Sailajanath: శైలజానాథ్‌ పదవికి ఎసరు పెడుతున్నది ఎవరు?

Sake Sailajanath
x

శైలజనాథ్‌(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Highlights

Sailajanath: ప్రదేశ్ కాంగ్రెస్ కమటీలో అసమ్మతి పతాక స్థాయికి చేరిందా?

Sailajanath: ప్రదేశ్ కాంగ్రెస్ కమటీలో అసమ్మతి పతాక స్థాయికి చేరిందా? రెండేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ మంత్రి శైలజనాథ్‌పై ఓపెన్‌గా ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారా? సీనియర్ నేతల సహాయనిరాకరణతో అన్నీ తానై వ్యవహరిస్తున్న శైలజనాథ్‌కు పదవి ఇబ్బంగా మారిందా? అధినాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా రాష్ట్ర నేతలు సహకరించడం లేదా? కరోనా లాక్‌డౌన్‌తో పూర్తి స్థాయిలో సొంత క్యాడర్‌ను తయారు చేసుకోలేకపోవడం శైలజనాథ్‌కు సమస్యగా మారిందా? ఇటీవల పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ సమక్షంలో నేతలు విమర్శలకు ఎందుకు దిగారు?

రాష్ట్ర విభజనతో ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల వరకూ రథసారథిగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి కొనసాగారు. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోవడంతో పాటు ఏపీ పీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరా రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఎంపికలో పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజనాథ్‌ను ఏపీ పీసీసీ అధ్యక్షుడయ్యారు. అంతకుముందు కర్నాటకలో పార్టీ వ్యవహారాలను చూసిన శైలజనాథ్ గతంలో మాజీ మంత్రిగా సమైఖ్యాంధ్ర ఉద్యమనేతగా పనిచేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల నుంచి కొనసాగుతున్న శైలజానాథ్‌కు పార్టీలో ఉన్న కురు వృద్ధులు, సీనియర్లు సహకరించడం లేదట. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, మాజీ ఎంపీ హర్షవర్ధన్, రఘువీరావంటి వారు పార్టీలో ఉన్నప్పటికీ సైలెంట్‌గానే ఉంటున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అప్పుడప్పుడు కనిపిస్తున్నారే తప్ప రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి పార్టీలో ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి. అసలే అంతంత మాత్రంగా క్యాడర్. దీనికి తోడు సీనియర్లు సహకరించకపోవడం. అయినా తనదైన శైలిలో నెట్టుకొస్తున్న శైలజనాథ్‌పై ఇటీవల కొందరు నాయకులు ఓపెన్‌గానే విమర్శలకు దిగుతున్నారట. ఇదే పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోందట.

రాష్ట్రంలో వైసీపీ పాలనపై తాజాగా జరుగుతున్న పరిణామాలపై పూర్తీస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం లేదని అధ్యక్షుడు కనిపించడం లేదని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఇటీవల విజయవాడలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాంది ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సహా పలువురు అసమ్మతి వ్యక్తం చేశారు. చింతా మోహన్ నేరుగా అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో పార్టీని నడిపించడంలో శైలజానాథ్‌ విఫలమయ్యారని సీనియర్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కొందరునేతలు పాల్గొనడం లేదనీ ఫిర్యాదు చేశారన్నది టాక్‌.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఏపీ పీసీసీ పదవి మార్పుపైనా చర్చ జరుగుతోంది. పలువురు సీనియర్లు పదవి కోసం అధిష్ఠానం వద్ద పైరవీలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శైలజనాథ్‌ రాష్ట్రంలో పార్టీ కమిటీలు ఎంపిక చేయడంలోనూ తమ వారికి పెద్దపీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలో ఓ వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ రఘువీరాలాంటివారు మద్దతు ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పీసీసీ పదవీ కాలం మూడేళ్లు వరకూ ఉంటూంది. శైలజనాథ్‌కు మరో ఏడాది పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పలువురు నేతలు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న సమచారం ఆయన వర్గంలో ఆందోళన కలిగిస్తోంది.

మరో ఏడాది గడిస్తే సార్వత్రిక ఎన్నికల ముందు పీసీసీని మార్చే సాహసం అధిష్టానం చేయదని ఎన్నికల వరకూ ఆయనే పీసీసీగా ఉంటారని, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏడాది కంటే ముందే శైలజనాథ్ పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ల సహాయ సహకారాలు లేకపోవడం పార్టీలో విమర్శలు ఎక్కువ కావడంతో ఆయన మనస్తాపం చెందారన్న ప్రచారమూ జరుగుతోంది. ఆయన అనుచరులు అనుకుంటున్న, బయటకు చెప్పుకుంటున్న మాట కూడా ఇదే. అందుకే శైలజానాథే తనకీ పదవి అక్కర్లేదన్న భావనతో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయాలని వచ్చే ఎన్నికల్లో రాహుల్‌‌గాంధీని ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతో హస్తం శ్రేణులు కదం తొక్కుతుంటే ఏపీలో మాత్రం పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైందని హార్డ్‌కోర్‌ క్యాడర్‌ అంటోంది. మరి భవిష్యత్తులో పార్టీలో ఎలాంటి సంస్కరణలు తెస్తారో, ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories