Pawan Kalyan: చంద్రబాబు కోసం పవన్ బీజేపీని వదులుకున్నట్టేనా..?

Is Pawan Kalyan Gave Up BJP For Chandrababu
x

Pawan Kalyan: చంద్రబాబు కోసం పవన్ బీజేపీని వదులుకున్నట్టేనా..?

Highlights

Pawan Kalyan: 2019లో బాబును విమర్శించిన పవన్.. ఇప్పుడు ఎలా కలుస్తున్నారని కామెంట్స్..?

Pawan Kalyan: చంద్రబాబు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీని వదులుకునేందుకు సిద్ధమయ్యరా..? బాబు అరెస్టుపై టీడీపీ నేతల కంటే పవనే ఎక్కువగా స్పందించడానికి కారణమేంటి..? ములాఖత్ అనంతరం రాజమండ్రి జైలు వేదికగా పొత్తు ప్రకటించి. చంద్రబాబు ఒంటరి కాదని తాను అండగా ఉన్నాననే భరోసా ఇచ్చారా..? అందుకే ఇప్పుడు వైసీపీని ఎండగట్టేందుకు వారాహి యాత్రతో జనాల్లోకి వెళ్తున్నారా. ఏపీ అంధకారం కాకూడదంటే.. జగన్‌ను ఇంటికి పంపించాలని సర్కార్‌పై ఎదురుదాటికి దిగుతున్నారా..?

రాబోయే టీడీపీ- జనసేన సర్కారేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు పవన్. ఎలాంటి బేషజాలు లేకుండా..టీడీపీ, జనసేన శ‌్రేణులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ కోసం ఎన్డీయే నుంచి పవన్ బయటకు వచ్చినట్టే కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కలిసి వచ్చినా, రానుకున్నా..తాను మాత్రం బాబుతోనే అనే సంకేతాలు క్లియర్‌గా ఇచ్చేశారు పవన్. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమేనా.?

చంద్రబాబు అరెస్టుకు ముందు నుంచే.. టీడీపీతో పొత్తుకు సిద్దమైయ్యారు పవన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నానని జనసేనాని ప్రకటించారు. వైసీపీతో ఉన్న అనధికార అవగాహన ఒప్పందం వల్ల, రాజకీయ ప్రయోజనాల దృష‌్ట్య టీడీపీతో కలిసేందుకు బీజేపీ ససేమిరా అన్నది. అనంతరం బాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగింది. జనసేన ఒంటరిగా వెళితే గెలిచే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. అది వైసీపీకే లాభం అవుతుంది. టీడీపీతో కలిస్తేనే.. జగన్‌కు గట్టి పోటీ ఇవ్వవచ్చని సంకేతాలు వెలువడ్డాయి.

అటు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చాయి. దీంతో బీజేపీ కలిసి రాకపోయినా..టీడీపీతో వెళ్లేందుకు పవన్ నిర్ణ‍యం తీసుకున్నారు. అందుకే.. బీజేపీతో సంబంధం లేకుండా..రాజమండ్రి వేదికగా పొత్తు ప్రకటించారు. చంద్రబాబు అరెస్టులో కేంద్రం పాత్ర ఉందని భావిస్తున్న పవన్,, బీజేపీ దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వైఖరిని.. టీడీపీ నేతల కంటే పవనే ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో బాబును అంతగా వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు ఇంతగా సపోర్ట్ చేయడం ఏంటని పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ జరుగుతోంది. చంద్రబాబును మెప్పించడానికే పవన్ ఇంతలా తాపత్రయం పడుతున్నారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్,,చంద్రబాబుకు దత్తపుత్రుడని.. పొత్తు ప్రకటనే తెలిసిపోయిందని ఓ వైపు వైసీపీ తీవ్రంగా విమర్శిస్తున్నా, ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేస్తున్నా... జనసేనాని మాత్రం బాబుతో దోస్తనమే కోరుకుంటున్నారు.

ఇక పెడన సభలో.. బీజేపీకి పవన్ గుడ్ బై చెప్పినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో ఉన్నా, కష్టాలు, ఇబ్బందులున్నా బయటికి ఎందుకొచ్చానంటే టీడీపీ అనుభవం కావాలి, జనసేన పోరాట పటిమ కావాలంటూ పవన్ పెడనలో మాట్లాడారు. ఇప్పటికే పవన్.. బీజేపీకి దూరంగా ఉంటున్నా ఏపీ కమలనాథులు మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. జనసేనతో పొత్తుపై జాతీయ స్ధాయిలో నాయకత్వం చూసుకుంటుందని చెప్పేస్తున్నారు. పవన్‌తో భేటీ అవుతానని చెప్పిన పురందేశ్వరి కూడా వెనుకముందు అవుతున్నారు.

పవన్ ప్రతీ మాటకూ స్పందించాలా అని అడుగుతున్నారు. అటు కేంద్రం నుంచి కూడా పవన్ కు ఎలాంటి సంకేతాలు లేవు. అంటే ఇవన్నీ ఎన్డీయేకు పవన్ దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-కమ్యూనిస్టు కూటమి ఏర్పాటు చేసి వైసీపీని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధిస్తే జాతీయ స్ధాయిలో ఇండియా కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories