Tirumala: తిరుమలలో ఘనంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం..మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు

Jyestabhishekam Commences in Tirumala Srivari Temple
x

Tirumala: తిరుమలలో ఘనంగా ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం..మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు

Highlights

Tirumala: జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మలయప్పస్వామి కవచాలు తొలగింపు

Tirumala: తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశిష్టమైన ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రాచీనమైన ఉత్సవ విగ్రహాల పరిరక్షణే ఈ వేడుకల వెనుక ఉన్న ప్రధాన పరమార్థం. జ్యేష్ఠాభిషేకం అభిధ్యేయక అభిషేకంగా పిలుస్తారు.కాగా ఇప్పటికే తిరుమలలో వైభవంగా జేష్టాభిషేకం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కవచాలు తొలగిస్తారు.

సంవత్సరం పొడవునా కవచాలతో దర్శనం ఇచ్చే స్వామివారు జ్యేష్ఠా అభిషేకాలు నిర్వహించే రోజులు మాత్రమే సహజసిద్ధంగా దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా వజ్ర, ముత్యాలు, బంగారు ఆభరణాలతో మూడురోజులపాటు దర్శనం ఇస్తారు. టీటీడీ 1980 దశకంలో జ్యేష్ఠా అభిషేకాలను ప్రారంభించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. శ్రీదేవి, భూదేవి, మ‌ల‌య‌ప్ప స్వామివారి ఉత్సవ‌మూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు నిర్వహించే ఉత్సవ‌మే జ్యేష్ఠాభిషేకం.

ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గ‌ల‌ కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని 'అభిధేయ‌క అభిషేకం' అని కూడా అంటారు. మొదటిరోజు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండోరోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్ప స్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు.

సంవత్సరంలో జేష్టాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్4 వ తేదీ క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories