సాగునీరు లేక సిక్కోలు రైతుల ఇబ్బందులు

Irrigation Water Problems of Farmers
x

సాగునీరు లేక సిక్కోలు రైతుల ఇబ్బందులు

Highlights

Farmers: చుక్కనీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు

Farmers: సిక్కొలు జిల్లా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఆరుగాలం శ్రమించి వరినాట్లు వేసిన రైతన్నలకు ఈసారి నిరాశే మిగులుతోంది. కాలువల్లో చుక్కనీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి.ఈ ఖరీఫ్ సీజన్‌లో 2లక్షల,50వేల హెక్టార్లలో వరి నాట్లు వేశారు రైతులు. వంశదార, నాగావళి, మడ్డువలస, నారాయణపురం కాలువ కింద లక్షలాది హెక్టార్లలో వరిని సాగుచేశారు.ముఖ్యంగా నారాయణపురం కుడికాలువ, ఎడమ కాలువ కింద పెద్ద ఎత్తున వరిని సాగు చేస్తున్నారు.జులై మొదటి వారంలోనే కాలువల్లోకి నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు..క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో నారాయణపురం కాలువ కింద ఎచ్చెర్ల, లావేరు, శ్రీకాకుళం రూరల్, సంతకవిటి మండలాల్లో ఆయకట్టు చివరన ఉన్న వేలాది ఎకరాలకు నీరు అందడం లేదు.

వరి నాటు వేసిన తర్వాత కొద్దిరోజుల పాటు నీటిని విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత మొండిచేయి చూపించారు. దీంతో ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్ లోని పలు గ్రామాల్లో వరిపైరు ఎండిపోయింది. చుక్కనీరు లేక పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. కొన్ని పొలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. కాలువల్లో నీరు లేకపోవడంతో..కొన్ని చోట్ల ఇంకా వరి నాట్లు వేయని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏటా ఆగస్టు మొదటి వారంలోనే ఈ మండలాలకు నారాయణపురం నీరు అందేది. కానీ ప్రస్తుతం ఆగస్టు నెల చివరికొచ్చినా చుక్క నీరు కన్పించడంలేదు. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

సాగునీరు లేక వేలాది ఎకరాలు బీడు వారడంపై నారాయణపురం రిజర్వాయర్ ఎస్‌ఈ సుధాకర్‌ స్పందించారు. ఈ నెలాఖరుకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఎండిపోతున్న పంటలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటామన్నారు.

వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సాగు చేసిన వరి పంటంతా ఎండిపోయి బీడులు వారుతున్న విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెప్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories