నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్ అనే రాజు ఎక్కడో లెక్క తప్పారా.. వైసీపీ విసరబోతున్న అస్త్రాన్ని రఘురాముడు తట్టుకోగలరా?
ఆయన ఏం పని చేసినా లాజిక్ అడుగుతారు. మ్యాజిక్ చేస్తే మ్యూజిక్ వాయిస్తానంటారు. పార్టీ మారినా, అధినేతను తిట్టినా, అంతా లాజిక్ మహిమా అనేస్తారు....
ఆయన ఏం పని చేసినా లాజిక్ అడుగుతారు. మ్యాజిక్ చేస్తే మ్యూజిక్ వాయిస్తానంటారు. పార్టీ మారినా, అధినేతను తిట్టినా, అంతా లాజిక్ మహిమా అనేస్తారు. షోకాజ్‌కే షోకాజ్‌లా రిప్లై ఇచ్చినా, అందులో వుంది లాజిక్‌కాక మరేమిటీ అని ఎదురుప్రశ్నిస్తారు. ఈ లాజిక్ రాజు ఎవరో, పెద్దగా తడుముకోవాల్సిన పనిలేదు. రఘురామ కృష్ణంరాజు. మరి ఏ లాజిక్‌తో ఆయన పొలిటికల్ జర్నీ ప్రారంభమైంది? ఏ లాజిక్‌తో పొలిటికల్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది? ఇప్పుడు ఆయన చెబుతున్న లాజిక్‌లో అసలు లాజిక్ ఏంటి?
అవును..లాజికల్ పొలిటీషియన్ ఎవరు అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఈయన పేరు చెప్పేయొచ్చు. ఈయనే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసిపి ఎంపీ రఘరామకృష్ణంరాజు. ఆయన లాజిక్‌లో నిజంగానే లాజిక్ వుందో లేదో, ఆ లాజిక్ వెనక మంచీ, చెడూ పక్కనపెడితే, తనకు మాత్రం లాజిక్ వుంది, వుండాల్సిందేనంటారు రఘురామ. అందుకు తన పొలిటికల్ హిస్టరీనే నిదర్శనమంటారు. అన్ని లాజిక్‌లు వున్నాయా, ఆయన రాజకీయ ప్రస్థామేంటి?
మొదట వ్యాపారవేత్తగా చక్రం తిప్పారు రఘురామ కృష్ణంరాజు. 2014 ఎన్నికలకు ముందు రాజకీయరంగ ప్రవేశం చేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరెడ్డికి సన్నిహితుడు కావడంతో, ఆయన వారసుడు జగన్‌తో అంతగా సత్సంబంధాలు లేకపోయినా, 2014 ఎన్నికలకు ముందు మొట్టమొదట వైసిపిలో చేరారు. పార్టీలో చేరినకొద్ది నెలలకే జగన్ తీరు నచ్చడంలేదంటూ రివర్సయ్యారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టిమరీ జగన్ పై విమర్మల వర్షం కురిపించి వైసిపికి గుడ్ బాయ్ చెప్పారు. అప్పట్లో బిజెపిలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్న రాజుగారు, పోతూపోతూ నాలుగు మాటలు అంటే తప్పేముందనుకున్నారేమో, జగన్‌పై నానా అభాండాలు వేసి, కాషాయ కండువా కప్పేసుకున్నారు. అలా వచ్చారు, ఇలా తిట్టి వెళ్లిపోతున్నారేంటి, ఈయన లాజిక్ ఏంటని వైసీపీ నేతలు అవాక్కయ్యారు. పార్టీ వీడాలంటే నేరుగా అధినేతనే టార్గెట్ చెయ్యాలనే లాజిక్ రాజకీయాలను సరికొత్తగా పరిచయం చేశారు రఘరామకృష్ణంరాజు.
వైసీపీని వీడిన తరువాత 2014లో బిజెపి నరసాపురం ఎంపీగా టిక్కెట్ పొందాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ రాజుగారి టైమ్ బ్యాడ్. టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా నరసాపురం సీటు గోకరాజుగంగరాజుకు దక్కింది. రాష్ట్రంలో బాల్చీ తన్నేసినా, 2014లో కేంద్రంలో అధికారం చేపట్టింది బిజెపి. కేంద్రంలో అధికారం ఉంది కదా, అని కొన్నాళ్లు బిజెపిలోనే కొనసాగుతూ వచ్చినా, ఎక్కడా పార్టీ కార్యకలాపాల విషయంలో రఘరామకృష్ణంరాజు యాక్టివ్‌గా కనిపించలేదు. రాష్ట్రంలో పాలిటిక్స్ మనకెందుకు, మన వ్యాపారాలు కేంద్రస్థాయిలో కాబట్టి, ఇక్కడ వేలు పెట్టొద్దు అన్న లాజిక్ ఫాలో అవుతూ అటు బిజెపి, టిడిపిని నొప్పించకుండా వచ్చారు. ఆ తరువాత బిజెపిలో పరిస్థితులు కాస్త తేడా అనిపించేసరికి, నెక్ట్స్ టిడిపి గూటికి చేరారు లాజిక్ రాజు.
2019 ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ, టిడిపిలో కొనసాగినా ఏనాడూ టిడిపి ప్రభుత్వంలో పథకాలు, లోపాలపై నోరెత్తలేదు. ఇదే విషయాన్ని ఇప్పడు వైసిపి కూడా లేవనెత్తుతోంది. కానీ తన లెక్కలు తనకుంటాయి. అప్పడు తప్పు అనిపించలేదు. ఇప్పుడు రైట్ అనుకునేలా లేదు అంటూ సమర్థించున్న రఘరామకృష్ణరాజు, ఏం జరిగిందో ఏమో వన్ ఫైన్ డే, ఏపీలో హీటు ఓ రేంజిలో ఉన్న సమయంలో, ఒక్కసారిగా మళ్లీ జై జగన్ అన్నారు. మనస్పర్థలు సహజం, లైట్ అంటూ మళ్లీ సొంత గూటికి చేరిపోయారు. ఇదేంటయ్యా రాజు అంటే ఎంపీ టిక్కెట్టే లాజిక్ అంటూ సమర్థించుకున్నారు. రాజుగారి లాజిక్కా, మజాకా.
వైసీపీ, బిజెపి, టిడిపి, తిరిగి మళ్లీ వైసిపి. ఇలా పార్టీలు మారుతూ, మారినప్పుడుల్లా సరికొత్త లాజిక్ వాడుతూ వచ్చిన రఘరాముడు, 2019 ఎన్నికల్లో సైతం ప్రచారం మొదలు పోలింగ్ వరకూ తనకూ సపరేటు లెక్కుందంటూ ముందుకెళ్లారు. నరసాపురం పార్లమెంట్‌లో జనసేన తరుపున పోటీలో దిగిన నాగబాబు, తనకు అస్సలు ప్రత్యర్థే కాదంటూ చేసిన కామెంట్లు, అప్పట్లో హాట్ హాట్‌గా మారాయి. ఓ వర్గంలో కాకరేపాయి. ఆ మంటలు ఆరకముందే.. కాపు అంటే కాపుకాసేవాడు.. మీకెందుకు పాలిటిక్స్ అన్నట్లుగా రఘరామరాజు చేసిన వ్యాఖ్యలు, అందులోనూ పోలింగ్ కు కొద్దిరోజుల ముందు ఏపీలో సంచలనం రేపాయి. ఓ వర్గం ఓట్లు దూరం చేసుకున్నారు. ఇక రఘరామకృష్ణంరాజు గెలుపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. తన లాజిక్ మీకు అర్థం కాదన్నట్లుగా వ్యవహరించారు. ఇదిలావుంటే, తాను స్వయంగా వెళ్లి అప్పుడు పోటీలో ఉన్న కేఎ పాల్‌ను కలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అస్సలు ఈయన ఏం చేస్తున్నారో అర్ధంకాక సొంత పార్టీ నేతలే, ఎన్నికల సమయంలో తలలు పట్టుకున్నారు. తీరా ఫలితాలు రావడం, ఎంపీగా గెలవడం జరిగాక రాజుగారి లాజిక్ అలా పనిచేసిందా అంటూ చెవులు కొరుక్కున్నారు. టిడిపిలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎక్కడా ఏమీ అనొద్దని స్వయంగా లోకేష్‌కు చెప్పి, కంట్రోల్ చేశారట. ఇలా ఒకటేమిటి ఎన్నో లాజిక్‌లతో తన రూటే సెపరేటు అని ప్రూవ్ చేసుకున్నారు రాజు.
ఇలా పార్టీలు మారడంలోనే కాదు, ఎన్నికల సమయంలో లాజిక్‌లు వాడుతూ తనదైన శైలిలో దూసుకుపోయిన రఘరాముడు, తాజాగా వైసిపిలో కొరకరాని కొయ్యగా మారారు. వేటు వేస్తే ఓ తంటా.. వేయకుంటే.. రోజు రోజుకూ రాజుగారు పెడుతున్న మంట. ఇలా పార్టీ అధిష్టానాన్నే సందిగ్ధంలో పడేలా చేశారు లాజిక్ రాజుగారు. టిటిడి భూములు, ఇళ్ల స్థలాలు, ఇసుక, ఇంగ్లీష్ అంటూ అధికారపార్టీని ఇరుకున పెడుతూనే, అంతా మీ మంచికే చెప్పాగా, అంటూ ఎవ్వరికీ బోధపడని ఓ లాజిక్ బయటకు తీశారు.
ఎదురుదాడికి దిగిన ఎమ్మెల్యేలకే చెమటలు పట్టించారు రాజు. ఈయనతో మావల్ల కాదు, మీరే తేల్చండి అంటూ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. ఇంకేముంది సీన్‌లోకి విజయసాయిరెడ్డి ఎంటరయ్యారు. షోకాజ్ ఇచ్చారు. వెనువెంటనే రాజుగారు షోకాజ్‌లోనూ లాజిక్‌ల రాగం తీశారు. మీరెవరు తనకు షోకాజ్ ఇవ్వడానికి అంటూ పార్టీ పేరు మొదలు, లెటర్ ప్యాడ్, క్రమశిక్షణా సంఘం, అవీ ఇవీ అంటూ ఏకంగా ఢిల్లీలో లొల్లిపెట్టారు. వైసీపీ కండువా ఉండగానే బిజెపి బ్యాండ్ వాయిస్తున్నారు. ఇదేంటయ్యా రాజుగారు అంటే, అర్రే ఇన్నాళ్లూ నా లాజిక్ లు కరక్టేగా, చూస్తూ ఉండండి, ఇప్పుడు నేను అనుకున్న లాజిక్‌కు మీరే జై కొడతారంటూ అధిష్టానంపై అప్రకటిత యుద్దం చేస్తున్నారు. అధికారపార్టీలో ఉంటూనే పార్టీని టార్గెట్ చేస్తున్న రఘరాముడు, అసలైన లాజిక్ ఒకటి మరిచారన్న చర్చ జరుగుతోంది. ఆ లాజిక్కే, ఆయనను మ్యాజిక్‌లా ముప్పతిప్పలు పెడుతుందన్న వాదనా జరుగుతోంది.
లాజిక్‌నే నమ్ముకున్న రఘురామ రాజు, తనదైన లాజిక్‌తో మ్యాజిక్ చేస్తానన్న కాన్ఫిడెన్స్‌తో వున్నట్టున్నారు. అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా, అదిరిపోయే లాజిక్ ఫార్ములా ఒకటి తమ దగ్గర వుంది అంటోంది. ఇంతకీ ఇద్దరి లాజిక్‌లేంటి? చివరికి ఎవరి లాజిక్‌లో అసలైన మ్యాజిక్ వుంది?
పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య యుద్ధం నడుస్తోంది. మొన్నటి వరకు రాజుగారు మాత్రమే కత్తులు దూశారు. ధిక్కారమున్ సైతుమా అని రగిలిపోతున్న వైసీపీ, నేరుగా రాజుతో సమరానికి తొడగొట్టింది. షోకాజ్‌కే షోకాజ్‌లా వున్న రఘురామ ప్రత్త్యుత్తరంతో మరింతగా ఉడుకుతున్న వైసీపీ, ఆయన వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలి పెట్టకూడదని డిసైడయ్యింది. పార్టీ గీత దాటిన రాజుపై, కఠిన చర్యలు తీసుకుని అనర్హత వేటు పడే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాజుపై చర్యలు తీసుకోవడానికి, వైసీపీకి వున్న ఆయుధాలేంటి? వాటి సాధ్యాసాధ్యాల లెక్కేంటి?
డిస్ క్వాలిఫికేషన్...అనర్హత వేటు. భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో యాంటీ డిఫెక్షన్‌లా ప్రకారం, రెండు విధాలుగా ఒక సభ్యుడు అనర్హుడవుతాడు. ఒకటి, ఒక పార్టీ తరపున గెలిచి, ఆ పార్టీ సభ్యత్వాన్ని గనుక, స్వచ్చందంగా వదులుకుంటే, తన ఎంపీ పదవిని కోల్పోతాడు. వాలంటెర్లీ గివింగ్ అప్ ద మెంబర్‌షిప్. రవి నాయక్ కేసులో, కేవలం రాజీనామానే కాదు, రాజీనామా కన్నా ఎక్కువ అర్థం, ఇందులో ఇమిడి వుందని తెలిపింది సుప్రీం కోర్టు. అందువల్ల ఇప్పుడు రఘురామ రాజు చర్యలు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకున్నట్లుగా భావిస్తే, స్పీకర్‌కు గనుక ఒక రిప్రంటైజేషన్ ఇస్తే, స్పీకర్ దాన్ని అంగీకరిస్తే, మళ్లీ రఘురామ దానిపై కోర్టుకు వెళ్లకపోతే, కోర్టు కూడా స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తే, రఘురామ రాజు డిస్‌క్వాలిఫై అవుతారు. ఎంపీ పదవి కోల్పోతారు. ఇది మొదటి పాజిబిలిటి.
ఇక రెండో పాజిబులిటీ....విప్‌ను ధిక్కరించడం. అయితే, ఏనాడూ విప్‌ను ధిక్కరించలేదు రఘురామ రాజు. డిస్‌క్వాలిఫై లాజిక్ బాగా తెలుసుకాబట్టి, ధిక్కరించరు కూడా. ధిక్కరించే పరిస్థితులు కూడా, వైసీపీ కల్పించే అవకాశం లేదు. ఎందుకంటే, బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులను వైసీపీ ఇప్పటి వరకు పెద్దగా వ్యతిరేకించలేదు. 2014 నుంచి కూడా, అనేక బిల్లులకు అనుకూలంగానే ఓటేసింది. కానీ ఏదైనా బిల్లు విషయంలో పార్టీ విప్ జారీ చేస్తే, అందుకు విరుద్దంగా రాజు వ్యవహరిస్తే, అనర్హత వేటు తప్పదు. పార్లమెంట్‌లో ప్రతి సభ్యుడికీ, స్వేచ్చ వున్నా, దాన్ని అభాసుపాలు చెయ్యరాదన్నది రూల్. కిహొటో హొల్లాన్ కేసులోనూ సుప్రీం కోర్టు ఇదే చెప్పింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కిరించడమంటే, పార్టీ పట్ల జనంలో విశ్వాసం సన్నగిల్లేలా చెయ్యడమేనన్నది సుప్రీం మాట. పార్టీ విప్ జారీ చేస్తే, దాన్ని ధిక్కరిస్తే, రఘురామ రాజు అనర్హుడవ్వడం ఖాయం. అయితే, రఘురామనే కాదు, వైసీపీ సైతం మోడీతో సన్నిహితంగానే వున్నారు. దీంతో విప్‌ను ధిక్కరించడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.
ఇక మూడో లాజిక్, సస్పెన్షన్. రఘురామ కోరుతోంది ఇదే. వైసీపీ కూడా అదే ఆశిస్తే, రఘురామను పార్టీ నుంచి బహిష్కరణవుతారు. మరి పార్టీ నుంచి ఎక్స్‌పెల్ చేశాక ఏమవుతుందన్నది ప్రశ్న. సస్పెన్షన్ వేటు వేస్తే, రాజు అన్ అటాచ్‌డ్ మెంబర్ అవుతాడు. సుప్రీం కోర్టు ఈ విషయంలో క్లియర్‌గా ఒక మాట చెప్పింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం, అన్ అటాచ్‌డ్ మెంబర్ అంటూ వుండరని స్పష్టం చేసింది. ఒకవేళ ఒక పార్టీ ఒక సభ్యున్ని బహిష్కరిస్తే, అది ఆ పార్టీకి, మెంబర్‌కు సంబంధించిన వ్యవహారమే తప్ప, రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి రాదని వ్యాఖ్యానించింది. అంటే రఘురామను పార్టీ నుంచి బహిష్కరిస్తే, ఆయనపై అనర్హత వేటు పడదు. టెక్నికల్‌గా ఆయన వైసీపీ సభ్యుడిగానే వుంటారు. అంటే పార్టీ మారినా, విప్ ధిక్కరించినా సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశముంది కానీ, వైసీపీ బహిష్కరిస్తే మాత్రం, రాజు తన ఎంపీ పదవిని కోల్పోరన్న మాట.
ఇలా ఎలా చూసినా, రాజుగారి లాజిక్ పక్కాగా వుంది. అందుకే ఈ రేంజ్‌లో పార్టీతోనే ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే, వైసీపీ ఆలోచన, ఆశ మాత్రం, ఒక్క ఎంపీ విషయంలో బీజేపీ తమను ఇబ్బందిపెట్టదని. పార్టీతో స్పీకర్‌కు ఎలాంటి సంబంధంలేకపోయినా, స్పీకర్ సైతం తాము అందించే అనర్హతా పిటిషన్‌ను మన్నిస్తారని భావిస్తోంది వైసీపీ. శరద్ యాదవ్ డిస్‌క్వాలిఫై అంశాన్ని ఉదాహరణగా చూపి, డిమాండ్ కూడా చేయొచ్చు. అయితే, స్పీకర్ సహా, బీజేపీ అగ్రనేతలు రఘురామతో పరిచయాలున్నాయి కాబట్టి, అనర్హత పిటిషన్ వెంటనే టేకప్ చేసే అవకాశంలేదన్నది ఢిల్లీలో పొలిటికల్ పండితుల విశ్లేషణ. అందుకే తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చెయ్యలేదని, ఇతర పార్టీలో చేరలేదని, వారితో పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చెయ్యలేదని, లాజిక్ తీస్తారు రాజు. మొత్తానికి రాజుగారి ఎపిసోడ్‌లో స్పీకర్ ఓంబిర్లా నిర్ణయమే కీలకం. పార్టీని రాజు ధిక్కరించారా, అనర్హత వేటుకు వైసీపీ సమర్పిస్తున్న ఆధారాలు సరిపోతాయా అన్న అంశాలపై స్పీకర్ విచక్షణే అంతిమం. చూడాలి, ఎవరి లాజిక్ హిట్టవుతుందో....?
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire