గుడివాడ అంటే కొడాలి నాని.. గెలిచేనా ఈసారి?

Gudivada means Kodali Nani Will he win this time
x

గుడివాడ అంటే కొడాలి నాని.. గెలిచేనా ఈసారి?

Highlights

ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఈ నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం తన అడ్డాగా మార్చకున్నారు కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని తెలిపాయి. ఏపీలో ఏ పార్టీ విజయం సాదిస్తుందో తెలుసుకొనేందుకు ఆసక్తి చూపినట్టే గుడివాడ ఫలితం కోసం చూసేవారు కూడా అదే స్థాయిలో ఉంటారు.

ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఈ నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం తన అడ్డాగా మార్చకున్నారు కొడాలి నాని. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాని...అదే పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని...ఐదో సారి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము బరిలోకి దిగారు. వెనిగండ్ల రాముది కమ్మ సామాజిక వర్గం. ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గం. దీంతో రెండు సామాజిక వర్గాల ఓట్లు రాబట్టుకునేలా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు అమలు చేసింది.

కొడాలి చుట్టూ గుడివాడ పాలిటిక్స్

గుడివాడ అంటే కొడాలి నాని.. నాని అంటే గుడివాడ అనేలా రాజకీయాలను మార్చేశారు కొడాలి నాని. నాలుగుసార్లు వరుస విజయాలతో ఈ నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులకు ఆయన సవాల్ విసిరారు. 2004లో టీడీపీ నుంచి కొడాలి నాని మొదటి సారి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనససభలో అడుగు పెట్టారు. తర్వాత 2009లో కూడా టికెట్ తెచ్చుకుని రెండోసారి కూడా టీడీపీ తరపున విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి ముచ్చటగా మూడోసారి గెలుపొందారు. 2019లోనూ విజయం సాధించి...జగన్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై ఆయన పంచ్‌ డైలాగ్‌లతో విమర్శలు చేసేవారు. ఈసారి గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని టీడీపీ కూడా పట్టుదలతో పనిచేసింది. కొడాలి నాని తన పట్టును నిలుపుకొనేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించారు.

రికార్డు స్థాయిలో 82.51 శాతం పోలింగ్

2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో గుడివాడలో పోలింగ్ భారీగా నమోదైంది. 2019లో 79 శాతం పోలింగ్ నమోదైతే... ఈసారి 82.51 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో 2,08,374 మంది ఓటర్లు ఉంటే...1,64,617 పోలయ్యాయి. 11.8 ఎక్కువ ఓట్లు పోలవటంతో కొడాలి నాని విజయం సాధించారు. 2024లో 2,04,271 మొత్తం ఓటర్లు ఉంటే...81,119 మంది పురుషులు, 87408 మంది మహిళలు ఓటు వేశారు. మొత్తంగా 1,68,537 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల శాతం కూడా గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. మహిళల ఓట్లు పెరగటం తమకు కలిసి వస్తుందని వైసీపీ, ఓట్ల శాతం పెరగటం తమకు కలిసి వస్తుందిన టీడీపీ అంచనాలు వేస్తుకుంటున్నాయి.

2004 నుంచి ఎదురు లేని నాని

నందమూరి వంశానికి విధేయుడినని చెబుతూనే...చంద్రబాబుని మాత్రం బద్ధవిరోధిగా భావిస్తారు నాని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే...టీడీపీలో చేరి గుడివాడ టికెట్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ద్వారానే రాజకీయాల్లోకి వచ్చి... ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి...చంద్రబాబును రాజకీయంగా విమర్శించడానికి ఏమాత్రం ఆలోచించరు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు...ప్రతి అంశంలో కొడాలి నాని కౌంటర్ ఇవ్వటంలో ముందుటారు. గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే...గుడివాడలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి కొడాలి నాని...2004 నుంచి గెలుస్తూనే ఉన్నారు. 2004లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్‌పై, 2009లో పిన్నమనేని వెంకటేశ్వరరావుపై, 2014లో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై, 2019లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌పై 19వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థి రావటంతో నాని సులభంగా విజయం సాధిస్తున్నారు.

కాపులే మెజార్టీ ఓటర్లు

గుడివాడలో 2.02 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ 45 వేలు, కాపు 32 వేలు, యాదవ 18 వేలు, కమ్మ 15 వేల మంది ఓటర్లు ఉన్నారు. గౌడ 16 వేలు, వెలమ 18 వేలు, బ్రాహ్మణ, వైశ్య, మైనార్టీల ఓట్లు 9 వేలున్నాయి. ఇతర బీసీల ఓట్లు లక్షకుపైగా ఉన్నాయి. గుడివాడలో గెలుపు ఓటములు డిసైడింగ్ చేసేది కాపులే. 32 వేల కాపు సామాజికవర్గం ఓట్లలో ఎవరికి ఎక్కువగా ఆ వర్గం ఓట్లు పోల్ అవుతాయో వాళ్ళే గెలుస్తారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాపు వర్గం...మాజీ మంత్రి కొడాలి నానికి సపోర్ట్‌గా నిలిచింది. గుడివాడలో కాపు సామాజిక వర్గం వంగవీటి రంగాకు సన్నిహితంగా మెలిగేది. ఆయన మరణం తర్వాత రాధా రంగా మిత్ర మండలికి అనుబంధంగా ఇక్కడ కాపు వర్గం ఉంది. రాధా, కొడాలి నాని మంచి మిత్రులు కావటంతో...ఇప్పటి వరకు ఇక్కడ కాపు ఓట్లన్ని కొడాలికే పడ్డాయి. కొత్త అభ్యర్థుల గురించి గుడివాడ తెలుసుకునేలోపు...ఎన్నికలు పూర్తవుతున్నాయి. స్థానికుడైన కొడాలి నానికి పోల్ మేనేజ్‌మెంట్‌లో మంచి పట్టుంది. ఇది కూడా నాని గెలుపునకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నాని దూకుడుకు వెనిగండ్ల కళ్లెం వేస్తారా ?

2004లో నానికి టీడీపీ అభ్యర్ధిగా కొడాలి నానికి 8,864 మెజార్టీ రాగా, 2009లో అది 17 వేలకు చేరింది. 2014లో వైసీపీ తరపున కొడాలి నాని 11 వేల మెజార్టీతో గెలిచారు. 2019లో అది 19,479కి చేరింది. ఈ సారి బలమైన అభ్యర్థిని బరిలోకి దించడంతో కథ మారిపోతుందని టీడీపీ బలగుద్ది చెబుతోంది. కొడాలి నాని దూకుడుకు వెనిగండ్ల రాము...కళ్లెం వేస్తారా ? లేదంటే మాజీ మంత్రి నాని...ఐదోసారి గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలిస్తే సాధారణ విషయంగా....టీడీపీ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ ధీమాతో ఉంటే...గుడివాడ కొడాలి అడ్డా అని నాని వర్గం అంటోంది. కొడాలి నానిని ఓడించటం కోసం రెండేళ్ళ క్రితం నుంచే టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వెనిగండ్ల రామును ఈసారి బరిలోకి దింపింది. జనసేన, బీజేపీతో పొత్తు కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వెనిగండ్ల రాముకు అంత సీన్ లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏం జరుగుతుంతో తెలియాలంటే...ఫలితాల వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories