జూ.ఎన్టీఆర్‌ హర్ట్‌ అయ్యాడా.. బాబుకు ఝలక్ ఇవ్వబోతున్నాడా?

Jr NTR Want to put New Political Party
x

జూ.ఎన్టీఆర్‌ హర్ట్‌ అయ్యాడా.. బాబుకు ఝలక్ ఇవ్వబోతున్నాడా?

Highlights

Jr NTR: మేనత్తకు అండగా నిలబడ్డాడు. అయినా తెలుగు తమ్ముళ్లు తెగ తిట్టేస్తున్నారు.

Jr NTR: మేనత్తకు అండగా నిలబడ్డాడు. అయినా తెలుగు తమ్ముళ్లు తెగ తిట్టేస్తున్నారు. అసెంబ్లీ ఘటనపై గొంతెత్తాడు అయినా టీడీపీ నేతలు తారక్‌ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు సైతం కనీసం వారిని వారించడం లేదు. వారి మాటలను ఖండించడం లేదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్‌‌ను హర్ట్ చేసిందా? తారక్‌ తీవ్రంగా నొచ్చుకున్నారా? చంద్రబాబుకు మరింత ఝలక్ ఇచ్చేలా కసి మీదున్నారా? మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చెయ్యబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మొన్న చంద్రబాబు టార్గెట్‌గా సాగిన ఘటన, అనేక పరిణామాల వైపు మళ్లుతోంది. సానుభూతి అస్త్రంగా మలచుకోవాలని చంద్రబాబుతో పాటు ఇతర నేతలు వాడివేడిగా డైలాగ్‌లు పేలుస్తున్నారు. కొందరైతే దీక్షలు సైతం చేశారు. అయితే, అటు ఇటు తిరిగి జూనియర్‌ ఎన్టీఆర్‌‌పై విమర్శలు లంఖించుకున్నారు టీడీపీ నేతలు. తన మేనత్తపై అవమానకరంగా మాట్లాడితే, ఇలాగేనా స్పందించేది అంటూ కారాలు మిరియాలు నూరారు టీడీపీ నేతలు.

నందమూరి కుటుంబ సభ్యుడిలా కాకుండా, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానంటూ బిల్డప్‌ ఏంటని, తారక్‌పై సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్‌పై రెచ్చిపోయారు. అసలు నందమూరి వంశం పౌరుషం ఇదేనా అంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఇలా తనపై టీడీపీ నేతలే చెలరేగిపోవడం, తారక్‌ను హర్ట్ చేసిందట. సంచలన నిర్ణయం తీసుకోవాలన్న కసిని మరింత పెంచిందట.

టీడీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో టీడీపీ ఫాలోవర్స్‌, తనను ఈ స్థాయిలో ట్రోల్ చేస్తారని ఊహించలేదని తన సన్నిహితులతో అన్నారట ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ తరపున తాను, తన తండ్రి అంతగా పోరాడినా, పార్టీ బలోపేతానికి కృషి చేసినా, కనీసం ఎవ్వరూ గుర్తించకపోవడం పట్ల చాలా ఫీలయ్యారట ఎన్టీఆర్. అన్నింటికంటే ఎక్కువగా బాధ పెట్టింది చంద్రబాబు స్పందనారాహిత్యమని తన సన్నిహితులతో అన్నారట తారక్.

టీడీపీ సీనియర్‌ నేతలందరూ తనను టార్గెట్ చేస్తున్నా, చంద్రబాబు కనీసం వారిని వారించకపోవడం, మరింత బాధించిందని వాపోయారట. చంద్రబాబు వారి మాటలను ఖండించకపోవడం, ఆపలేకపోవడం అంటే, వారి కామెంట్లతో ఏకీభవించినట్టే కదా అని రుసరుసలాడిపోయారట ఎన్టీఆర్. అంతా ఒక వ్యూహం ప్రకారం, తనను టీడీపీకి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారన్నది ఎన్టీఆర్ బాధ. అదే జరిగితే తాను సైతం అందరికి దిమ్మతిరిగే స్ట్రాటజీకి పదునుపెట్టాల్సి వస్తుందని అన్నారట ఎన్టీఆర్.

మొదటి నుంచీ ఒక ప్రణాళిక ప్రకారం, హరికృష్ణ ఫ్యామిలీని చాలా చాకచక్యంగా దూరం పెడుతూ వచ్చారు చంద్రబాబు. ఒకవైపు బాలకృష్ణతో వియ్యంతో బంధం పటిష్టం చేసుకుని, మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్ వంటి ఛరిష్మాటిక్‌ పర్సన్ వున్న హరికృష్ణ కుటుంబానికి చెక్‌ పెడుతూ వచ్చారు. భవిష్యత్తులో లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ తప్పకుండా పోటీ అవుతాడని, పోటీ వుంటే, తారక్‌ ముందు లోకేష్‌ తేలిపోతాడని లెక్కలేసిన చంద్రబాబు, మహానాడు సహా అనేక పార్టీ కార్యక్రమాల్లో హరికృష్ణ, తారక్‌ల ప్రాతినిధ్యం, ప్రాధాన్యం తగ్గించారు. వారి పట్ల వ్యతిరేక ప్రచారం కూడా చేయించారన్న మాటలు అప్పట్లో వినిపించాయి. ఇదంతా గ్రహించిన హరికృష్ణ, చంద్రబాబుపై రగిలిపోయారట. హరికృష్ణ చనిపోయిన తర్వాత, ఎన్టీఆర్ సైతం టీడీపీతో మరింత డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు.

కూకట్‌పల్లిలో తన అక్క సుహాసినిని బాబు పోటీకి దింపినా, ప్రచారానికి వెళ్లకుండా, తన స్టాండ్‌ ఏంటో క్లియర్‌ కట్‌గా చెప్పారు తారక్. ఇప్పటి వరకూ టీడీపీతో డైరెక్టుగా ఎలాంటి అనుబంధం లేకుండా అదే దూరాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి సందర్బంలోనూ, అత్త భువనేశ్వరి విషయంలో తాను స్ట్రాంగ్‌గా ఖండించినప్పటకీ, అయినా తనను టార్గెట్ చెయ్యాలనుకోవడం పట్ల తారక్ రగిలిపోతున్నారట.

టీడీపీ కార్యకర్తలకు, నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్‌ అభిమానులకు, సామాజివర్గం మద్దతుకూ, తనను దూరం చేసేందుకు, పకడ్బందీగా చంద్రబాబు స్కెచ్ వేశారని భావిస్తున్నారట తారక్. పెద్ద ఎన్టీఆర్‌కు కూతురు, మాజీ సీఎం భార్య, తన తండ్రి చెల్లెలు, వరుసకు మేనత్తయిన భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించినా, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంత పేలవంగా స్పందించడమేంటన్న ప్రచారాన్ని, టీడీపీ చెయ్యడం, తారక్‌ను బాధపెట్టిందట. జగన్‌ ప్రభుత్వం పట్ల ఎన్టీఆర్‌కు సానుభూతి వుందని, అందుకే జగన్‌పై నోరెత్తడంలేదని, కొందరు తమ్ముళ్లు మాట్లాడటం సహించలేకపోతున్నారట తారక్. లోకేష్‌ కోసమే తనను తొక్కేసే ప్రయత్నమని స్ట్రాంగ్‌గా డిసైడయ్యారట. అందుకే చంద్రబాబుకే ఝలక్ ఇచ్చేలా గట్టి నిర్ణయానికి వచ్చారట తారక్.

కొత్త పార్టీ. ఔను. కొత్త రాజకీయ పార్టీ. జూనియర్ ఎన్టీఆర్‌ కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు కొందరు ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు ఎలాగూ నందమూరి వారసులకు టీడీపీ బాధ్యతలు అప్పగించడని స్ట్రాంగ్‌గా డిసైడైన జూనియర్‌, మనమే అన్నగారి పేరు మీద పార్టీ పెడదామని తన క్లోజ్ సర్కిల్‌ నేతలతో అన్నారట. లోకేష్‌ నాయకత్వంలో ఎలాగూ తెలుగుదేశం నిర్వీర్యం అవుతుందని, పార్టీ సంక్షోభం తప్పదని భావిస్తున్న ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌లు వున్న పార్టీని తీసుకోవడం కన్నా, తానే పెద్ద ఎన్టీఆర్ ఆశయాలతో కొత్త పొలిటికల్ పార్టీ పెడితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారట. నందమూరి వారసులందర్నీ ఒకేతాటిపైకి తెచ్చి, తనకు మద్దతు పలికేలా చూసుకోవాలని అనుకుంటున్నారట. అవసరమైతే బీజేపీలో వున్న అత్త పురంధ్రీశ్వరిని సైతం, తాను స్థాపించే కొత్త పార్టీలోకి ఆహ్వానించాలని లెక్కలేస్తున్నారట. లోకేష్‌ లీడర్‌షిప్‌ తీసుకున్న తర్వాత, టీడీపీలో వున్న నాయకులందరూ తనవైపు వస్తారని సమీకరణలు ఆలోచిస్తున్నారట.

తాజా పరిణామాలతో ఆవేశంతో రగిలిపోతున్న జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడిప్పుడే కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదు. చంద్రబాబుకు వయస్సు పెరిగినా స్ట్రాంగ్‌గానే వున్నారు. 2024 ఎన్నికలు కూడా చంద్రబాబు సారథ్యంలోనే టీడీపీ ఫేస్ చేస్తుంది. అప్పుడు టీడీపీ గెలిస్తే, సైకిల్‌కు మళ్లీ జోష్ వస్తుంది. మధ్యలో లోకేష్‌కు సీఎం పీఠం ఇచ్చి బలశాలిగా మలిచే అవకాశం వుంది చంద్రబాబు. మరి 2024లో టీడీపీ ఓడిపోతే, అదే జరిగితే నాయకత్వ సంక్షోభం మొదలైనట్టే. 2024 నాటికి చంద్రబాబు వయస్సు 74. 2029 నాటికి 79 అవుతుంది. 80వ పడిలో పడతారు. అప్పుడు వయస్సు రిత్యా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. అనివార్యంగా లోకేష్‌కు బాధ్యతలు ఇవ్వకతప్పదు. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇవ్వాలని తపిస్తున్నారట జూనియర్‌ ఎన్టీఆర్.

చంద్రబాబు స్ట్రాంగ్‌గా వున్నప్పుడు కొత్త పార్టీ పెడితే లాభం లేదన్నది తారక్‌ ఆలోచన. ఎప్పుడైతే లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారో, అప్పుడు తాను కొత్త టెం‌ట్‌ వేస్తేనే, జనంలోకి బలంగా వెళ్గొచ్చని భావిస్తున్నారట. కొత్త పార్టీతో టీడీపీ మొత్తాన్ని హైజాక్‌ చెయ్యొచ్చని, ఎన్నో దశాబ్దాల తర్వాత నందమూరి వారసుల నేతృత్వంలో పసుపు దళం ఏకమవుతోందన్న భావన రేకెత్తించొచ్చని ఆలోచిస్తున్నారట. అంటే, జూనియర్‌ కొత్త పార్టీ పెట్టడానికి దాదాపు ఏడెనిమిదేళ్లు పట్టవచ్చన్నది అంచనా. యంగ్‌ ఏజ్‌‌లోనే వున్న ఎన్టీఆర్‌, అప్పటి వరకు అదిరిపోయే సినిమాలు తీసి, జనంలో మరింత ఆదరణ పొందొచ్చంటున్నారు. తాత పోలికలు, అనర్గళ ప్రసంగాలు, సినిమా పాపులారిటీతో, జనంలోకి పార్టీని వేగంగా తీసుకెళ్గొచ్చని ఫీలవుతున్నారట.

మొత్తానికి అత్త భువనేశ్వరి వివాదంలో తన స్పందనపై టీడీపీ నేతలు మాటలు తూలడటంతో, ఇలా ఆగ్రహంతో వున్నారట ఎన్టీఆర్. దీనికితోడు చంద్రబాబు, లోకేష్‌లు సొంత పార్టీ నేతలను వారించకపోవడం, మరింత బాధించిందట. ఇలాంటి ఆవేశ క్షణాల్లోనూ చాలా ఓపికపడుతున్నారు తారక్. ఎందుకంటే, తనకంటూ తనదైన భవిష్యత్‌ ప్రణాళిక వుంది. తాత స్థాపించిన పసుపు దళాన్ని టేకోవర్ చెయ్యాలన్న లక్ష్యముందట. తన బాబాయ్‌లు, తండ్రి చెయ్యలేని సాహసాన్ని తాను చేసి చూపించాలని డిసైడయ్యారట. ఆ టైం వచ్చే వరకు ఓపిక పట్టాలని ఫిక్స్‌ అయ్యారట. చూడాలి, ఎన్టీఆర్ ఆలోచనలు నిజంగా రాజకీయ పార్టీ వైపు నడిపిస్తాయో? ఆ కాలం వరకు పరిణామాలు ఎలా మారతాయో? ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో...లెట్స్ వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories