారంగా ఎవరి గెలిస్తే వారికి మధ్యవర్తే డబ్బు ముట్టచెబుతాడు..దీని కోసం 1 నుంచి 3 శాతం కమిషన్ ను మధ్యవర్తి తీసుకునేలా ఒప్పందం కుదురుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories