విజయవాడ వేదికగా జయహో బీసీ మహాసభ

Jayaho BC Mahasabha Held At Vijayawada
x

విజయవాడ వేదికగా జయహో బీసీ మహాసభ

Highlights

* వెనుకబడిన తరగతులకు వరాలు ప్రకటించనున్న సీఎం జగన్

Vijayawada: విజయవాడ వేదికగా ఏపీ ప్రభుత్వ బీసీ కులాలతో మహా సభ నిర్వహిస్తోంది. ఇందిరా మునిసిపల్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈసభకు జయహో బీసీ పేరును ఖరారుచేశారు. మునిసిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఏపీలో అన్ని జిల్లాలనుంచి బీసీ కులాల ప్రతినిధులను, ప్రజాప్రతినిధులను ఈ సభకు ఆహ్వానించి జగన్ ముఖ్యమంత్రిగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు? రాజకీయం ఎలాంటి పదవులు ఇచ్చారు? గత ప్రభుత్వాలకు , జగన్ సర్కారుకున్న తేడా ఏంటనే అంశాలపై బేరీజువేసి వెనుక బడిన తరగతుల్లో అవగాహన కల్పించేందుకు సర్కారు పెద్దలు వెనుకబడిన తరగతులవారితో మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.

ఏపీలోని ప్రతి జిల్లాలో బీసీకులాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రభుత్వ పరంగా విస్తృతమైన ప్రయోజనాలు కల్పించామని ఈసభద్వారా వెల్లడించబోతున్నారు. గ్రామీణప్రాంతాల్లో పంచాయతీ వార్డుల వారీగా బీసీ ప్రతినిధులకు కల్పించిన రాజకీయ అవకాశాలు, ప్రభుత్వ పరంగా అందించే సంక్షేమ పథకాల వర్తింపుపై ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. అర్హతను, కుల సమీకరణ, జనాభా ప్రాతిపదికన విమర్శలకు తావులేకుండా అవసరమైన చోట పదవుల పంపకాలు, నామినేటెడ్ పదవులను పొందిన ప్రతినిధులచే అభిప్రాయాలను సభాముఖంగా వెల్లడించే విధంగా షెడ్యూలు రూపొందించారు. రాష్ట్రంలోని 139 వెనుక బడిన తరగతుల వారిని ఈ సభా వేదికపైకి తీసుకురాబోతున్నారు.

ఈరోజు విజయవాడ మునిసిపల్ స్టేడియం వేదికగా జరిగే జయహో బీసీ సభకు రాష్ట్రంలోని ప్రతి వార్డు సభ్యుడు, పంచాయతీ సర్పంచ్, వ్యవసాయ సహకార సంఘ ప్రతినిధులు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నామినేటెడ్ పదవులు పొందిన వెనుకబడిన తరగతులవారు ఈ సమావేశానికి రావాలని 82 వేల 432 మందికి ఆహ్వానాలు పంపామని సభా నిర్వాహక ప్రతినిధి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధసంఘాల ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి తెలిపారు. సభకు హాజరయ్యే ఆహ్వానితులకు ప్రత్యేక వంటకాలతో విందునుకూడా ఏర్పాటు చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర, గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన ఫేమస్ వంటకాలతో ఆతిథ్యమివ్వనున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ వెనుకబడిన తరగతులవారికి రాజకీయంగా ఎదుగుదలకు ఊతమిచ్చారని, మంత్రి వర్గంలో రెండు దఫాల్లో బీసీకులాల వారికి ప్రాధాన్యత కల్పించారనే విషయాన్ని సభలో ఆయా మంత్రులచేత మాట్లాడించి, వెనుకబడిన తరగతి కుటుంబాల్లో ప్రభుత్వంపట్ల విశ్వాసం పెంపొందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామ పంచాయతి, మున్సిపాలిటీలు, నగరపాలక పంచాయతీ ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించామని ఈసభ ద్వారా ఆయా ప్రతినిధులచేత రాజకీయ ఎదుగుదలపై అభిప్రాయాలను వెల్లడించే విధంగా బీసీ సమ్మే‎ళనం నిర్వహిస్తున్నారు.

ఏపీ జనాభాలో మెజారిటీగా ఉన్న వెనుకబడిన తరగతువారికి 50 శాతంమే రాజకీయ పదవులను ఇచ్చామని, సంక్షేమం కింద ప్రతి సంవత్సరం ఒక లక్షా 37వేల కోట్లను ఆర్థిక సాయంగా అందించామని జగన్ సర్కారు లెక్కలు చెబుతోంది. క్షేత్ర స్థాయిలో వెనుకబడిన కులాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే జయహో బీసీ సభను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా, రెవెన్యూ డివిజినల్, నియోజకవర్గ, మండలస్థాయిలోనూ బీసీ సమ్మేళనాలను నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రణాళికను రూపొందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories