చంద్రబాబు కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?

Is Chandrababu In Confusion
x

చంద్రబాబు కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?

Highlights

Chandrababu Naidu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలు మాత్రం బండరాయి దగ్గరే ఆగిపోతాయి.

Chandrababu Naidu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలు మాత్రం బండరాయి దగ్గరే ఆగిపోతాయి. ఆయన మాటలకు, చేసే చేతలకు అస్సలు సంబంధం ఉండదు. మాటలతో గారడీ చేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయంలో ఉన్న వారందరికీ తెలిసిన విషయమే... ఇన్నేళ్ల రాజకీయంలో చంద్రబాబు ఎన్నో మాటలు మాట్లాడారు. ఆఖరికి సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ కూడా తన ఘనతే అని చెప్పుకున్న నేత ఆయన.... ఇక తన సొంత పార్టీ గురించి ఏ రేంజ్‌లో బిల్డప్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాలా...?. అది మరోసారి బయట పడిందనే చెప్పుకోవాలి.

ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తోందని చెప్పారాయన... అదే సమయంలో కేంద్రంలో మరోసారి బీజేపీ వస్తుందనే ఉద్దేశంతో.. బీజేపీతో పొత్తులపై సానుకూలంగా ఉన్నామని చెప్పారు. పొత్తులపై కాలమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసలు ఏపీలో టీడీపీ ప్రభంజనం ఉంటే మరి పొత్తులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు.... అసలు చంద్రబాబు నాయుడుకు పొత్తులు పెట్టుకోవడం ఇది కొత్తేం కాదు. కానీ ఆయన ఇలా టీడీపీ ప్రభంజనం ఉందని చెబుతూనే పొత్తులు పెట్టుకోవడం దేనికి సంకేతం.. చంద్రబాబుకు ఎందుకీ కన్ఫ్యూజన్.

వైసీపీని ఒంటరిగా ఢీ కొట్టలేమని ఆయనకు కూడా తెలిసినట్టే కదా... అసలే ఏపీలో ఏమీ పట్టులేని బీజేపీతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నాడు... అంటే కేంద్రం అండ కోసమే అని తెలిసిపోతోంది. ఏవో రెండు సీట్లు బీజేపీ ముఖాన పడేసి... కేంద్రం మద్దతుతో వచ్చే ఎన్నికల్లో తాను లాభం పొందాలని పక్కా ప్లాన్ వేశారని అంటున్నారు రాజకీయం తెలిసిన పెద్దలు... ఇప్పటికే జనసేనతో పొత్తులు ఉంటాయని చెప్పారు. అటు పవన్ కల్యాణ్‌ పొత్తులపై పెద్ద జపమే చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు పొత్తులకు ఒప్పుకుంటారా..? అని ఎదురు చూస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్‌.

అసలు చంద్రబాబుకు ఇలా పొత్తులు పెట్టుకోనిదే ఇప్పటి వరకు అధికారం రాలేదు. గతంలో ఆయన చరిత్ర చూస్తేనే అర్థం అవుతుంది. ప్రత్యర్థులను ఎప్పుడూ ఆయన ఒంటరిగా ఎదుర్కొన్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు కేవలం పొత్తులతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే పొత్తుల పేరుతో వాడుకుని వదిలేయడం కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.... గతంలో చాలామందిని ఇలాగే వాడుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌, బీజేపీలను తన అవసరాలకు వాడుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారాయన... ఈసారి జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొంటే పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే భయంలో ఉన్నట్టున్నారు చంద్రబాబు... అందుకే పైకి మాత్రం టీడీపీ ప్రభంజనం అంటూ బిల్డప్ ఇస్తూనే.. లోలోపల మాత్రం పొత్తుల కోసం పోరాడుతున్నారు.

ఇదంతా ఇలా ఉంటే తన తనయుడు లోకేష్ మాత్రం ఎవరితోనూ పొత్తులు ఉండవు.. ఏమీ ఉండవు.. మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎక్కడ ఏ సమావేశంలోనయినా ఇదే మాటను అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెబుతూనే ఉన్నాడు. అంటే తండ్రీ కొడుకుల మధ్య సమన్వయం ఉందా అని ఏపీ ప్రజలకు అనుమానం కలుగక మానదు.. మరి చంద్రబాబు ఫ్యూచర్ ఎలా ఉండనుంది..? ఉమ్మడి రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు పాలించి.. ఎన్‌డీఏ హయాంలో దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు.. వైసీపీని ఢీకొట్టలేననే భయం లోలోపల ఉందా..? ఆయనకు ఎందుకీ కన్ఫ్యూజన్... ఆయన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories