Telugu States: ఏపీ, తెలంగాణ మధ్య నూతన శకం మొదలైనట్టేనా?

Had a New Chapter Started on Two Telugu States
x

Telugu States: ఏపీ, తెలంగాణ మధ్య నూతన శకం మొదలైనట్టేనా?

Highlights

Telugu States: రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశమే. అటు చంద్రబాబునాయుడు గురించి అందరికీ తెలుసు.

Telugu States: రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశమే. అటు చంద్రబాబునాయుడు గురించి అందరికీ తెలుసు. అలాగే రేవంత్ రెడ్డి గురించి కూడా ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరి మధ్య ఉన్న గాఢానుబంధం కూడా ఎవరికీ తెలియందేం కాదు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేఖ రాయడం అందుకు రేవంత్ రెడ్డి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయి. మరి ఆ ఇద్దరి మధ్య చోటు చేసుకోబోయే చర్చాంశాలేంటి?

ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక అసాధారణమైన సమావేశం చోటు చేసుకోబోతోంది. వ్యక్తిగతంగా ఎంతో చనువున్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఆరో తేదీన హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు. వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడంలో పెద్ద చెప్పుకోదగ్గ అంశాలేమీ లేకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలుసుకోవడమే ఆసక్తి రేపుతోంది. ఏపీ నుంచి చంద్రబాబునాయుడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల హోదాలో కలుసుకోబోతుండడంతో రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అనేక సమస్యలు ఇక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాలే కీలకంగా మారుతున్నాయి. అయితే పలు సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఈపాటికే జరిగి ఉండేదని ఏపీ ముఖ్యమంత్రులు మొండిపట్టుదలకు పోయి విషయాలను జటిలం చేస్తున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇటీవల చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తాను భేషజాలకు పోబోవడం లేదని రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పడం విశేషం. తన ముందున్న లక్ష్యాల్లో అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేయడమేనని చెప్పడం కొసమెరుపు. మరోవైపు బహుశా ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు స్వయంగా రేవంత్ కు లేఖ రాసి ఉంటారని అందువల్ల ఈసారి రెండు రాష్ట్రాలు సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి.

ఏపీని త్వరితగతిన అభివృద్ధి చేసే ఉద్దేశంతోనా అన్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో వేగం పెంచారు. పెన్షన్ల పంపిణీతోనే అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెంచారు. దానికి కొనసాగింపుగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈనెల 6న తాను హైదరాబాద్‌ వచ్చి కలుస్తానని, ఇద్దరం కూర్చొని రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకుందామని చంద్రబాబు ఆ లేఖలో ప్రతిపాదించారు. పరస్పరం సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ఎక్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశారు చంద్రబాబునాయుడు.

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి కూడా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ ప్రయత్నాలేవీ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరగలేదని విమర్శించడం గమనించాల్సిన అంశం. దీంతో సమావేశ ఎజెండా విషయంలో ఏకాభిప్రాయం పూర్తి స్థాయిలో వ్యక్తమైనట్టే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు 6వ తేదీన హైదరాబాద్ లో రేవంత్ తో భేటీకి ముందే 4వ తేదీన చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అవుతుండడం విశేషం. ఆ సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా చంద్రబాబు తీసుకొచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు తొలినాళ్లలో వారిద్దరి మధ్య సత్సంబంధాలున్నా రాష్ట్ర విభజన సమస్యల విషయంలో మాత్రం అడుగులు ముందుకు పడలేదు. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే పైకి సత్సంబంధాలు ఉన్నట్టు కనిపించినా రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం మరింత జటిలమవుతూ వచ్చాయి. ముఖ్యంగా నీటి పంపకాలు, ఆస్తుల్లో వాటాలపై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారడం, మారిన ముఖ్యమంత్రులిద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదరడంతో.. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్‌ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్‌ అధికారులు కూడా హాజరవుతున్నారు.

ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబునాయుడు కీలకంగా మారినందున విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా సహకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగింది. గత నెల 2వ తేదీ నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 లోని సెక్షన్ 8 కూడా ఉనికిని కోల్పోయింది. అయితే పదేళ్లు గడుస్తున్నా.. అనేక సమావేశాలు నిర్వహించుకున్నా.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన మాత్రం పూర్తిగా జరగలేదు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన రోజురోజుకీ క్రిటికల్ గా మారింది. రెండు రాష్ట్రాల పంచాయతీ కోర్టుకెక్కింది. ఆస్తుల విభజనకు మధ్యవర్తిని నియమించాలని ఏపీ కోరుతుంటే.. అవసరం లేదని తెలంగాణ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో వాదిస్తున్నాయి. దశాబ్దం తరువాత కూడా రెండు రాష్ర్టాల మధ్య షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశం హాట్ టాపిగ్గానే కొనసాగుతోంది. ఈ పదేళ్లలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు చొరవ తీసుకోవడం విశేషం. రెండు రాష్ట్రాల అధికారులు కూర్చుని చర్చించారు. అయినా ఎక్కడా కూడా సరైన పరిష్కారం కనిపించలేదు. ఫలితంగా ఆస్తుల విభజన అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం మొత్తం 91 సంస్థలు.. షెడ్యూల్ 10లోని 142 సంస్థల విభజన జరగాల్సి ఉంది. వీటిలో షెడ్యూల్ 9 సంస్థల విభజనపై షీలా భిడే కమిటీ అధ్యయనం చేసి కొన్ని సిఫారసులు చేసింది. సంస్థ కేంద్ర కార్యాలయం ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని ప్రతిపాదించింది. కేంద్ర కార్యాలయం అంటే ఏంటో కూడా షీలా స్పష్టమైన నిర్వచనమే ఇచ్చారు. ఐతే, షీలా భిడే కమిటీ సిఫారసుల్లో 23 సంస్థల విభజనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం ఉన్న సంస్థలు వదిలేసి, ఏకాభిప్రాయం ఉన్న 68 సంస్థలతో ముందు విభజన ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పట్లో సూచించింది. ఇందుకు తెలంగాణ ఒప్పుకున్నా ఏపీ మాత్రం ఒప్పుకోలేదు.

రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ నడుస్తుండగానే ఆస్తుల పంపకాల కోసం ఒక మధ్యవర్తిని నియమించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ పై తెలంగాణతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కౌంటర్ దాఖలు చేశాయి. ఆస్తుల విభజన కోసం ఆర్బిట్రేటర్ అక్కర్లేదని వాదించాయి. మరోవైపు 9వ షెడ్యూల్లోని సంస్థల్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్-ఎస్.ఎఫ్.సి తో అసలు కిరికిరి తయారైంది. దీని విభజనకు భారత ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని 2014 పునర్విభజన చట్టంలో ఉంది. రాష్ట్ర విభజన సమయానికి ఎస్.ఎఫ్.సి. పాలకమండలిలో అత్యధిక మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే ఉన్నారు. చట్టంలోని సెక్షన్ 71 ప్రకారం సంస్థలో తెలంగాణకు సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. దాన్ని పట్టించుకోకుండా సమాన ప్రాతినిధ్యం కల్పించకపోగా షీలా భిడే కమిటీ సిఫార్సులకు భిన్నంగా ఆ సంస్థ భూములు కూడా పంచాలని కార్పొరేషన్ మెంబర్లు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు హైదరాబాద్ నానక్‎రాంగూడా, గాజులరామారం గ్రామాల్లో సుమారు 500 ఎకరాల ఆస్తి ఉంది. ఈ ఆస్తి విలువ సుమారు 4 వేల కోట్లు చేస్తుంది. అయితే ఎస్.ఎఫ్.సి బోర్డు తీర్మానంతో వేల కోట్ల ఆస్తి ఇబ్బందుల్లో పడింది. ఆ ఆస్తుల పంపకం కుదరదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. అయితే పంచి తీరాల్సిందేనని ఆంధ్రా పట్టు పడుతోంది.

మరోవైపు 10వ షెడ్యూల్ లోని ఆస్తులు పంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదు. అయితే ఈ సంస్థలకు సంబంధించిన నగదు మాత్రం రెండు రాష్ట్రాలు పంచుకోవాలని చట్టంలో పొందుపరచారు. ఇక్కడ కూడా ఆంధ్రా సర్కారు వ్యవహారశైలి ఇందుకు భిన్నంగానే ఉంది. 10వ షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు కూడా పంచి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో మొత్తం 142 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉండాలని నిర్ణయిస్తూ 2017 మే నెలలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా మొండి వైఖరి వీడకుండా ఆంధ్రా ప్రభుత్వం ఈ వ్యవహారంపై కోర్టు మెట్లెక్కింది. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ... చట్ట ప్రకారం పదో షెడ్యూల్ ఆస్తుల విభజన కుదరదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ఇలా విభజన జరిగి పదేళ్లయినా... రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఆస్తుల విభజన మాత్రం కొలిక్కి రాలేదు. ఈ లోపు ప్రభుత్వాలు మారడం, ముఖ్యమంత్రులు మారడంతో.. పాత సమస్యలు సరైన కొత్త పరిష్కారాలు దొరకడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆస్తులన్నీ ఉమ్మడి ఖాతాలోనే ఉంటాయి. కానీ ప్రాంతం విడిపోయాక ఆస్తులు విడివిడి లెక్కల్లో జమవుతాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు అన్యాయం జరిగిందన్న వాదన కొందరు ఏపీ నేతల్లో వ్యక్తమవుతూ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన జరిగాక పదేళ్లలో ఆస్తులు, అప్పులకు సంబంధించి రాతకోతలు పూర్తి చేసుకోవాలని, లెక్కాపత్రాలు పక్కాగా రూపొందించుకోవాలని.. ఆపై అభివృద్ధి పరుగుపందెంలో పోటీ పడుతూ కాలానికి సవాళ్లు విసురుతూ సాగిపోవాలని అంతా ఆకాంక్షించారు. అయితే ఆ స్ఫూర్తి మాత్రం గత ప్రభుత్వాల హయాంలలో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ఏపీ వైపు అసలే కనిపించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.

విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న 245 సంస్థలు, కార్పొరేషన్లను విభజించాలని ఏపీ సర్కారు పిటిషన్ వేసింది. ఆ షెడ్యూళ్లలో పేర్కొన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు లక్షా 42వేల 601 కోట్లు అవుతుందని.. వాటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని.. న్యాయమైన వాటా ఇప్పించాలని ఏపీ కోరింది. అదిప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన జరగకపోవడం తెలంగాణకే మేలు చేస్తుందని ఏపీ సర్కారు వాదనగా ఉంది. ఆ 245 సంస్థల ఆస్తుల్లో 91 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయంటున్న ఆంధ్రా... ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే ఆయా సంస్థల ఆస్తులను తెలంగాణ పెట్టుబడులుగా పెట్టి లబ్ది పొందుతుందని చెబుతోంది. ఆ అవకాశం ఏపీకి లేదని ఏపీ సర్కారు వాపోతోంది. 2014 జూన్ 2నే విభజన అమల్లోకి వచ్చినా.. ఆస్తులు, అప్పుల పంపిణీ ప్రక్రియ అసలు మొదలే కాలేదంటోంది ఆంధ్రా. అంతేకాదు.. లక్షా 59వేల 96 మంది ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మీద కూడా ఇంకా క్లారిటీ లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. పెన్షన్ తీసుకునే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు. 8 ఏళ్ల తరువాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపిణీ జరిగిన విధంగానే 200కు పైగా ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తుల పంపిణీ కూడా జరగాలని ఏపీ ఆశిస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా ఉన్న కెమిస్ట్రీ కారణంగా ఇప్పటివరకు జటిలంగా మారిన సమస్యలు కూడా దూదిపింజల్లా మారిపోయి త్వరితగతిన పరిష్కారానికి నోచుకునే అవకాశాలు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతుంది. పరిష్కారం కాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడే ఆస్కారం లేదు. అయితే ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్లీ ఎన్నికైన దృష్ట్యా.. రాష్ట్రాన్ని నవ్యపథంలో నడిపించే అరుదైన అవకాశం సొంతం చేసుకున్న వ్యక్తిగా తన ముందున్న లక్ష్యాలను అందుకోవాలని చంద్రబాబు పరిపాలనలో వేగం పెంచారు. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండడమే గాక.. తెలంగాణలోనూ తనకు అనుకూలమైన ముఖ్యమంత్రి ఉండడం కచ్చితంగా ఏపీకి కలిసొస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories