గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాల వివాదం... ఇప్పటివరకూ అసలేం జరిగింది?

Hidden Cameras Controversy in Girls Hostel of Gudlavalleru Engineering College What Has Happened So Far?
x

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాల వివాదం... ఇప్పటివరకూ అసలేం జరిగింది?

Highlights

విద్యార్ధినులు ఉపయోగించే బాత్ రూమ్ లలో షవర్లు, ట్యాప్ లను మార్చారు. రహస్య కెమెరాలకు సంబంధించి న్యాయం కోసం విద్యార్ధినులు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే కొన్ని బాత్ రూమ్ లలో ట్యాప్ లు, షవర్లు ఎందుకు మార్చారని విద్యార్ధినులు అడుగుతున్నారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీ హస్టల్ బాత్ రూమ్ లలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే ఆరోపణలతో విద్యార్ధినులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించింది. అంతేకాదు, ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనపై వాస్తవాలను తేల్చేందుకు జేఎన్ టీయు కూడా మరో కమిటీని ఏర్పాటు చేసింది.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది?

గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిని అదే జిల్లాకు చెందిన విద్యార్ధి చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ విద్యార్థి బాయ్స్ హాస్టల్లో, అమ్మాయి గర్ల్స్ హస్టల్ లో ఉంటున్నారు. అమ్మాయిల హస్టల్ లోని బాత్ రూమ్ లలో రహస్య కెమెరాను అమర్చి ఆ వీడియోలను తన స్నేహితుడికి విద్యార్ధిని పంపుతున్నారని తోటి విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.

మూడు రోజుల క్రితం ఈ విషయమై కాలేజీ విద్యార్ధినులు వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. కానీ, వార్డెన్ తమపై ఆగ్రహం వ్యక్తం చేసిందని విద్యార్ధినులు చెప్పారు. విద్యార్ధినుల చిత్రాలను షేర్ చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఫైనలియర్ విద్యార్ధిపై సహచర విద్యార్ధులు ఈ నెల 29వ రాత్రి దాడి చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.

విద్యార్ధుల అనుమానాలు ఇవీ...

విద్యార్ధినులు ఉపయోగించే బాత్ రూమ్ లలో షవర్లు, ట్యాప్ లను మార్చారు. రహస్య కెమెరాలకు సంబంధించి న్యాయం కోసం విద్యార్ధినులు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే కొన్ని బాత్ రూమ్ లలో ట్యాప్ లు, షవర్లు ఎందుకు మార్చారని విద్యార్ధినులు అడుగుతున్నారు. ఇంతకాలం వీటిని మార్చకుండా ఇప్పుడే ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు మేనేజ్ మెంట్ నుండి సరైన సమాధానం లేదనేది విద్యార్ధినుల వాదన.

మొబైల్, ల్యాప్ టాప్ లలో ఏం దొరికాయి?

విద్యార్ధినులు ఆరోపిస్తున్న ఫైనలియర్ విద్యార్ధితో పాటు ఆయన స్నేహితురాలికి చెందిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లను పోలీసులు తనిఖీ చేశారు. అయితే, ఇందులో ఎలాంటి వీడియోలు లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. కానీ, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు మాత్రమే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

అయితే వీరిద్దరిపైనే తమకు అనుమానాలున్నాయని విద్యార్ధినులు ఆరోపణలు చేశారు. 300 వీడియోలు బయటకు వెళ్లాయని అనుమానాలున్నాయని చెప్పారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్ధినుల ఆందోళన.... కొల్లు రవీంద్ర హామీతో విరమణ

గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరో వైపు జిల్లా మంత్రి కొల్లు రవీంద్రను సంఘటన స్థలానికి వెళ్లాలని సూచించారు.

సీఎం ఆదేశంతో కొల్లు రవీంద్ర స్వయంగా వెళ్ళి ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో మాట్లాడారు. విద్యార్ధినుల ఫిర్యాదుపై సరిగా స్పందించని వార్డెన్ పద్మావతిపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు, శాస్త్రీయంగా ఆధారాలు సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.

గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ, టెక్నికల్ విభాగం ఎస్ఐ మాధురి, మరో ముగ్గురు కానిస్టేబుళ్లతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మంత్రి రవీంద్ర చెప్పారు. ఈ విషయమై వాస్తవాలు తేల్చేందుకు జేఎన్ టీయూ కూడా ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

వర్శిటీ ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఎంపవర్ మెంట్ ఆఫ్ విమెన్ అండ్ గ్రీవెన్సెస్ ఇన్ ఛార్జి డైరెక్టర్ యు.వి. రత్నకుమారి, ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఛార్జి డైరెక్టర్ ఎ.ఎస్. ఎన్. చక్రవర్తిలతో కమిటీని ఏర్పాటు చేసింది.

విద్యార్ధినుల హస్టల్ లో సోదాలు.. పోలీసుల అదుపులో విద్యార్ధిని

కాలేజీ హస్టల్ లో రహస్య కెమెరాలు లేవని తేలిస్తేనే తాము ఉంటామని విద్యార్ధినులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసు అధికారులు బాంబు స్క్వాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే డివైజ్ లతో నాలుగు గంటల పాటు సోదాలు చేశారు. ఎలాంటి రహస్య కెమెరా లేదని పోలీసులు తేల్చారు. దీంతో విద్యార్ధినులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 వరకు కాలేజీకి సెలవు ప్రకటించారు. హస్టల్ వదిలి విద్యార్ధినులు ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యార్ధులు కాలేజీ వదిలివెళ్లిన తర్వాత కూడా సోదాలు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు.

సోషల్ మీడియాలో ప్రచారాలు

గుడ్లవల్లేరు ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వీడియోలు పొరపాటున కొందరు చూశారని... ఈ వీడియో బయటకు రాకుండా ఉండేందుకు కాలేజీ వాష్ రూమ్ లో రహస్య కెమెరా పెట్టించారనే ప్రచారం సాగుతోంది. మరో వైపు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవలు రావడమే ఈ అంశం వెలుగు చూసేందుకు కారణమైందని మరికొందరు అంటున్నారు. ఈ ప్రచారాల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్ధినుల బాత్ రూమ్ లలో నిజంగానే హిడెన్ కెమెరాలు పెట్టి తొలగించారా... అసలు కెమెరాలే లేవా అనే విషయాన్ని నిపుణుల కమిటీ నిర్ధారించాల్సి ఉంది. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories