అసదుద్దీన్ ఒవైసీ కామెంట్ల వెనక అంతచిక్కని వ్యూహముందా?

అసదుద్దీన్ ఒవైసీ కామెంట్ల వెనక అంతచిక్కని వ్యూహముందా?
x
అసదుద్దీన్ ఒవైసీ కామెంట్ల వెనక అంతచిక్కని వ్యూహముందా?
Highlights

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఊహించని వ్యాఖ్యలు చేసి, షాకిచ్చారు. వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీపై నిత్యం అభిమానం కురిపించే ఒవైసీ, ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కొన్ని...

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఊహించని వ్యాఖ్యలు చేసి, షాకిచ్చారు. వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీపై నిత్యం అభిమానం కురిపించే ఒవైసీ, ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా కొన్ని కామెంట్లు చేసి, కాక రేపారు. గుంటూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌పై, ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇంతకీ ఒవైసీ ఎందుకలాంటి కామెంట్లు చేశారు? ఈ మాటల వెనక మర్మం ఏదైనా దాగుందా?

గుంటూరులో సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా సింహగర్జన పేరుతో భారీ సభ జరిగింది. స్థానిక ముస్లిం సంఘాలు, దళిత సంఘాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఈ సభలో పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు, చర్చలు, నిరసనల్లో పాల్గొంటున్న ఒవైసీ, అందులో భాగంగా గుంటూరు సభలోనూ పాల్గొన్నారు. అయితే, ఈ సభలో సీఎం జగన్‌ మోహన్‌‌ను విమర్శిస్తూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ అంటే జగన్‌కు భయమని వ్యాఖ్యానించారు ఒవైసీ. అందుకే, వచ్చే నెల ప్రారంభం కాబోతున్న ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. అదే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వుంటే, సీఏఏ వంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేవారని, ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఒవైసీ వ్యాఖ్యల అంతరార్థమేంటి? మొన్నటి వరకు జగన్‌ను పొగిడిన ఒవైసీ స్వరమెందుకు మార్చారు? జగన్‌-ఒవైసీలకు చెడిందా? ఏపీలో ఖాతా తెరవాలన్న వ్యూహమే జగన్‌పై విమర్శలు చేయిస్తోందా? అసదుద్దీన్ ఒవైసీ కామెంట్ల వెనక అంతచిక్కని వ్యూహముందా?

అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలు, ఇప్పుడు ఇలాంటి చర్చలకే ఆస్కారం కల్పిస్తున్నాయి. ఎందుకంటే, మొదటి నుంచీ వైఎస్‌ ఫ్యామిలీతో ఒవైసీకి మంచి సంబంధాలే వున్నాయి. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని గుర్తు చేసుకుంటారు ఒవైసీ బ్రదర్స్. ఎన్నికల టైంలోనూ వైఎస్ జగన్‌ గెలవాలని ఆకాంక్షించారు ఒవైసీ. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కూడా 2019 ఎన్నికల్లో పిలుపునిచ్చారు. ఇలా ఎప్పుడూ వైఎస్ జగన్‌ పట్ల అభిమానంగా వుండే ఒవైసీ, సడెన్‌గా ఎందుకు స్వరం పెంచారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన ఎంఐఎం, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా ఖాతా తెరవాలనుకుంటోంది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా వుండే గుంటూరు, కర్నూలు, కడపలో ఇఫ్పటికే ఎంఐఎం కార్యాలయాలు వెలిశాయి. జెండాలు, కార్యకర్తల హడావుడి సైతం కనిపిస్తోంది. అయితే, ఏపీలో ముస్లింలు గంపగుత్తగా వైసీపీకి పట్టంకట్టారు. వైసీపీకి చెక్కుచెదరని ఓటు బ్యాంకుగా మారారు. ఏపీలో ఎదగాలనుకుంటే, వైసీపీ నుంచి ముస్లింలను వేరు చెయ్యాలన్నది ఒవైసీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను ఆయుధంగా ప్రయోగిస్తోంది. బీజేపీకి జగన్‌ దగ్గరవుతున్నారని, అనధికార భాగస్వామ్యం వుందన్నట్టుగా ఫోకస్ చెయ్యాలనుకుంటున్నట్టు, ఒవైసీ కామెంట్లను బట్టి అర్థమవుతోంది. గుంటూరు సభలో ఒవైసీ తాజా వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనపడ్తున్నాయన్న మాటలు చక్కర్లు కొడుతున్నాయి.

మామూలుగా అయితే, ఒవైసీ ఏపీకి రావడం చాలా అరుదు. ఒకవేళ వస్తే, మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలవొచ్చు. పౌరసత్వ చట్టాలకు వ్యతిరకేంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు కాబట్టి, సీఎం జగన్‌ను కలిసి, వినతీ పత్రం ఇవ్వొచ్చు. అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని కోరవచ్చు. కానీ గుంటూరుకు వస్తున్నట్టు సీఎం జగన్‌కు ఒవైసీ కనీసం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ కోరినా, సమాచారం ఇచ్చినా, క్యాంపు కార్యాలయానికి, అసద్‌ను జగన్‌ ఆహ్వానించేవారన్న చర్చ జరుగుతోంది. అయితే, జగన్‌ను కలవకూడదన్నది ఒవైసీ ఆలోచనగా తెలుస్తోంది. జగన్‌ పట్ల ముస్లింలలో వ్యతిరేక ముద్ర వేసి, ఏపీలో ఎంఐఎం బలోపేతానికి బాటలేసుకోవాలన్నది ఆయన వ్యూహంగా అర్థమవుతోంది. అందుకే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చెయ్యకపోతే, ముస్లింలంతా జగన్‌కు వ్యతిరేకం కావాలని పిలుపునిచ్చారు అసద్. మొత్తానికి అసదుద్దీన్‌ ఒవైసీ వ్యూహాత్మకంగానే, జగన్‌ను ఇరుకునపెట్టేందుకే ఇలాంటి కామెంట్లు చేశారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories