AP CM YS Jagan: ఏపీ సీఎంకు పెరుగుతున్న ఆధరణ.. 87 శాతం ప్రజల మద్దతు

AP CM YS Jagan: ఏపీ సీఎంకు పెరుగుతున్న ఆధరణ.. 87 శాతం ప్రజల మద్దతు
x
YS Jagan (File Photo)
Highlights

AP CM YS Jagan: సొంత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి తిరుగులేని నాయకునిగా నిలదొక్కుకుంటున్నాడు.

AP CM YS Jagan: సొంత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి తిరుగులేని నాయకునిగా నిలదొక్కుకుంటున్నాడు. పలు పథకాలను అమలు చేసి, లక్షల కుటుంబాలను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తున్నాడు. వీటితో పాటు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఇంతకన్నా ఏం కావాలి? అందుకే ఆయనకే మా మద్దతంటూ ముందుకొచ్చారు. రాష్ట్రంలో 87 శాతం మంది అండగా నిలిచారు.

'సొంత రాష్ట్రంలో ఆదరణ'లో నంబర్‌వన్‌

సొంత రాష్ట్రంలో 87 శాతం ప్రజల మద్దతుతో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా నంబర్‌ వన్‌ స్థానంలో వైఎస్‌ జగన్‌ నిలిచారు. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 63 శాతం, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి 59 శాతం ప్రజల మద్దతు లభించింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు 55 శాతం ప్రజల ఆదరణ లభించగా.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించిన యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రం ఉత్తరప్రదేశ్‌లో 49 శాతం ప్రజాదరణ మాత్రమే దక్కింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణ లభించింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేసే ముఖ్యమంత్రుల జాబితాలో జగన్‌ 11 శాతం ఓట్లతో మూడో స్థానం కైవసం చేసుకున్నప్పటికీ.. సొంత రాష్ట్రంలో మాత్రం ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులందరి కంటే బాగా ముందంజలో ఉండి 87 శాతం ప్రజల మద్దతును పొందగలిగారు. తన ఏడాదిన్నర పాలనలోపే.. దేశంలో బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్‌ జగన్‌ మూడో స్థానంలో నిలిచి యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. 'మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' పేరుతో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వే వివరాలను ఆ పత్రిక వెల్లడించింది.

ముఖ్యమంత్రి జగన్‌కు పెరిగిన ఆదరణ

మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' సర్వే ఈ ఏడాది జనవరిలో చేసినప్పుడు.. వైఎస్‌ జగన్‌కు దేశవ్యాప్తంగా 7 శాతం మంది నుంచి ఆదరణ లభించగా, తాజా సర్వేలో అది 11 శాతానికి పెరిగింది. హామీలు వరుసగా అమలుచేయడం, మేనిఫెస్టోలో లేని పథకాలనూ ప్రవేశపెట్టడం, పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు ప్రజలకు బాగా అందుతుండటంవల్ల ఆదరణ పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో అత్యుత్తమ సీఎం యోగి

దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నెంబర్‌ 1 స్థానంలో నిలిచారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నెంబర్‌ 2లో, నంబర్‌ 3 స్థానాన్ని వైఎస్‌ జగన్‌ సొంతం చేసుకున్నారు. ఈ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24, అరవింద్‌ కేజ్రీవాల్‌కు 15, వైఎస్‌ జగన్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్‌ ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు.

అందరి దృష్టిని ఆకర్షించిన వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో అత్యధిక శాతం (87) ప్రజల మద్దతు పొందడానికిగల ప్రధాన కారణాలను ఇండియా టుడే వెల్లడించింది. అవేమిటంటే..

► అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చడం.

► సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేయడం.

► పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా సమర్థవంతంగా ప్రజలకు చేర్చడం.

► ఈ 'సచివాలయ వ్యవస్థ'ను భవిష్యత్‌ పాలనకు చుక్కానిలా నిర్మించడం.

► తద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలివ్వడం.

Show Full Article
Print Article
Next Story
More Stories