మీరూ మీరూ కొట్టుకుంటూ మధ్యలో మా మీద పడతారేంటన్నది ఓ సినిమాలో డైలాగ్. ఆ సినిమాను ఈ పోలీస్ బాస్ చూసారో లేదో కానీ, ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మాత్రం...
మీరూ మీరూ కొట్టుకుంటూ మధ్యలో మా మీద పడతారేంటన్నది ఓ సినిమాలో డైలాగ్. ఆ సినిమాను ఈ పోలీస్ బాస్ చూసారో లేదో కానీ, ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మాత్రం అలానే ఉందని ఖాకీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ వల్ల సహజంగా వచ్చే ఒత్తిడులు ఓవైపు మీరు మా గొంతునొక్కుతున్నారు మమ్మల్ని అణచివేస్తున్నారని, అంతే సహజంగా విపక్షాల విమర్శలు మరోవైపు చుట్టుముడుతున్న తరుణంలో మధ్యలో నలిగిపోతున్న ఖాకీలపై హెచ్ఎంటివి ఆఫ్ ది రికార్డ్.
కొద్దిరోజులుగా ఏపీలో జరుగుతోన్న రాజకీయపరిణామాలు హీటెక్కిస్తున్నాయి. దళితులపై జరిగిన దాడుల ఘటనలు కావచ్చు, దేవాలయాలపై జరుగుతోన్న వరుస దాడులు కావచ్చు ఈ ఘటనలన్నీ పోలీసు యంత్రాంగానికి సవాల్ గా మారుతున్నాయి. వీటన్నింటితోపాటు పలు కేసుల్లో బాధితులు అలాగే కొంతమంది నిందితులు సైతం కోర్టుల్ని ఆశ్రయిస్తోన్న నేపథ్యంలో, అక్కడ సైతం పోలీసులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా హడావిడిగా కేసులు నమోదు చేయటం, పూర్తిస్థాయి ఆధారాలు లేకుండా శిక్షలు, చర్యలు తీసుకోవటం వంటి వాటిల్లో కూడా మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంటల తరబడి పోలీసు ఉన్నతాధికారులు కోర్టుల వద్దే పడిగాపులు కాసిన పరిస్థితులూ ఎదురయ్యాయి. మధ్యలో పొలిటికల్ పంచింగ్‌లు, ఖాకీలను మరింత చికాకు పెడుతున్నాయి.
దీంతో ఈ రకమైన ఒత్తిడులు ఓవైపు కనిపిస్తోంటే, మరోవైపు రాజకీయపరమైన ఒత్తిళ్లు సైతం పోలీసుల్ని మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. నాడు టిడిపి హయాంలో విపక్ష హోదాలో ఉన్న వైసీపీ పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధించింది. వైజాగ్ ఎయిర్ పోర్టులో నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ ను పోలీసులు అడ్డుకున్నప్పుడూ ఆ తర్వాత అదే ఎయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తితో హత్యాయత్నం జరిగినపుడు కూడా పోలీసుల వైఖరిని వైసీపీ తప్పుబట్టింది. నాటి సీఎం చంద్రబాబు చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని ఎద్దేవా చేసింది. అసలు ఆంధ్రా పోలీసుల మీద మాకు నమ్మకమే లేదనీ, తమ ప్రాణాలకు భద్రతే లేదని టిడిపి టార్గెట్ గా పోలీసులే అస్త్రంగా వైసీపీ విమర్శించిది. ఎమ్మెల్యే రోజా విషయంలో కూడా, విజయవాడ పవిత్ర సంగమ ప్రాంతం వద్ద జరిగిన మహిళా పార్లమెంట్ వద్దకు వెళ్తోన్న తరుణంలో, పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేసిన ఘటనలు సైతం పోలీసుల వైఖరిపై విమర్శలకు దారితీశాయి.
అయితే కాలం మారుతున్నట్లే పరిస్థితులు కూడా మారాయి. అధికారం సైకిల్ దిగి ఫ్యాన్ పంచన చేరింది. ఇక వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా తన పాలనకు శ్రీకారం చుట్టిన తర్వాత, పాలనాపరమైన అంశాలపై విపక్షాలు విమర్శలు మొదలెట్టాయి. ఈనేపథ్యంలో దళితులపై జరిగిన వరుస దాడులు, అలాగే హిందూ దేవాలయాలపై జరిగిన దాడి ఘటనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీంతో ఇదే అదనుగా భావించి విపక్షాలు తమ స్వరం మరింత పెంచాయి. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల్ని పోలీసులు అడ్డుకోవటం, ధర్నాలు నిరసనలకు అనుమతులివ్వకపోవటం, ఛలో అమలాపురం వంటి కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీయటం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో వైసీపీ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారంటూ, పోలీసు ప్రభుత్వం ఏపీలో నడుస్తోందన్న ఘాటు వ్యాఖ్యలు సైతం విపక్షాల నుంచి వినిపించాయి. మధ్యలో చిన్న బ్రేక్ అన్నట్లుగా లాక్ డౌన్ పరిస్థితులు, ఆపన్నులకు సాయం చేసే క్రమంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ టిడిపితో పాటు పలుపార్టీల నేతలపై కేసులు నమోదు చేయటం కూడా విమర్శలకు దారితీసింది. అధికారపార్టీ నేతల్ని మాత్రం వదిలేసి తమపై ఉద్దేశ్యపూర్వక కేసులు నమోదయ్యాయన్న ఆరోపణలు సైతం ఆయాపార్టీల నుండి వినిపించాయి.
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన జడ్జి రామకృష్ణ వ్యవహారం, ప్రభుత్వాన్ని మరికొంత ఇరుకునపెట్టింది. తాజాగా ఆయన సోదరుడు రామచంద్రపై ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి, దాడికి దిగిన ఘటనపై జరిగిన పొలిటికల్ ఫైట్ అటూ ఇటూ తిరిగి డీజీపీ ఆఫీసు వైపుకు మళ్లింది. వైసీపీ నేతలు దళితులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారనీ, ఈ వరుసదాడులు చూస్తోంటే గుండె కలుక్కుమంటోందనీ, డిజిపి గౌతమ్ సవాంగ్ కు టిడిపి అధినేత చంద్రబాబు రాసిన లేఖ ఈ పొలిటికల్ హీట్ ను పీక్ కు తీసుకెళ్ళింది. దాంతో డిజిపి సైతం కాస్తంత ఘాటుగానే స్పందించటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. మీరు ఊరికే ఆరోపణలు చేయటం సరికాదు, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయకుండా ఆధారాలు మీ దగ్గరుంటే మాకు సీల్డ్ కవర్ లో పంపమన్నది డిజిపి ప్రత్యుత్తర సారాంశం.
దీంతో అటు వైసీపీ, ఇటు టిడిపిల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ కు మధ్యలో మంచింగ్ లా పోలీసింగ్ వ్యవస్థ మారుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల మాట వినకపోతే ఏమారుమూలకో ట్రాన్స్ ఫర్ లు ఉంటాయన్న భయంతో కొందరు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండాకు జై కొట్టే మరికొందరి వల్ల డిపార్ట్ మెంట్ లో నిజాయితీగా పనిచేసే అధికారులు, కిందిస్థాయి సిబ్బంది కొంత ఇబ్బందులు పడుతున్నారట. మా పార్టీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాం మమ్మల్నే ఇబ్బంది పెడతారా...? చూద్దాం...ఇంకెంత కాలం ఇలా చేస్తారో అన్న హెచ్చరికలు తరచుగా వినబడటం కామనైపోయిందని సదరు అధికారులు ఆవేదన చెందుతున్నారట. కానీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి రియల్ పోలీసింగ్ చూపించాల్సిన బాధ్యత ఉన్న ఖాకీలు, ఇప్పుడెదుర్కొంటున్న పరిస్థితికి కారణమెవ్వరని వచ్చే ప్రశ్నలకు, ఒక వేలు ముందుకు చూపిస్తోంటే మిగిలిన నాలుగు వేళ్లు తమవైపే చూపిస్తున్నాయట. మరి ఇప్పటికైనా ఈ పొలిటికల్ వార్ లో నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న ఫీలింగ్ జనాల్లో కలగాలంటే మారాల్సిందీ, మార్చుకోవాల్సిందీ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరి ఈ మార్పును ఆయా పార్టీలు స్వాగతిస్తాయా..? దాన్ని కూడా తమకు అలవాటైన రాజకీయమే చేస్తాయా...? ఏమో లోతైన చర్చ జరగాల్సిన అంశమే ఇది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire