Godavari River: గోదావరికి వరద పోటు.. ముంపులో ఐదు మండలాలు

Godavari River: గోదావరికి వరద పోటు.. ముంపులో ఐదు మండలాలు
x
Godavari Floods
Highlights

Godavari River: మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వచ్చిన వరదలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

Godavari River: మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వచ్చిన వరదలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి ఉప నదుల నుంచి ఎక్కువగా వరద నీరు వస్తుండటంతో ఎక్కడికక్కడే వరద ప్రవాహం పెరుగుతోంది. దీనివల్ల భద్రాచలం వద్ద ఒకటో ప్రమాద ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదే విధంగా చుట్టూ పరివాహక ప్రాంతాల్లోని వర్షం నీరు మరింత వచ్చి గోదావరిలో చేరుతుండటంతో దవళేశ్వరం వద్ద వరద మరింత పెరిగింది. దీంతో ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీచేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఐదు మండలాలు ముంపులో చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పరీవాహక ప్రాంతంలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద శనివారం ఉ.7 గంటలకు వరద నీటి మట్టం 46 మీటర్లకు చేరడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. తాలిపేరు ప్రాజెక్ట్‌ నుంచి 23 గేట్లు పూర్తిగా ఎత్తి 1.23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అలాగే..

► పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్దకు 13 లక్షల క్యూసెక్కులకు పైగా చేరుతుండటంతో వరద నీటి మట్టం 27.80 మీటర్లకు చేరింది. స్పిల్‌వేలోకి భారీగా వరద నీరు చేసింది. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

► ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం గంటగంటకూ పెరుగుతోంది. శనివారం ఉ.6 గంటలకు 7.19 లక్షల క్యూసెక్కులు.. మ.12.30 గంటలకు అది ౧౦ లక్షల క్యూసెక్కులకు చేరింది. సా.6గంటలకు 12.60లక్షల క్యూసెక్కులు రాగా.. రాత్రికి 13.75 లక్షల క్యూసెక్కులు దాటుతుందని.. రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

► వచ్చిన వరదను వచ్చినట్టు 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు.

► ఇక ఎగువ సీలేరులోని గుంతవాడ రిజర్వాయర్‌ నిండుకుండలా మారడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు.

► విలీన మండలాలైన చింతూరు, కూనవరం వీఆర్‌ పురం, ఎటపాక మండలాలతోపాటు దేవీపట్నం మండలం వరద ముంపులో చిక్కుకున్నాయి. ఎద్దెలవాగు, రుద్రంకోట వాగు పొంగిపొర్లుతున్నాయి.

► పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి వరద పోటెత్తడంతో కుక్కునూరు మండలం లచ్చగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

► లంక, లోతట్టు, ముంపు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో కూడిన బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కాకినాడలో శనివారం తెలిపారు.

శ్రీశైలంలోకి స్థిరంగా వరద

శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువన జూరాల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి.. సుంకేశుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన తుంగభద్ర వరద తోడవడంతో శనివారం సా.6గంటలకు ప్రాజెక్టులోకి 1.25 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 136.6 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ జెన్‌కో 42,987 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

► ఇక నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 246.54 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన కురిసిన వర్షాలతో పులిచింతల ప్రాజెక్టులోకి 3,426 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.

► ఇక ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలవల్ల పులిచింతలకు దిగువన కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 77,371 క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 52,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం రాత్రికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

► తుంగభద్ర డ్యామ్‌లో నీటి నిల్వ 96.38 టీఎంసీలకు చేరుకుంది. మరో నాలుగు టీఎంసీలు చేరితే డ్యామ్‌ నిండిపోతుంది.

► దిగువకు విడుదల చేస్తున్న వరదను కర్ణాటక తగ్గించింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరగానే.. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేయనుంది. దీంతో శ్రీశైలంలోకి మళ్లీ వరద పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories