కరెక్టు టైంలో వైసీపీ మద్దాలి గిరి బాంబ్.. ఈ భేటి టీడీపీకి ఝలక్కేనా?

కరెక్టు టైంలో వైసీపీ మద్దాలి గిరి బాంబ్.. ఈ భేటి టీడీపీకి ఝలక్కేనా?
x
Highlights

కరెక్టుగా టైమింగ్‌ చూసి తెలుగుదేశంపై వైసీపీ బాణం వదిలిందా..? రాజధానిపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న సమయంలో, అదే రాజధాని ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేతో,...

కరెక్టుగా టైమింగ్‌ చూసి తెలుగుదేశంపై వైసీపీ బాణం వదిలిందా..? రాజధానిపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న సమయంలో, అదే రాజధాని ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేతో, చంద్రబాబుపై విమర్శలు చేయించడంలో అధికార పార్టీ వ్యూహమేంటి? సీఎం జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరి కలవడం వెనక స్ట్రాటజీ ఏంటి? రాజధాని అభివృద్దిపై, చంద్రబాబు మీద గిరి చేసిన కామెంట్లు ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశముంది?

ఒకవైపు రాజధాని తరలింపుపై అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు, మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మాటల తూటాలు. మూడు రాజధానులపై ఇలాంటి ఉద్రిక్త, ఉద్విగ్వ పరిస్థితుల్లో, సరిగ్గా టైమ్‌ చూసి తెలుగుదేశానికి షాకిచ్చే వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నం చేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్. రాజధానిపై టీడీపీ అలజడి రేపుతున్న టైంలోనే, అదే రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేను తమవైపును తిప్పుకుంది. రాజధానిపై టీడీపీ వాదనను, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేతోనే తిప్పికొట్టడం ద్వారా, మూడు రాజధానులపై తన ఆర్గ్యూమెంట్‌ను బలపరుచుకునే ప్రయత్నం చేసింది వైసీపీ.

రాజధానిపై పెద్దఎత్తున రగడ సాగుతున్న టైంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని, గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కలవడం, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌ను కలిశారు మద్దాలి గిరి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆ‍యనను స్వయంగా జగన్‌ దగ్గరికి తీసుకెళ్లారు. చాలాసేపు వీరి సమావేశం జరిగింది. భేటి తర్వాత బయటికొచ్చిన మద్దాలిగిరి, వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. కార్యదక్షత వున్న నాయకుడు జగన్‌ అని పొగిడారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మద్దాలి గిరి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐదేళ్లలో రాజధాని అమరావతికి చంద్రబాబు చేసిందేమీలేదన్నట్టుగా మాట్లాడారు గిరి. చంద్రబాబు అభివృద్ది చేసి వుంటే, ఈరోజు రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తారని, చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని పదేపదే అన్నారు గిరి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని రాజధానికి భూములిచ్చిన రైతులనుద్దేశించి మాట్లాడారు. లెజస్లేటివ్ రాజధానిగా అమరావతి వుంటుందని, అభివృద్ది ఆగదన్నారు గిరి.

మద్దాలి గిరి, వ్యాఖ్యలన్నీ కూడా, మూడు రాజధానులపై వైసీపీ చేస్తున్న వాదనను ఏకపక్షంగా బలపరుస్తున్నాయి. అంటే టీడీపీ ఆర్గ్యూమెంట్‌ను తిప్పికొడుతున్నట్టే. సొంత పార్టీ ఎమ్మెల్యేనే, మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించడం, నిజంగా చంద్రబాబుకు ఇబ్బందే. అంతర్జాతీయ రాజధానిగా అమరావతిని అభివృద్ది చేసేందుకు ఐదేళ్లలో బాటలేశామంటున్న టీడీపీ వాదనను, దాదాపు తిప్పికొట్టినట్టుగా మాట్లాడి షాకిచ్చారు మద్దాలిగిరి. రాజధాని తరలింపుకు నిరసనగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న టీడీపీ ఆందోళనల టైంలోనే, అదే రాజధాని ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేతో బాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనక వైసీపీకి పక్కా వ్యూహముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కరెక్టు టైము చూసి, తెలుగుదేశంపై గిరిని ప్రయోగించి, సక్సెస్‌ అయ్యామని వైసీపీ చెప్పుకుంటుంటే, అటు టీడీపీకి ఝలక్ ఇవ్వడంలో మద్దాలి గిరికి వేరే లెక్కలు కూడా వున్నాయన్న మాటలు వినపడ్తున్నాయి.

మద్దాలి గిరిధర రావు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్‌ టీడీపీ ఎమ్మెల్యే. 2014లోనూ గిరికి టికెట్ ఇచ్చింది టీడీపీ. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యేసురత్నంపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు మద్దాలి గిరి. అయితే, 2019లోనే టీడీపీ టికెట్‌ కోసం అష్టకష్టాలు పడి టికెట్ తెచ్చుకుని, ఎలాగోలా గెలిచిన గిరికి, నియోజకవర్గంలో పార్టీ సరైన గుర్తింపునివ్వడం లేదన్న చర్చ వుంది. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన గిరి, నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం నేతల పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారట. మా భిక్ష, మా ఓట్లతోనే గెలిచావంటూ మానసికంగా బాధపెట్టారట. ఎన్నికల వేళ, తాను ఆర్ధికంగా బాగా నష్టపోయానని, తీవ్ర ఇబ్బందుల్లో వున్నానని, సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసేవారట గిరి.

మొత్తానికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ బాటలో నడిచేందుకు సిద్దమయ్యారు మద్దాలిగిరి. తనను సైతం ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరే అవకాశముంది. ఇంకా చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా టైంను చూసి, వైసీపీ బాణాలు వదలుతోందని పొలిటికల్ పండితులంటున్నారు. రాజధాని ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు, రాజధాని ప్రాంత ఎమ్మెల్యే గిరిని ప్రయోగించిందని అంటున్నారు. ఎప్పటి నుంచో వైసీపీలో చేరతారని గిరిపై ప్రచారం జరుగుతోంది. తన సామాజికవర్గానికే చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌‌, గిరికి లైన్‌ క్లియర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. మొత్తానికి రాజధానిపై టీడీపీ ఆందోళనలు చేస్తున్న టైంలోనే, అదే పార్టీ ఎమ్మెల్యేతో మూడు రాజధానులను సమర్థించేలా వ్యాఖ్యలు చేయించి, టీడీపీ వాదనను తిప్పికొట్టే వ్యూహం వైసీపీ వేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, సామదాన దండోపాయాలతో తమ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని, రాజధానిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేతలంటున్నారు. మరి రాజధాని ప్రాంత ఎమ్మెల్యే మాటలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో, ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నది రానున్న కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories