Gudlavalleru College Hostel: హిడెన్ కెమెరాలను ఎలా పసిగట్టాలి ? ఈజీ టెక్నిక్స్ ఇదిగో

How to detect spy cameras in your room
x

How to detect hidden cameras in your room

Highlights

Gudlavalleru College Hostel: సామాన్యులే కాదు.. స్వయంగా కేంద్రమంత్రి సైతం ఈ హిడెన్ కెమెరాలకు బాధితురాలుగా మిగిలిపోయారు. ఆమె ఎవరో కాదు.. స్మృతి ఇరానినే. 2015లో స్మృతి ఇరాని కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన భర్తతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు.

Gudlavalleru College Hostel: అమ్మాయిల హాస్టల్ బాత్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి స్టూడెంట్స్ నగ్న చిత్రాలు రికార్డు చేస్తున్నారనే ఘటన సంచలనం సృష్టించింది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులోని శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

నిన్నగాక మొన్న ఇలాంటి ఘటనే శంషాబాద్‌లోని ఓయో హోటల్లో వెలుగుచూసింది. హోటల్‌లో బస చేసే జంటల వీడియోలను హిడెన్ కెమెరాలతో రికార్డ్ చేసి, ఆ తరువాత వారిని బ్లాక్‌మెయిల్ చేస్తోన్న హోటల్ సీతా గ్రాండ్ యజమాని గణేష్‌ని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సామాన్యులే కాదు.. స్వయంగా కేంద్రమంత్రి సైతం ఈ హిడెన్ కెమెరాలకు బాధితురాలుగా మిగిలిపోయారు. ఆమె ఎవరో కాదు.. స్మృతి ఇరానినే. 2015లో స్మృతి ఇరాని కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తన భర్తతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు. అక్కడ ఫ్యాబ్ ఇండియా అనే పాపులర్ క్లాతింగ్ స్టోర్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లారు. అక్కడ ట్రయల్ రూమ్‌లో హిడెన్ కెమెరా ఉండటం గుర్తించిన స్మృతి ఇరాని.. వెంటనే దానిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి నలుగురు నిందితులను అరెస్ట్ చేయించారు.

హాస్టల్లో సీక్రెట్ కెమెరాలతో అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ చేయడం.. హోటళ్ళలో స్టే చేస్తున్న జంటల నగ్న వీడియోలు రికార్డు చేసి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఇంకా, షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో , పబ్లిక్ ప్లేసెస్‌లో ఉండే టాయిలెట్స్‌లో మహిళల వీడియోలు రికార్డ్ చేయడం అనేది కూడా అప్పుడప్పుడు బయటపడుతున్న నేరాలే. బయటపడనివి ఇంకెన్నో.. చెప్పుకోని బాధితులు ఇంకెందరో.. ఇలాంటి నేరాలు చాలామందికి స్వేచ్చగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్నత చదువుల కోసమో లేక ఉద్యోగరీత్యానో ఇంటికి దూరంగా ఉండే అమ్మాయిలు, మహిళలే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు.

మరి ఈ హిడెన్ కెమెరా నేరాలకు చెక్ పెట్టలేమా అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. ఇదిగో ఈ డీటేల్స్ అందుకోసమే. అసలు ఒక మనిషి కంటికి కనిపించకుండా.. అస్సలు ఏ మాత్రం అనుమానమే రాకుండా సీక్రెట్ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? ఎలా ఏర్పాటు చేస్తారు?

మీరు ఉండే చోట అలాంటి హిడెన్ కెమెరాలు ఇన్ స్టాల్ చేసి ఉన్నాయా ? ఒకవేళ రహస్య కెమెరాలు ఉంటే.. వాటిని గుర్తించడం ఎలా ? అనే వివరాలు తెలుసుకుంటే మనం వాటిబారిన పడి బాధితులుగా మారే ప్రమాదం కూడా లేకుండా ఉంటుంది కదా!! మరి ఇంకెందుకు ఆలస్యం.. హిడెన్ కెమెరాల భరతం పడదాం రండి.

అసలు హిడెన్ కెమెరా అంటే ఏంటి ?

హిడెన్ కెమెరా.. సీక్రెట్ కెమెరా.. స్పై కెమెరా.. ఇలా పేర్లు ఏమైనా కావచ్చు. కానీ వాటన్నింటికి అర్థం ఒక్కటే. గదుల్లో ఉన్నవారికి తెలియకుండా వారిని రహస్యంగా వీడియో తీసేందుకు గుట్టుగా అమర్చే కెమేరా. మనుషులు ఏకాంతంలో చేసే పనుల్ని దొంగచాటుగా రికార్డు చేసేందుకు కంటికి కనిపించని విధంగా అమర్చే ఈ దొంగ కెమేరాలు ఒక్కోసారి మనుషుల జీవితాలతో దారుణంగా ఆడుకుంటాయి. ఎవరైనా, ఏదైనా కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోలేమా?

హిడెన్ కెమెరాలను గుర్తించడం ఎలా ?

హిడెన్ కెమెరాలు కంటికి కనిపించకపోవచ్చు… కానీ, వాటి ఆచూకీని కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు. తెలివిగా వ్యవహరిస్తే వాటి గుట్టు మనకు ఇట్టే తెలిసిపోతుంది. చిన్న చిన్న టూల్స్ ‌వాడి ఈ సీక్రెట్ కెమెరాలు గదిలో ఎక్కడున్నాయో పసిగట్టవచ్చు. ఆ తరువాత వాటి వెనుక ఉన్నవారిని బయటకు లాగి శిక్ష పడేలా చేయవచ్చు.

ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి గది లేదా బాత్రూములను ఒకసారి శ్రద్ధగా గమనించాలి. హిడెన్ కెమెరాలు ఎక్కడెక్కడ ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంటుందో వాటిని గుర్తించాలి. వాటి జాబితా ఇలా ఉంది.

స్మోక్ డిటెక్టర్స్ - గదిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అలారం రావడం కోసం గదిలో పై కప్పు భాగంలో ఈ స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేస్తుంటారు. అవి అచ్చం చూడ్డానికి ఒక చిన్న సాధారణ లైట్ మాదిరిగా ఉంటుంది. ఇందులోనూ కొన్ని చిన్నచిన్న పరికరాలు ఉన్నాయి. కొంతమంది దుర్మార్గులు ఎవ్వరికీ అనుమానం రాకుండా వీటిలోనే హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి వాటిని క్లియర్‌గా చెక్ చేయాలి.

ఎయిర్ ఫిల్టర్ ఎక్విప్‌మెంట్ - గదిలో గాలిని ఫిల్టర్ చేయడం కోసం లేదా పర్‌ఫ్యూమ్స్‌తో సువాసనలు వెదజల్లడం కోసం గోడలకు ఎయిర్ ఫిల్టర్స్ వంటివి ఏర్పాటు చేస్తారు. హిడెన్ కెమెరాలకు ఇవి కూడా ఆవాసాలే.

బుక్స్ షెల్ఫ్ - గదిలో షెల్ఫ్‌ల నిండా బుక్స్ అమర్చి అనుమానం రాకుండా వాటి మధ్యలో ఎక్కడో చిన్న కెమెరాను పెడతారు.

డెకరేషన్ మెటిరీయల్ - గదిని అందంగా అలంకరించడం కోసం టీవీ చుట్టూ, టేబుల్‌పై, టీ పాయ్‌పై, సోఫాల పక్కన ఫ్లవర్‌వాజ్‌లతో, లైట్లతో, ఎన్నోరకాలుగా డెకరేషన్ చేస్తుంటారు. కానీ ఆ డెకరేషన్ వస్తువుల్లోనే ఎక్కడో అనుమానం రాకుండా హిడెన్ కెమెరాను పెడతారు.

గదిలో చేతికి అందనంత ఎత్తులో.. లేదా ఎవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేకుండా గ్లాస్ వార్డ్‌రోబ్స్‌లో అలంకరణ కోసం ఏవేవో టాయ్స్ ఏర్పాటు చేస్తారు. అందులోనూ మిమ్మల్ని సీక్రెట్‌గా రికార్డు చేస్తున్న కెమెరా ఉండే ప్రమాదం లేకపోలేదు. ఉదాహరణకు అందరికీ ఇష్టమైన టెడ్డీబేర్ బొమ్మ కళ్లలో కూడా హిడెన్ కెమెరా ఉండొచ్చు.

వైఫై రూటర్, టీవీ సెట్‌టాప్ బాక్స్ లాంటి డిజిటల్ పరికరాలు... బెడ్ పక్కనే టేబుల్‌పై ఉన్న అలారం, గోడకు వేళ్లాడుతున్న వాల్ క్లాక్... చార్జింగ్ పెట్టుకునే పవర్ సాకెట్స్, ఆల్రెడీ స్విచ్ బోర్డుకి పెట్టి ఉన్న చార్జింగ్ అడాప్టర్స్... బట్టలు వేళ్లాడదీసే హ్యాంగర్స్.. టేబుల్‌పై ఉన్న పెన్ హోల్డర్స్, డిజిటల్ క్లాక్స్.. ఇలా ఎక్కడైనా హిడెన్ కెమెరాలు దాగుండే ప్రమాదం ఉంది.

అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని వీడియోలను కూడా క్షుణ్ణంగా వెతకండి. వీలైనంతవరకు వాటి విషయంలో జాగ్రత్తపడండి. ఇలాంటి విషయంలో ఏదీ లైట్ తీసుకోవద్దు. నిందితులు వేసిన ఉచ్చులో పడకముందు తీసుకునే జాగ్రత్త.. మనం వాళ్ల బారిన పడకుండా ఉండటంతోపాటు నిందితులను పట్టించిన వాళ్లం అవుతాం.. అలాగే ఇంకెంతోమంది ఆడపిల్లలను కాపాడిన వాళ్లం అవుతాం.

గదిలో ఏమైనా అనుమానాస్పదంగా పవర్ ఔట్‌లెట్స్ లేదా చార్జింగ్ అడాప్టర్స్ ఉంటే వాటిని తొలగించండి. ఎందుకంటే అడాప్టర్స్‌లో బ్లింక్ అవుతున్నట్లుగా కనిపించే లైట్స్ కూడా హిడెన్ కెమెరా అయ్యుండొచ్చు. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తపడండి.

హిడెన్ కెమెరాలను గుర్తించే మరో టెక్నిక్..

గదిలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చిమ్మచీకటి ఉండేలా చేయండి. ఆ తరువాత ఏదైనా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ కలియ తిరగండి. మరీ ముఖ్యంగా అనుమానాస్పద ప్రాంతంలో ఫ్లాష్‌లైట్‌తో వెతకండి. ఎందుకంటే.. అక్కడ ఏదైనా హిడెన్ కెమెరా ఉంటే.. ఆ కెమెరా లెన్స్ మీ ఫ్లాష్‌లైట్ పడటంతోనే మెరుస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యే లెన్సే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా.

వైఫై నెట్‌వర్క్

సాధారణంగా హిడెన్ కెమెరాలకు వైర్స్ ఉండవు. వాటిని ఇన్‌స్టాల్ చేసిన కన్నింగ్ ఫెలోస్ ఎక్కడో దూరంగా రిమోట్‌లో ఉంటూ మీ కదలికల్ని రికార్డ్ చేస్తూ, వీక్షిస్తుంటారు. అందుకోసం వైఫై నెట్‌వర్క్ ఉపయోగించుకుంటారు. అంటే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా అక్కడే ఉన్న వైఫై నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుందన్నమాట.

ఒకవేళ మీకు వైఫై నెట్‌వర్క్ యాక్సిస్ ఉంటే అందులోకి లాగిన్ అయి ఏయే డివైజెస్ కనెక్ట్ అయ్యాయో చెక్ చేయండి. ఏవైనా అనుమానాస్పందంగా ఉంటే వాటిని రిమూవ్ చేయండి. ఒకవేళ మీకు యాక్సిస్ లేకున్నా.. వైఫై స్కానింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని ఎక్స్‌ట్రాగా కనెక్ట్ అయిన డివైజెస్ గుర్తించవచ్చు. కానీ పబ్లిక్ ప్లేసెస్‌లో ఇది కొంచెం క్లిష్టమైన పని. ఎందుకంటే వైఫై కూడా పబ్లిక్ అందరికీ కామన్‌గా ఉంటుంది. అందులో ఏయే పరికరాలు, ఎవరెవరు ఉపయోగిస్తున్నారో గుర్తించడం కొంత కష్టం.

మొబైల్‌తో హిడెన్ కెమెరా గుర్తించడం ఎలా?

ఎవరైనా ఒకరితో ఫోన్ మాట్లాడుతూ నెమ్మదిగా గది అంతా కలియ తిరగండి. ఎక్కడైనా హిడెన్ కెమెరా దాగి ఉంటే అక్కడ మీకు ఆడియో డిస్టర్బ్ అవడం లేదా సిగ్నల్ డిస్టర్బ్ అవడం జరుగుతుంది. హిడెన్ కెమెరా సిగ్నల్స్ మీ మొబైల్ నెట్‌వర్క్‌ని అడ్డుకోవడం వల్ల కలిగే అవాంతరం ఒక డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. అక్కడ మీరు క్షుణ్ణంగా వెతికితే ప్రయోజనం ఉంటుంది. హిడెన్ కెమెరాలు, హిడెన్ మైక్రోఫోన్స్ విషయంలో ఇది జరిగే అవకాశం ఉంది.

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫ్రంట్ కెమెరాతో గది పరిసరాలను రికార్డ్ చేసినప్పుడు.. హిడెన్ కెమెరాలు ఉంటే వాటి ఇన్‌ప్రారెడ్ లైట్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ వెతికితే ఫలితం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో హిడెన్ కెమెరాలు గుర్తించే యాప్స్ పేరిట బోలెడన్ని యాప్స్ ఉన్నాయి కానీ సరైన అవగాహన లేకుండా వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్. ఎందుకంటే వీటిలోనూ స్పై యాప్స్ చాలానే ఉంటాయి. అంటే సేఫ్టీ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసి మనంత మనమే వాళ్లకి చిక్కడం అవుతుంది.

రేడియో ఫ్రీకెన్సీ సిగ్నల్ డిటెక్టర్స్..

అమేజాన్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కొన్నిరకాల రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ ఉంటాయి. వీటి సాయంతో హిడెన్ కెమెరా ఏ కన్నంలో దాగున్నా ఇట్టే పట్టేయొచ్చు. కాకపోతే ఈ డిటెక్టర్స్ ఆన్ చేయడానికంటే ముందే చిన్నచిన్న పరికరాలతో పాటు పెద్దపెద్ద వాటి వరకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి. ఆ తరువాత ఈ డిటెక్టర్‌తో సోదా చేస్తే.. ఎక్కడైతే స్పై కెమెరా ఉంటుందో.. అక్కడ డిటెక్టర్స్ సిగ్నల్ క్యాచ్ చేసి ఆడియో రూపంలో అలారం ఇస్తుంది.

బాత్రూమ్స్‌లో, బెడ్ రూమ్స్‌లో అద్దాల చాటున సీక్రెట్ కెమెరాలు

బాత్రూమ్స్‌లో, బెడ్ రూమ్స్‌లో ఉండే అద్దాలు ముందు నుండి చూడ్డానికి అద్దాల తరహాలో కనిపించినప్పటికీ వాటి చాటున సీక్రెట్ కెమెరాలు దాగుండే ప్రమాదం ఉందని చాలామందికి తెలియదు.

అద్దాల చాటున దాగి ఉన్న సీక్రెట్ కెమెరాలు గుర్తించడం ఎలా?

అద్దంపై వేలు పెడితే.. ఆ వేలుకి, అద్దంలో కనిపించే ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తే సమస్య లేదు. అలాకాకుండా ఒకవేళ వేలి చివరి భాగానికి, అద్దంలో కనిపించే వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉంటే.. అక్కడ " సమ్‌థింగ్ ఈజ్ దేర్ " అని అనుకోవాల్సిందే అంటున్నారు ఈ రంగంలో పనిచేసే ఎక్స్‌పర్ట్స్. ఏదేమైనా.. వీలైతే ఆ అద్దం వెనుక భాగం ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటే ఆ పనిచేయడం మరీ ఉత్తమం.

మీరు ఉండే గదిలో ఏదైనా వస్తువుకు లేదా కిటికీకి, గది తలుపు లోపలి భాగంలో బిగించే నట్లు, బోల్టులు, స్క్రూలల్లో కూడా హిడెన్ కెమెరా ఉండే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే కన్నింగ్ ఫెలోస్‌కి వచ్చినంత కన్నింగ్ ఐడియాలు అందరికీ రావు. వాళ్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడైనా హిడెన్ కెమెరాను పెట్టవచ్చు.

హిడెన్ కెమెరాను వెతకడం మీ వల్ల కావడం లేదు అనుకుంటే మార్కెట్లో ఆ పని చేసే పెట్టే టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఉన్నారు. పైగా వాళ్ల దగ్గర స్పై కెమెరాలను గుర్తించేందుకు అవసరమైన పూర్తి ఎక్విప్‌మెంట్ కూడా ఉంటుంది.

హిడెన్ కెమెరాలను గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలి ?

ఒకవేళ మీరు సక్సెస్‌ఫుల్‌గా హిడెన్ కెమెరాలను గుర్తించినట్లయితే.. వెంటనే తొందరపడి వాటిని తాకడం, అక్కడి నుండి తొలగించడం వంటివి చేయొద్దు. ఎందుకంటే అవి ఇన్‌స్టాల్ చేసిన వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ చెరిగిపోయి మీ ఫింగర్ ప్రింట్స్ పడే ప్రమాదం ఉంటుంది. అదే కానీ జరిగితే అసలు దొంగ ఎవరో దొరికే ఛాన్స్ ఉండదు. అందుకే ఆ కెమెరాకు ఎదురుగా ఏవీ కనిపించకుండా జాగ్రత్తపడుతూ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మిగతా పని వాళ్లే చూసుకుంటారు.

హిడెన్ కెమెరాల బారినపడి ఇబ్బందుల పాలవకుండా ఆడపిల్లల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం అందించిన ఈ సమాచారం మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు కూడా చేరవేయండి. ఎందుకంటే ఇది మీరు వారిపట్ల తీసుకునే కేరింగ్‌ని సూచిస్తుంది. అంతేకాదు.. మీరు మరో నలుగురిని చైతన్యపరిచి ఇలాంటి వాటి బారిన పడకుండా కాపాడిన వాళ్లు కూడా అవుతారు. మీ ఫీడ్‌బ్యాక్ ఏదైనా మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాతో పంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories