సీఎం పేషీలో కేవీపీ తరహా మెకానిజం అవసరమన్న చర్చెందుకు వస్తోంది?

సీఎం పేషీలో కేవీపీ తరహా మెకానిజం అవసరమన్న చర్చెందుకు వస్తోంది?
x
Highlights

భగవంతునికి, భక్తునుకి అనుసంధానకర్త పూజారి. నాడు వైఎస్‌కు, ఎమ్మెల్యేలకు అనుసంధానకర్త కేవీపీ రామచంద్రరావు. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్‌, సీఎం పీఠంపై...

భగవంతునికి, భక్తునుకి అనుసంధానకర్త పూజారి. నాడు వైఎస్‌కు, ఎమ్మెల్యేలకు అనుసంధానకర్త కేవీపీ రామచంద్రరావు. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్‌, సీఎం పీఠంపై కూర్చున్నారు. కానీ కేవీపీ వారసుడులాంటి మిడిల్ మ్యానేజ్‌మెంట్ పర్సన్‌ లేరు. అదే పెద్ద లోటుగా పరిణమించి, పోటుగా మారుతోందన్న చర్చ వినిపిస్తోంది. జగన్‌కు, ఎమ్మెల్యేల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌కు అదే కారణమా? కేవీపీ తరహా మధ్యవర్తిత్వ డిమాండ్‌, తెరపైకి వస్తున్నది అందుకేనా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేల బాధేంటి...వ్యధేంటి...కథేంటి?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. ఇద్దరూ ఇద్దరే. ప్రాణమిత్రులు. వైఎస్ సీఎంగా వున్నప్పుడూ ఇదే అనుబంధం. వైఎస్‌కు నేరుగా చెప్పకలేకపోయినా పర్వాలేదు, వైఎస్ ఆత్మకు చెబితే చాలు పనులు అయిపోతాయి, సమస్యలు పరిష్కారమవుతాయ్ అన్న నమ్మకం, నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ వుండేది. అంతేకాదు, వైఎస్ కూడా అపాయింట్‌మెంట్‌ అడిగిన ప్రతి ఎమ్మెల్యేకూ, ఏదో ఒక టైంలో కలిసే అవకాశమిచ్చేవారు. అలా ఏకంగా సీఎంకు చెప్పుకోవడం, లేదంటే కేవీపీకి చెప్పకున్నా పనయిపోతుందన్న నమ్మకం వుండేది. వైఎస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ బడాబడా నేతలు పార్టీలో వున్నా, ఎమ్మెల్యేలుగా వున్నా, అసంతృప్తి రాకపోవడానికి, బయటపడకపోవడానికి అదే కారణమంటారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ జగన్ ప్రభుత్వంలో అదే లోపించిందట. ఎమ్మెల్యేలకు, సీఎంకు మధ్య పూడ్చలేనంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది.

కేవీపీ లాగా మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని చూపే ఒక వ్యవస్థ లేకపోవడం వల్ల, ఎమ్మెల్యేలు, సీఎంకు మధ్య అగాధం ఏర్పడిందట. ఎమ్మెల్యేలకు సీఎంతో ఎన్నో రకాల పనులు వుంటాయి. రాజకీయంగా కావచ్చు, నియోజకవర్గాల అభివృద్ది కావచ్చు, పథకాలు, అధికారుల బదిలీలు కావొచ్చు, కాంట్రాక్టుల వంటి వ్యక్తిగతాలు కావొచ్చు. జిల్లాలో, నియోజకవర్గంలో, అధికారులు, మంత్రుల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు. ఇలా చిన్నవో, పెద్దవో తమ సమస్యలు, విన్నపాలు సీఎం దగ్గర విన్నవించుకోవాలని ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఏదో ఒక రకంగా సీఎంను కలిసి, తమ గోడు వెళ్లబోసుకోవాలనుకుంటారు. కానీ జగన్‌ దర్శనం మాత్రం లభించడంలేదంటూ, రోజురోజుకు వారిలో అసంతృప్తి పెరుగుతోంది.

వైసీపీ ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయినా, ఇప్పటిదాకా, దాదాపు 50 ఎమ్మెల్యేలు నేరుగా సీఎం జగన్‌ను కలవలేకపోయారటంటే, గ్యాప్‌ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు సీఎం అపాయింట్‌మెంట్‌ అడిగినా లభించలేదట. ఎక్కడో జిల్లాల్లో సీఎం పాల్గొనే ప్రోగ్రామ్స్‌లో కలుస్తున్నారు తప్ప, పర్సనల్‌గా వచ్చి కలవలేకపోయారట. దీంతో తమ వేదనా, రోదనా ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, లోలోపల కుమిలిపోతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో కేవీపీ తరహా మధ్యవర్తిత్వ యంత్రాంగం వుండాలన్న డిమాండ్ పెరుగుతోంది.

అలాగని వైసీపీలో ట్రబుల్ షూటర్లు లేరని కాదు, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వున్నారు. జగన్‌ ఆంతరంగీకులుగా కూడా వీరికి పేరుంది. వీరికి ఎమ్మెల్యేలు తమ బాధలు చెప్పుకుంటున్నారు కూడా. కానీ ఆ సమస్యలేవి పరిష్కారం కావడం లేదన్నది ప్రజాప్రతినిధుల బాధ. సీఎంకు చెప్పడానికి విజయసాయిరెడ్డి, సజ్జల భయపడుతున్నారా? లేదా వాళ్లు చెప్పినా సీఎం పట్టించుకోవడం లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి. అవే ఎమ్మెల్యేలు, సీఎంకు మధ్య భారీగా కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడానికి కారణమవుతున్నాయి. జగన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా వున్నారన్న చర్చకు ఆజ్యం పోస్తున్నాయి. విపక్షాలు సైతం, ఇలాంటివాటిని అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. అందుకే కేవీపీ తరహా మిడిల్ మ్యానేజ్‌మెంట్‌ అవసరం వుందన్న డిమాండ్, వైసీపీలో బలంగా వినిపిస్తోంది.

గెలిచిన ఎమ్మెల్యేలంతా, జగన్‌ చరిష్మాతో గెలిచినప్పటికీ, సీఎంను కలిసే స్వేచ్చ కూడా లేకపోతే మంచిదికాదంటున్న పార్టీ సీనియర్లు, ఇప్పటికిప్పుడు పెద్ద సమస్యగా కనిపించకపోవచ్చు గానీ, రానురాను నివురుగప్పిన నిప్పులా తయారయ్యే ప్రమాదం వుందంటున్నారు. అవకాశమొచ్చినప్పుడు, తమ సత్తా ఏంటో చూపించాలన్న కసి కూడా వారిలో కలిగే చాన్సుంది. అందుకే నాడు వైఎస్‌ఆర్‌ హయాంలో కేవీపీ లాంటి మధ్యవర్తిత్వ యంత్రాంగం ఎలాగైతే వుండేదే, అలాంటిదే వుండాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories